Read more!

English | Telugu

ఛోళులకు, పల్లవులకు పడదు కదా.. అందుకే పల్లవులు రాయలేకపోతున్నానంటూ ఛలోక్తి విసిరిన ఆత్రేయ!

ఏ సినిమాకైనా కథ, మాటలు, నటీనటులు ఎంత ముఖ్యమో పాటలు కూడా అంతే ముఖ్యం. సినిమా విజయంలో పాటలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని ఎన్నో సినిమాల విషయంలో రుజువైంది. అలాంటి పాటలు రూపొందడానికి దర్శకనిర్మాతలు ఎంత శ్రమించాల్సి వస్తుందో అందరికీ తెలియకపోవచ్చు. కానీ, ఇది నిజం. సంగీత దర్శకుడి నుంచి మంచి ట్యూన్స్‌ రాబట్టడానికి, పాటల రచయితలతో మంచి పాటలు రాయించుకోవడానికి దర్శకనిర్మాతలు ఒక్కోసారి అష్టకష్టాలు పడుతుంటారు. ముఖ్యంగా పాటల రచయితలు సినిమాకు అవసరమైన పాటలు ఇవ్వడంలో ఎంతో సమయం తీసుకుంటారు. ఈ విషయంలో కొంతమంది రచయితలు నిర్మాతలను చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. అలాంటి వారిలో దివంగత ఆచార్య ఆత్రేయ ఒకరు. ఆయన వల్ల సినిమా ఇండస్ట్రీలో ఇబ్బంది పడని దర్శకనిర్మాతలు లేరంటే అతిశయోక్తి కాదు. 

ఈ విషయంలో దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆయన తీసిన సినిమాలకు ఎక్కువ శాతం ఆత్రేయ పాటలు రాశారు. అయితే ప్రతి సినిమాకీ ఆత్రేయ వల్ల ఇబ్బందులు పడ్డారు. ఆయన తీసిన సినిమాల్లో మంచి మ్యూజిక్‌ ఉండేలా చూసుకునేవారు. ఆ పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యేవి. కె.వి.మహదేవన్‌తో మ్యూజిక్‌ చేయించుకునేవారు, ఆత్రేయతో రాయించుకునేవారు. ఆత్రేయవల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డా అన్నీ భరించి ఆయనతోనే రాయించుకునేవారు. ఆత్రేయ గురించి సూరపునేని హరి పురుషోత్తమరావు ఒక డైలాగ్‌ చెప్పారు ఆత్రేయ.. పాటలు రాసి ప్రేక్షకుల్ని, రాయకుండా నిర్మాతలను ఏడిపిస్తాడు అని. ‘ఆరాధన’ సినిమా కోసం పాటలు రాసేందుకు హోటల్‌ ఛోళలో రూమ్‌ బుక్‌ చేసి ఆత్రేయను అక్కడ పెట్టారు రాజేంద్రప్రసాద్‌. వారం రోజులు గడిచిపోయింది. ఆయన ఒక్క అక్షరం కూడా రాయలేదు. అప్పుడు రాజేంద్రప్రసాద్‌ ఆయన దగ్గరికి వెళ్లి ‘సార్‌.. చాలా డబ్బు ఖర్చయిపోతోంది. ఏమిటి పరిస్థితి’ అని అడిగారు. దానికి ఆత్రేయ ‘ఈ హోటల్‌ పేరేమిటి?’ అని అడిగారు. ‘ఛోళ’ అని చెప్పారు రాజేంద్రప్రసాద్‌. దానికి ఆత్రేయ ‘నువ్వు ఛోళలో రూమ్‌ బుక్‌ చెయ్యడం వల్ల పల్లవులు రావడం లేదు. ఛోళులకు, పల్లవులకు పడదు కదా. అందుకే నేను రాయలేకపోతున్నాను. హోటల్‌ మార్చు. ట్రై చేద్దాం’ అన్నారు. అలా పాటలు రాయకుండా నిర్మాతను ఇబ్బంది పెట్టడమే కాకుండా.. దాన్ని కూడా ఛలోక్తిగా చెప్పేవారు ఆత్రేయ.