Read more!

English | Telugu

వచ్చిన లాభాలను వారికే పంచిన గొప్ప నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్‌

ఒక సినిమా తియ్యాలంటే దాని వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. సినిమా అనగానే మనకు నటీనటులు, దర్శకనిర్మాతలు, టెక్నీషియన్స్‌ మాత్రమే కనిపిస్తారు. అంతకుమించి ఎంతో మంది సినిమా కోసం పనిచేస్తారు. సినిమా సూపర్‌హిట్‌ అయి లాభాలు వచ్చాయంటే అవి నిర్మాత జేబులోకే వెళ్తాయి. కొన్ని సంస్థల్లో ఎన్నో ఏళ్ళ తరబడి పనిచేసేవారు ఉంటారు. కానీ, వారికి రెమ్యునరేషన్‌ మినహా మరే ఇతర రాబడి ఉండదు. ఆయా సినిమాలకు పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్‌తోపాటు సినీ కార్మికులను కూడా దృష్టిలో ఉంచుకొని వారి కోసమే సినిమా తీసి, దాని ద్వారా వచ్చిన లాభాలను వారికే చెందేలా చేసిన సంస్థ జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌.

జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ బేనర్‌పై నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ నిర్మించిన సినిమాలు, దర్శకత్వం వహించిన సినిమాలు మొత్తం 34. అందులో తెలుగు సినిమాలు 24. వాటిలో వి.బి.రాజేంద్రప్రసాద్‌ 13 సినిమాలను డైరెక్ట్‌ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబులతో సూపర్‌హిట్‌ సినిమాలు తీశారు రాజేంద్రప్రసాద్‌. శోభన్‌బాబు కెరీర్‌లో పెద్ద హిట్‌ సినిమాలన్నీ జగపతి సంస్థ తీసినవే. వాటిలో ‘పిచ్చిమారాజు’ అనే సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కేవలం తమ సంస్థ ఉద్యోగుల సంక్షేమం కోసం వి.బి.రాజేంద్రప్రసాద్‌ తీసిన సినిమా ఇది. ‘పిచ్చిమారాజు’ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. మంచి లాభాలు ఆర్జించింది. ఈ సినిమాకి వచ్చిన లాభాలను నయాపైసలతో సహా తమ సంస్థ సిబ్బందికే పంచిపెట్టారు రాజేంద్రప్రసాద్‌. తన సినిమాలకు పనిచేసినవారు, ఆఫీసు సిబ్బంది... తన నుంచి నెలనెలా జీతం తీసుకునే ప్రతి ఒక్కరికీ వచ్చిన లాభాలను పంచారు. అప్పటివరకు ఏ నిర్మాణ సంస్థ తమ సిబ్బంది సంక్షేమం కోసం అలా చెయ్యలేదు. ఆ తర్వాత కూడా ఎవ్వరూ దాన్ని ఫాలో అవలేదు. తమ సిబ్బంది కోసం సినిమా తీసిన ఏకైక నిర్మాతగా వి.బి.రాజేంద్రప్రసాద్‌ నిలిచారు.