Read more!

English | Telugu

పొత్తిళ్ల‌లో పాప ఉండ‌గానే రాధిక‌కు స్క్రిప్టు వినిపించిన భార‌తీరాజా!

 

1992 ఆగ‌స్ట్‌.. అప్పుడే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన రాధిక హాస్పిట‌ల్ బెడ్‌పై ప‌క్క‌లో శిశువును చూసుకుంటూ ఆనందాతిరేకంతో మురిసిపోతున్నారు. మాతృత్వ మ‌ధురిమ‌ను అనుభ‌వించ‌డం ఆమెకు అదే తొలిసారి. ఆ పుట్టిన పాప పేరు ర‌యానే. రెండో భ‌ర్త రిచ‌ర్డ్ హార్డీ ద్వారా ఆ పాప జ‌న్మించింది. (1990లో వారి పెళ్ల‌యితే ర‌యానే పుట్ట‌క‌ముందే 1992లోనే వారు విడాకులు తీసుకున్నారు.) అప్ప‌టికే అగ్ర న‌టి కావ‌డంతో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆమెను క‌లుసుకొని, శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఆ వ‌చ్చిన వారిలో లెజెండ‌రీ డైరెక్ట‌ర్ భార‌తీరాజా కూడా ఉన్నారు. ఆయ‌న త‌న‌తో ఓ స్క్రిప్టు కూడా వెంట తెచ్చారు. అదీ ఆమెకు వినిపించ‌డం కోస‌మే ఆయ‌న తెచ్చారు.

ఆ విష‌యం ఆయ‌న చెప్ప‌గానే మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయారు రాధిక‌. ఆ త‌ర్వాత న‌వ్వేశారు. "మీకేమైనా పిచ్చిప‌ట్టిందా! నేనిప్పుడే బిడ్డ‌ను క‌న్నాను. మీరు న‌న్ను యాక్ట్ చెయ్య‌మ‌ని అడుగుతున్నారు." అన్నారామె.

"నో.. నో.. రాధికా.. ఈ స్క్రిప్టు నీ కోస‌మే త‌యారైంది. నువ్వు చెయ్యాల్సిందే" అన్నారు భార‌తీరాజా. ఆమె ద‌గ్గ‌ర ఆయ‌న‌కు ఆ చ‌నువు ఉంది. ఎందుకంటే ప‌దిహేనేళ్ల వ‌య‌సులో ఉన్న ఆమెను 'కిళ‌కే పోగుమ్ రైల్' (తూర్పు వెళ్లే రైలు) సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేసింది ఆయ‌నే. ఆ సినిమా సూప‌ర్ హిట్‌. రాధిక‌ను ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మార్చిన‌ ఆ మూవీలో మ‌న క‌మెడియ‌న్ సుధాక‌ర్ హీరోగా న‌టించారు తెలుసా!

రెండు నెల‌లు గ‌డిచాయి. ర‌యానేకు పాలిస్తూనే త‌మిళ‌నాడులోని వాద‌ల‌కుండులో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు రాధిక‌. భార‌తీరాజా డైరెక్ట్ చేసిన ఆ సినిమా 'కిళ‌క్కు చీమ‌యిలే' (1993). సింగిల్ మ‌ద‌ర్‌గా పాప‌ను తీసుకొని ఆమె ఆ సినిమా షూటింగ్ లొకేష‌న్ల‌ను ప్ర‌యాణాలు చేశారు. దాంతో అదివ‌ర‌కు లేని ఓర్పు ఆమెకు అల‌వ‌డింది. జీవితాన్ని మ‌రింత బాగా అర్థం చేసుకోవ‌డానికీ, కెరీర్‌లో కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి ఆ సినిమా ఆమెకు బాగా ఉప‌యోగ‌ప‌డింది.