Read more!

English | Telugu

30 సంవత్సరాలపాటు ఉత్తమ నేపథ్య గాయకుడుగా అవార్డు అందుకున్న ఘంటసాల!

ఘంటసాల అంటే మధురగానం.. ఘంటసాల అంటే మహా సంగీతగని. సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు అది. ఎన్నిసార్లు విన్నా.. ఎంత ఆస్వాదించిన తనివి తీరని సంగీత మాధుర్యం. ఆ గొంతు మూగబోయినా, ఆ గానగంధర్వుడు మనమధ్య లేకపోయినా.. ఆయన పాటలు భూమి ఉన్నంత వరకు చిరస్మరణీయమే. కొన్ని దశాబ్దాలపాటు తన గాన మాధర్యంతో అందరికీ మధురానుభూతిని పంచిన ఘంటసాల వర్థంతి ఫిబ్రవరి 11. ఈ సందర్భంగా ఆ మహాగాయకుడ్ని స్మరించుకుంటూ..

ఘంటసాల 1922 డిసెంబరు 4న గుడివాడ దగ్గరలోని చౌటపల్లి గ్రామంలో జన్మించారు. తండ్రి సూర్యనారాయణ, తల్లి రత్నమ్మ. ఘంటసాల వెంకటేశ్వరావుపై చిన్నతనం నుంచి తండ్రి ప్రభావం ఉంది. ఆయన తండ్రి అప్పటికే గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన కుమారుడికి మృదంగం వాయించడంతో పాటు నాట్యం కూడా నేర్పించారు. ఘంటసాల నాట్యానికి మెచ్చి పలువురు ఆయనను బాలభరతుడనేవారు. ఘంటసాల తండ్రి సూర్యనారాయణ కాలం చేస్తూ.. తన వారసత్వాన్ని కొనసాగించమని కుమారుడి వద్ద నుండి మాట తీసుకున్నారు. అయితే తనకు తెలిసిన సంగీతం వేరు. ఆ కారణంతోనే పలు కచేరీల్లో పాల్గొని ఓటమి చవిచూశారు. సంగీతాన్ని శాస్త్రబద్ధంగా  నేర్చుకోవాలన్న పట్టుదలతో సంగీత కళాశాలలో చేరేందుకు తన దగ్గరున్న కొద్ది డబ్బుతో గుడివాడ నుండి విజయనగరం బయలుదేరారు.

విజయనగరం చేరాక కళాశాల అధ్యాపకుల సహాయంతో వారాలు చేసుకుంటూ కొన్నాళ్లు అక్కడే విద్యనభ్యసించారు. విద్యార్థులతో ఏర్పడిన చిన్న గొడవ వల్ల ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. అదే కళాశాలలో గాత్ర పండితులుగా పనిచేస్తున్న పట్రాయని సీతారామశాస్త్రి ఘంటసాలను చేరదీశారు. ఆయన కూడా పేదరికంలోనే ఉన్నారు. అందువల్ల శిష్యుడికి మాధుకరం (ఇంటింటికి వెళ్లి జోలె పట్టి బిచ్చం ఎత్తుకోవడం) చేయడం నేర్పించారు. అలా గురుసేవ చేసుకుంటూ సీతారామశాస్త్రి వద్ద సంగీతంలోని మెళకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ కళాశాలలో చేరి.. నాలుగు సంవత్సరాల సంగీతం కోర్సుని రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేశారు. క్విట్‌ ఇండియా ఉద్యమం జరుగుతున్న రోజులవి. అందులో ఘంటసాల కూడా చేరారు. ఆ ఉద్యమం తీవ్రతరం కావడంతో  ఎందరో ఉద్యమకారులతో పాటు ఘంటసాల కూడా అరెస్టు అయ్యారు. 1942 అరెస్ట్‌ అయిన ఘంటసాల రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. 

1944లో జైలు నుండి తిరిగి వచ్చాక.. తన మేనకోడలు సావిత్రిని పెళ్లి చేసుకున్నారు ఘంటసాల. పెళ్లయ్యాక... సంగీత కచేరీలనే తన జీవనోపాధిగా చేసుకుంటూ అనేక ప్రాంతాలను సందర్శించారు ఘంటసాల. ఆ సమయంలోనే ఓ కచేరీలో ఘంటసాలను చూసిన ప్రముఖ సంగీత దర్శకుడు సముద్రాల రాఘవాచార్యులు.. ఆయన గాత్రానికి ముగ్ధులయ్యారు. చలనచిత్ర పరిశ్రమలోకి రమ్మని ఆహ్వానించారు. ఆయనే దర్శకులు బి.ఎన్‌.రెడ్డికి, చిత్తూరు నాగయ్యకి ఘంటసాలను పరిచయం చేశారు. ‘స్వర్గసీమ’ చిత్రంలో తొలిసారిగా ఘంటసాలకు నేపథ్యగాయకుడిగా అవకాశం ఇచ్చారు బి.ఎన్‌.రెడ్డి. ఆ పాటకు ఆయనకు నూట పదహారు రూపాయలను పారితోషికంగా అందించారు. ఆ తర్వాత నటి భానుమతి తీసిన ‘రత్నమాల’ సినిమాలో కొన్ని పాటలకు సంగీత దర్శకత్వం వహించిన ఘంటసాల ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 

పాతాళభైరవి,  మల్లీశ్వరి, అనార్కలి, మాయాబజార్‌, శ్రీ వెంకటేశ్వర మహత్యం వంటి సినిమాల్లోని పాటలు ఘంటసాలను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. ఆ తర్వాత పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లోని పాటలను ఎంతో మధురంగా ఆలపించి ఆబాల గోపాలాన్ని అలరించారు. దాదాపు 30 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఉత్తమ నేపథ్యగాయకుడిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుండి పురస్కారం పొందిన ఘనత ఏకైక గాయకుడు ఘంటసాల. 

ఘంటసాల తన చివరి రోజుల్లో భగవద్గీతను ఆలపించి ప్రజల గుండెల్లో తన స్థానాన్ని మరింత పదిలపరుచుకున్నారు. ఘంటసాలకు నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం, తుళు, హిందీ చిత్రాల్లో కూడా ఆయన పాటలు పాడారు. 1970లో ఆయన సినీ సంగీత రంగానికి అందించిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అందించింది. భారతదేశంలోనే కాక అమెరికా, ఇంగ్లాండ్‌, జర్మనీలాంటి దేశాలతోపాటు ఐక్యరాజసమితి వేదికపై కూడా సంగీత కచేరీ నిర్వహించిన అరుదైన ఘనత ఘంటసాలకు దక్కింది. అటువంటి మేటి గాయకుడు 11 ఫిబ్రవరి 1974 తేదీన తుది శ్వాస విడిచారు. 2003లో ఆయన గుర్తుగా స్టాంపును విడుదల చేసింది పోస్టల్‌ శాఖ. 2014లో అమెరికన్‌ పోస్టల్‌ డిపార్టుమెంటు కూడా ఆయన పేరు మీద స్టాంపు విడుదల చేసింది.