Read more!

English | Telugu

ఆ దర్శకుడు కుదరదు అనడం వల్లే.. ‘దసరాబుల్లోడు’తో వి.బి.రాజేంద్రప్రసాద్‌ డైరెక్టర్‌ అయ్యారు

వి.బి.రాజేంద్రప్రసాద్‌.. ప్రముఖ నిర్మాత, దర్శకుడు. జగపతి సంస్థను స్థాపించి ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను తమ బేనర్‌లో తీసి మంచి అభిరుచిగల నిర్మాత, దర్శకుడు అనిపించుకున్నారు. ఈ సంస్థలో వచ్చిన సినిమాలు 90 శాతం విజయం సాధించాయి. ఈ సంస్థ నిర్మించిన సినిమాలు మొత్తం 34. అందులో 24 తెలుగు సినిమాలు ఉండగా, తమిళ, హిందీ భాషల్లో 10 సినిమాలు చేశారు. ఈ 34 సినిమాల్లో 13 సినిమాలకు వి.బి.రాజేంద్రప్రసాద్‌ దర్శకుడు. ‘అన్నపూర్ణ’ చిత్రంతో నిర్మాతగా మారి,  ఆ తర్వాత ‘దసరా బుల్లోడు’ చిత్రానికి దర్శకత్వం వహించి డైరెక్టర్‌గా కూడా సూపర్‌ సక్సెస్‌ సాధించిన వి.బి.రాజేంద్రప్రసాద్‌ దర్శకుడిగా మారేందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనేది ఒకసారి పరిశీలిస్తే.. 

వి.బి.రాజేంద్రప్రసాద్‌ కుటుంబానిది ధాన్యం వ్యాపారం. మిల్లులు కూడా ఉండేవి. ఆయనకు ఆస్తమా ఉండేది. అందుకే మిల్లులు చూసుకోవడం సరిపడదని వేరే వ్యాపారం చేసుకోమని పంపించారు. ఆయన చదువుకున్నది కాకినాడ. పూర్ణోదయా క్రియేషన్స్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన ఏడిద నాగేశ్వరరావు... రాజేంద్రప్రసాద్‌ క్లాస్‌మేట్‌. వీళ్ళంతా కలిసి అక్కడ నాటకాటాడేవారు, ఆ క్రమంలోనే అక్కినేని నాగేశ్వరరావుగారితో పరిచయం ఏర్పడిరది. అప్పటికే అక్కినేని హీరో. నెమ్మదిగా సినిమాల్లోకి వెళితే ఎలా ఉంటుంది అనుకున్నారు రాజేంద్రస్రసాద్‌. అయితే నటుడిగా వెళ్లాలనే ఆయన ప్రయత్నం. అసలు నటుడు అవుదామనే ఆయన మద్రాస్‌ వెళ్లారు. రెండు, మూడు ప్రయత్నాలు కూడా చేశారు. అది  తన వల్ల కాదు అని డిసైడ్‌ అయ్యారు. సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చిందాయనకు. అప్పుడు నాగేశ్వరావు దగ్గరకు వెళ్లి మీరు నాకొక సినిమా చెయ్యాలి అని అడిగారు. దానికి నాగేశ్వరరావు ‘ముందు అనుభవం కోసం ఒక సినిమా చెయ్యండి. తర్వాత మనం కొనసాగుదాం’ అన్నారు. అప్పట్లో సదాశివబ్రహ్మం అనే రైటర్‌ ఉండేవారు. ఆయన ఇచ్చిన ‘అన్నపూర్ణ’ అనే కథతో సినిమా చేశారు రాజేంద్రస్రసాద్‌. దానికి వి.మధుసూదనరావు దర్శకుడు. జగయ్య, జమున ఆ సినిమాలో నటించారు. అప్పటి నుంచి జగపతి బేనర్‌లో మధుసూదనరావు ప్రయాణం మొదలైంది. ఆ తర్వాతి సినిమా ‘ఆరాధన’కు డేట్స్‌ ఇచ్చారు నాగేశ్వరరావు. అది ‘సాగరిక’ అనే బెంగాలి సినిమాకు రీమేక్‌. ఆ సినిమాతో జగపతి బేనర్‌లో నాగేశ్వరరావు ప్రయాణం కూడా మొదలైంది. అది నాగేశ్వరరావుకి పర్మినెంట్‌ బేనర్‌. 

జగపతి బేనర్‌కి ‘అ’ అనే ఒక సెంటిమెంట్‌ ఉంది. అన్నపూర్ణ, ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు.. ఇలా ‘అ’తోనే టైటిల్స్‌ పెట్టేవారు. ఆ తర్వాత నాగేశ్వరరావుతో క్రైమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయించాలనుకొని ‘అదృష్టవంతులు’ అనే సినిమా వి.మధుసూదనరావు దర్శకత్వంలో చేశారు. అది సూపర్‌హిట్‌ అయింది. ఆ సినిమా తర్వాత ఒక విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చెయ్యాలనుకున్నారు. ఆరోజుల్లో నిర్మాతలు ముందుగా స్క్రిప్ట్‌ రెడీ చేయించేవారు. ఆ తర్వాత డైరెక్టర్‌ వచ్చి అందులో కరెక్షన్స్‌ చేయించేవారు. అది పూర్తయిన తర్వాతే హీరో దగ్గరికి కథ వెళ్లేది. ఈ ప్రాజెక్ట్‌ ప్రాసెస్‌లో ఉండగానే మధుసూదనరావు ‘ఈ సినిమా ఇప్పట్లో చెయ్యలేను, నాకు ఖాళీ లేదు’ అని చెప్పారు. అప్పుడు నాగేశ్వరరావునే డైరెక్ట్‌ చెయ్యమని రాజేంద్రప్రసాద్‌ అడిగారు. అప్పటికే ఎన్‌.టి.రామారావు డైరెక్ట్‌ చేస్తున్నారు. అందుకే నాగేశ్వరరావు కూడా డైరెక్ట్‌ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన్ని అడిగారు. దానికి నాగేశ్వరరావు ‘నేను డైరెక్షన్‌ చెయ్యను’ అని చెబుతూ ‘మధుసూదనరావు తీసిన సినిమాలకి నువ్వు వెనకే ఉండి అన్నీ నువ్వే చూసుకున్నావు. కాబట్టి నువ్వే మెగా ఫోన్‌ పట్టుకొని డైరెక్షన్‌ మొదలు పెట్టు. ఏమీ కాదు. ఏదైనా తేడా వస్తే చూసుకుందాం. మేమంతా ఉంటాం కదా’ అన్నారు. అలా రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ‘దసరాబుల్లోడు’. 1970లో ఈ సినిమా వచ్చింది. సంక్రాంతికి రిలీజ్‌ అయి దసరా వరకు ఆడిరదా సినిమా. విపరీతమైన కలెక్షన్లు సాధించిన ‘దసరాబుల్లోడు’ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకాదరణ పొందుతోందంటే దానికి కారణం రాజేంద్రప్రసాద్‌ తయారు చేసుకున్న కథ, సినిమా తీసిన విధానం,  ఆత్రేయ మాటలు, పాటలు, చక్కని బ్యాక్‌డ్రాప్‌, మంచి మ్యూజిక్‌, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌... ఇవన్నీ కలగలసి ‘దసరాబుల్లోడు’ సిల్వర్‌ జూబ్లీ చిత్రంగా నిలిచింది.