Read more!

English | Telugu

'ప్రేమ‌సాగ‌రం' హీరోయిన్ న‌ళిని ఫ్యామిలీ సంగ‌తులు తెలిస్తే స‌ర్‌ప్రైజ్ అవ్వాల్సిందే!

 

న‌ళిని అన‌గానే మ‌న‌కు మొద‌ట గుర్తుకొచ్చే సినిమా టి. రాజేంద‌ర్ రూపొందించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిల్మ్ 'ప్రేమ‌సాగ‌రం'. తెలుగులో ఒక డబ్బింగ్ సినిమా సంవ‌త్స‌రం ఆడ‌టం అదే మొద‌టిసారి. అందులోని పాట‌ల‌న్నీ సూప‌ర్ హిట్‌. ఆ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచియ‌మైన న‌ళిని.. ఆ త‌ర్వాత చిరంజీవి స‌ర‌స‌న 'సంఘ‌ర్ష‌ణ', 'ఇంటిగుట్టు' సినిమాల్లో నాయిక‌గా న‌టించ‌డం ద్వారా మ‌రింత చేరువ‌య్యారు. అనంత‌రం అప్ప‌టి త‌మిళ స్టార్ యాక్ట‌ర్ రామ‌రాజ‌న్‌ను వివాహం చేసుకొని, కొంత కాలం సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వాత రి-ఎంట్రీ ఇచ్చి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఇటు సినిమాల్లో, అటు టీవీ షోల‌లో న‌టించారు. 

1980ల‌లో ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ మాస‌న్ లాంటి న‌టుల‌కు రామ‌రాజ‌న్ గ‌ట్టి పోటీదారుగా ఉండేవారు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించిన‌ప్పుడు ఆయ‌న‌తో ప్రేమ‌లో ప‌డ్డారు న‌ళిని. ఆ ఇద్ద‌రూ 1987లో వివాహం చేసుకున్నారు. ఆ ఇద్ద‌రికీ అరుణ అనే కుమార్తె, అరుణ్ అనే కుమారుడు ఉన్నారు. అయితే అనంత‌ర కాలంలో అభిప్రాయ భేదాలు, మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్త‌డంతో 2000 సంవ‌త్స‌రంలో న‌ళిని, రామ‌రాజ‌న్ విడాకులు తీసుకున్నారు. పిల్ల‌లిద్ద‌రూ న‌ళిని వ‌ద్ద‌నే పెరుగుతూ వ‌చ్చారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తండ్రి ద‌గ్గ‌ర‌కు వెళ్లేవారు. విడిపోయిన న‌ళిని, రామ‌రాజ‌న్‌ల‌లో ఎవ‌రూ రెండో వివాహం చేసుకోలేదు.

వృత్తి రీత్యా డాక్ట‌ర్ అయిన అరుణ ఒక హోట‌ల్ య‌జ‌మాని అయిన రామ‌చంద్ర‌న్‌ను పెళ్లి చేసుకున్నారు. త‌న త‌ల్లిదండ్రుల‌కు సంబంధించిన ఒక ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాన్ని ఆమె వెల్ల‌డించారు. చ‌ట్ట‌ప‌రంగా త‌మ త‌ల్లిదండ్రులు విడిపోయిన‌ప్ప‌టికీ, ఒక‌రిపై ఒక‌రికి ఇప్ప‌టికీ అపార‌మైన గౌర‌వం ఉంద‌నీ, ఒక‌రి గురించి మ‌రొక‌రు ఎన్న‌డూ చెడుగా మాట్లాడ‌ర‌నీ అరుణ చెప్పారు.

కోర్టులో త‌మ త‌ల్లితండ్రులకు విడాకులు మంజూరైన రోజు జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఈ సంద‌ర్భంగా ఆమె వెల్ల‌డించారు. ఆమె చెప్పిన దాని ప్ర‌కారం విడాకులు మంజూరు చేస్తున్న‌ట్లు న్యాయ‌మూర్తి ప్ర‌క‌టించ‌గానే న‌ళిని కోర్టులోనే స్పృహ‌త‌ప్పి కింద‌ప‌డిపోయారు. వెంట‌నే రామ‌రాజ‌న్ ఆమె ద‌గ్గ‌ర‌కు ప‌రిగెత్తుకుంటూ వెళ్లి, ఆమెను ప‌ట్టుకున్నారు. ఆమె ప‌రిస్థితి చూసి ఏడ్చేశారు. వాళ్ల‌ను అలా చూసిన న్యాయ‌మూర్తి ఆశ్చ‌ర్య‌పోయారు. ఒక‌రిపై ఒక‌రికి ఇంత ప్రేమానురాగాలు ఉన్న‌ప్పుడు, ఎందుకు విడాకులు కోరుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు.

త‌న‌ను ఒక చిన్న రామ‌రాజ‌న్ లాగా త‌న త‌ల్లి పెంచార‌నీ, త‌న‌లో తండ్రి గుణాలు చాలా ఉన్నాయ‌నీ అరుణ తెలిపారు. "నేను మా నాన్న‌ను ఎప్పుడు క‌లిసినా, ఆయ‌న మొద‌ట నా గురించి కాకుండా మా అమ్మ గురించి అడుగుతారు." అని ఆమె వెల్ల‌డించారు. సో.. భార్యాభ‌ర్త‌లుగా విడిపోయిన‌ప్ప‌టికీ.. న‌ళిని, రామ‌రాజ‌న్ ప‌ర‌స్ప‌రం గౌర‌వించుకుంటూ వ‌స్తుండ‌టం మంచి విష‌యం, అనుస‌ర‌ణీయం.