Read more!

English | Telugu

విలక్షణమైన, వైవిధ్యమైన నటనకు పెట్టింది పేరు చంద్రమోహన్‌!

తెలుగు చలనచిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్‌(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్‌ శనివారం(నవంబర్‌ 11) హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామంలో 1945 మే 23న చంద్రమోహన్‌ జన్మించారు. 

1966లో విడుదలైన ‘రంగులరాట్నం’ చిత్రంతో తెరంగేట్రం చేసిన చంద్రమోహన్‌ తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’ చిత్రంలో ఆయన చేసిన విలక్షణమైన పాత్ర ప్రేక్షకులకు పదికాలాలపాటు గుర్తుండిపోతుంది. ఆ సినిమాలో అతని నటనకు ఫిలింఫేర్‌ అవార్డు లభించింది. ఆయన సినిమా కెరీర్‌లో రెండు ఫిలింఫేర్‌ అవార్డులు, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. 57 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో మొత్తం 932 సినిమాలు చేశారు. అందులో 175 సినిమాల్లో హీరోగా కనిపించారు. తర్వాతి కాలంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా తనదైన శైలిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఆయన హీరోగా చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం కామెడీ సినిమాలే ఉండడం విశేషం. కొన్ని సంవత్సరాల పాటు యంగ్‌ హీరోలకు తండ్రి అంటే చంద్రమోహనే గుర్తొచ్చేంత పేరు తెచ్చుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం 2002లో వచ్చిన ‘కోతలరాయుడు’. 

కొత్త హీరోయిన్లకు లక్కీ హీరో!

చంద్రమోహన్‌ కొత్త హీరోయిన్లకు లక్కీ హీరో అనే పేరు ఇండస్ట్రీలో పాతుకుపోయింది. ఏ హీరోయిన్‌ అయినా చంద్రమోహన్‌తో ఒక్క సినిమా చేస్తే చాలు.. వారి దశ తిరిగిపోతుంది, టాప్‌ హీరోయిన్‌గా వెలిగిపోతుంది అనే నమ్మకం బాగా ఉండేది. దానికి తగ్గట్టుగానే ‘పదహారేళ్ళ వయసు’ చిత్రంలో శ్రీదేవి, ‘సిరిసిరిమువ్య’ చిత్రంలో జయప్రద.. ఇంకా రాధిక, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి వంటి మరి ొందరు హీరోయిన్లు తొలి నాళ్ళలో చంద్రమోహన్‌తో కలిసి నటించినవారే.

చంద్రమోహన్‌ చేసిన కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు

చంద్రమోహన్‌ చేసిన 932 సినిమాల్లో ఎక్కువ శాతం అందర్నీ ఆకట్టుకున్న సినిమాలే ఉంటాయి. అందులో కొన్ని ఆణిమ్యుతాల్లాంటి సినిమాల గురించి చెప్పాల్సి వస్తే.. సుఖదుఃఖాలు, జీవన తరంగాలు, కాలం మారింది, అల్లూరి సీతారామరాజు, ప్రాణం ఖరీదు, శంకరాభరణం, శుభోదయం, రాధాకళ్యాణం.. ఇలా లెక్కకు మించిన సినిమాలు తన కెరీర్‌లో చేశారు చంద్రమోహన్‌. 

పాత్ర ఏదైనా.. దానికి జీవం పోస్తారు

నవరసాలనూ అద్భుతంగా పలికించగలిగిన ఆనాటి నటుట్లో చంద్రమోహన్‌ ఒకరు. పాత్ర ఏదైనా, దాని స్వభావం ఏదైనా.. దాన్ని ఆకళింపు చేసుకొని ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి దాన్ని నూటికి నూరుశాతం పండిరచగల అద్భుతమైన నటుడు. ‘పదహారేళ్ళ వయసు’, ‘ప్రాణం ఖరీదు’, ‘రాధాకళ్యాణం’ వంటి సినిమాల్లో ఎంతో వైవిధ్యం ఉన్న పాత్రలకు చంద్రమోహన్‌ జీవం పోశారు. ఇక కామెడీ సినిమాల విషయానికి వస్తే.. హాస్యాన్ని పండిరచడంలో అతనికంటూ ఓ శైలి ఉంది. చక్కని డైలాగ్‌ డెలివరీతో, నవ్వు పుట్టించే బాడీ లాంగ్వేజ్‌తో ఆయా క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేసేవారు. 

వృత్తిపట్ల అపారమైన గౌరవం

పాతతరం నటీనటుల నుంచి పుణికిపుచ్చుకున్న క్రమశిక్షణను తన కెరీర్‌ మొత్తం కొనసాగించారు. ఏ సినిమాకైనా నిర్మాత తండ్రిలాంటివారు అని నమ్మే చంద్రమోహన్‌. నిర్మాతకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూసేవారు. ‘మనసంతా నువ్వే’ చిత్రంలో హీరో ఉదయ్‌కిరణ్‌కి తండ్రిగా నటించారు చంద్రమోహన్‌. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే ఆయన తల్లి చనిపోయిందన్న వార్త తెలిసింది. సాధారణంగా తల్లి చనిపోయిందంటే ఎవరైనా ఉన్నపళంగా తల్లిని చూసేందుకు బయల్దేరతారు. షూటింగ్‌ మధ్యలో ఉన్న చంద్రమోహన్‌ ఆ పని చేయలేదు. దానివల్ల నిర్మాతకు ఎంత నష్టం వస్తుందో ఆయనకు తెలుసు. అందుకే ఆరోజు తన పార్ట్‌ షూటింగ్‌ పూర్తయిన తర్వాతే తల్లిని చూసేందుకు వెళ్లారు. దీన్నిబట్ట వృత్తి పట్ల చంద్రమోహన్‌కు ఎంత గౌరవం ఉంది, నిర్మాత శ్రేయస్సు కోసం ఎంతగా ఆలోచిస్తారో అర్థమవుతుంది.