Read more!

English | Telugu

13 సినిమాల్లో జంటగా నటించారు.. కానీ, ఒక్కసారి కూడా ఇద్దరూ మాట్లాడుకోలేదు!

సినిమా అనేది సహజంగా కనిపించే అసహజ ప్రక్రియ. మనం చూస్తున్నది నిజం కాదు అని తెలిసినా.. నిజంగా జరుగుతోందా అనే భ్రమను కలిగిస్తుంది సినిమా. అంటే సినిమాలో మనం చూసే ప్రేమలు కావచ్చు, పగ ప్రతీకారాలు కావచ్చు, ఒకరినొకరు చంపుకునే సన్నివేశాలు కావచ్చు. ఇవన్నీ అబద్దాలే. సినిమాల్లో హీరో, హీరోయిన్‌ ఎంతో క్లోజ్‌గా మూవ్‌ అవుతారు. భార్యాభర్తలుగా కనిపిస్తారు. షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఆయా క్యారెక్టర్ల నుంచి బయటికి వచ్చేసినా వ్యక్తిగతంగా స్నేహంగా ఉంటారని అందరూ భావిస్తారు. చాలా మంది నటీనటులు బయట కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం, కుటుంబ సభ్యుల్లాగే మెలగడం మనం చూస్తుంటాం. అలా కాకుండా మరోలా ఉండే జంట ఒకటి ఉంది. అదే సూపర్‌స్టార్‌ కృష్ణ, వాణశ్రీ. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. రొమాంటిక్‌ సీన్స్‌ని కూడా పండిరచారు. కానీ, వారిద్దరూ పర్సనల్‌గా ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. 

స్వతహాగా తక్కువ మాట్లాడే కృష్ణ సహనటులతో మర్యాదగానే నడుచుకునేవారు, కాస్త క్లోజ్‌ అనిపించిన వారితో సరదాగా కూడా ఉండేవారు. అలాంటిది హీరోయిన్‌ వాణిశ్రీ విషయంలో అలా ఎందుకు ఉండేవారో ఎవరికీ అర్థమయ్యేది కాదు. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. అయినా ఇద్దరూ మాట్లాడుకునే వారు కాదు. అయితే వీరిద్దరూ కలిసి నటిస్తున్నప్పుడు మీడియా అంతగా లేదు కాబట్టి ఈ విషయం గురించి బయటికి తెలియదు. ఆమధ్య వాణిశ్రీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడిరచారు. 

‘నేను, కృష్ణగారు కలిసి 13 సినిమాల్లో నటించాం. అయితే ఆయనెప్పుడూ నాతో మాట్లాడేవారు కాదు. సెట్‌కి వచ్చినపుడు ఆయన నాకు గుడ్‌మార్నింగ్‌ చెప్పేవారు కాదు, నేను ఆయనకు చెప్పేదాన్ని కాదు, షూటింగ్‌ టైమ్‌లో.. డ్యూయెట్లు, కౌగిలింతలు.. అన్నీ మామూలుగానే జరిగేవి. షాట్‌ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. అసలు నా విషయంలో ఆయన అలా ఎందుకు ఉన్నారనే విషయం ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఈ విషయం గురించి కొన్ని సినిమాల వరకు ఆలోచించాను. ఆ తర్వాత ఆలోచించడం అనవసరమనిపించింది. అతని తత్వమే అంతని సరిపుచ్చుకున్నాను. అయితే వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి వారు. ఆయనకి ఎంతో మెమరీ పవర్‌ ఉండేది. అప్పట్లో రిలీజ్‌ అయిన సినిమా కలెక్షన్స్‌ని పైసలతో సహా చెప్పేవారు. అయితే మా మధ్య వ్యక్తిగత ద్వేషాలు ఏవీ లేవు. అన్ని సినిమాలు కలిసి చేసినా మాట్లాడలేదు. కానీ, 30 సంవత్సరాల తర్వాత ఒకసారి నాకు ఫోన్‌ చేశారు. అది కూడా ఒక సినిమా కోసం. వెంకటేష్‌ చేసిన ‘అబ్బాయిగారు’ మొదట కృష్ణతో చేద్దామనుకున్నారు. అందులో తల్లి క్యారెక్టర్‌ నన్ను చెయ్యమని అడగడానికి ఫోన్‌ చేశారు. నేను షాక్‌ అయ్యాను. మీకు తల్లిగా నేను నటించాలా అని అడిగాను. సినిమా బాగుంటుంది చూడమన్నారు. తమిళ్‌లో భాగ్యరాజా చేసిన ఆ సినిమాను చూశాను. తనని ప్రాణంగా ప్రేమించే కొడుక్కి క్లైమాక్స్‌లో విషం పెట్టి చంపాలనుకుంటుంది సవతి తల్లి. అది చూసిన తర్వాత ఈ సినిమా చెయ్యకూడదని డిసైడ్‌ అయ్యాను. అదే విషయం కృష్ణగారికి చెప్పాను. అదే ఆయన నాతో మాట్లాడిన మొదటిసారి, చివరిసారి కూడా’ అని వివరించారు వాణిశ్రీ.