Read more!

English | Telugu

‘పండంటి కాపురం’ షూటింగ్‌లో సంఘటన ఆర్టిస్టులంటే కృష్ణకు ఎంత గౌరవమో తెలియజేస్తుంది

సూపర్‌స్టార్‌ కృష్ణ తొలినాళ్ళల్లో చేసిన సినిమాల్లో ‘పండంటి కాపురం’ చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. చక్కని కుటుంబకథా చిత్రంగా ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఆ సినిమాలోని సెంటిమెంట్‌ ఆడియన్స్‌ని కట్టిపడేసింది. తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకంతోనే సూపర్‌స్టార్‌ కృష్ణ ఈ సినిమాను సొంతంగా నిర్మించారు. లక్ష్మీదీపక్‌ దర్శకత్వంలో జయప్రద పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి జి.హనుమంతరావు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. 

సూపర్‌స్టార్‌ కృష్ణ పర్సనల్‌ మేకప్‌మేన్‌గా పనిచేసిన సి.మాధవరావు ‘పండంటి కాపురం’ సినిమా నిర్మాణ సమయంలోని కొన్ని విశేషాలను తెలియజేస్తూ.. ‘కృష్ణగారు ఆర్టిస్టులను ఎంతో గౌరవించేవారు. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ సినిమాలో నలుగురు అన్నదమ్ములు ఉంటారు. పెద్ద ఫ్యామిలీ. అందులో ఎస్‌.వి.రంగారావుగారు మెయిన్‌. రంగారావుగారంటే కృష్ణగారికి ఎంతో ఇష్టం. ఈ సినిమాలోని ఓ పాటను శివాజీ గార్డెన్స్‌లో తియ్యాలని ప్లాన్‌ చేసారు. రంగారావుగారు అక్కడికి రావాలి. కానీ, ఆయన ఇంట్లో ఫుల్‌గా తాగి ఉన్నారు. ఆయన్ని ఎలాగైనా తీసుకొస్తానని ప్రభాకర్‌రెడ్డిగారు వెళ్లారు. బ్రతిమలాడి షూటింగ్‌ లొకేషన్‌కి తీసుకొచ్చారు. రంగారావుగారిది చిన్నపిల్లాడి మనస్తత్వం. ‘నాకు చెవి నొప్పిగా ఉందిరా, కాలు నొప్పిగా ఉందిరా.. షూటింగ్‌ నావల్ల కాదురా. నన్ను వదిలెయ్‌రా..’ అని చిన్నపిల్లాడిలా  చెబుతూ ప్రభార్‌రెడ్డిగారిని బ్రతిమలాడుతున్నారు. రెడ్డిగారికి కోపం వచ్చింది. ‘చంపేస్తాను ఏమనుకుంటున్నావో.. ఇంతమంది ఆర్టిస్టుల కాంబినేషన్‌. వీళ్ళు మళ్ళీ దొరకరు. మేమంతా ఏమైపోవాలి’ అని రంగారావుగారి మీద కేకలేశారు రెడ్డిగారు. ‘నన్ను చంపుతావురా.. చంపెయ్‌.. గ్రేట్‌ రంగారావుని చంపెయ్‌’ అన్నారు రంగారావుగారు. అప్పుడు ప్రభాకరరెడ్డిగారు తేరుకొని ఇంత తప్పు మాట అన్నానే అని పశ్చాత్తాపపడి ఆయన రెండు కాళ్ళకు దండం పెట్టారు. తర్వాత రంగారావుగారి మేకప్‌ మేన్‌ కూడా ఆయన్ని షూటింగ్‌కి రెడీ అవ్వమని బ్రతిమలాడాడు. కానీ, లాభం లేకపోయింది. ఈరోజు ఎలాగోలా మేనేజ్‌ చెయ్యమని చెప్పి రంగారావుగారిని తీసుకెళ్ళిపోయారు రెడ్డిగారు. మిగిలిన ఆర్టిస్టులందరూ అక్కడే ఉన్నారు. ఆ టైమ్‌లో గుమ్మడిగారు ఠక్కున ఓ మాట అన్నారు. ‘హరనాథ్‌ తాగుబోతు అనే కదా మనం ఇండస్ట్రీలో అవాయిడ్‌ చేశాం. ఈయన తప్ప ఈ వేషం వేసేవాళ్ళు ఎవరూ లేరా కృష్ణ. మనకి ఈ అవస్థలు అవసరమా. ఇంత పెద్ద కాంబినేషన్‌లో షూటింగ్‌ ఉంటే తాగి పడుకోవడం ఏమిటి’ అన్నాడు. కృష్ణగారి గొప్పతనం ఏమిటో చూడండి.. ‘గుమ్మడిగారూ.. ఈ వేషం ఆయన తప్ప మరెవ్వరూ వెయ్యలేరు. నేను ఎన్ని కష్టాలైనా పడి ఆయనతోనే ఈ క్యారెక్టర్‌ చేయించుకుంటాను’ అని లేచి వెళ్లిపోయారు. ఈ మాటలు రంగారావుగారి మేకప్‌మేన్‌ విన్నాడు. అక్కడి నుంచి రంగారావుగారి ఇంటికి వెళ్లాడు. అతను వెళ్లేసరికి డ్రిరక్‌ చేస్తున్న రంగారావుగారితో ‘ఇలా జరిగింది. మీ మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు కృష్ణగారు. మీరు చెయాల్సిన పని ఇదేనా’ అన్నాడు. దానికి రంగారావుగారు ‘మందు తీసెయ్‌’ అన్నారు. మరుసటిరోజు నేను కృష్ణగారి కోసం నేను వారి ఇంటిలో వెయిట్‌ చేస్తున్నాను. కృష్ణగారు మేకప్‌కి వచ్చే వరకు ఫోన్లు నేనే అటెండ్‌ చేసేవాడిని. రంగారావుగారు ఫోన్‌ చేసారు. ‘మాధవా.. మన సినిమా ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌ రష్‌ చూద్దాం. ఎరేంజ్‌ చెయ్యమని కృష్ణకు చెప్పు’ అన్నారు. కృష్ణగారు రాగానే ఈ విషయాన్నే చెప్పాను. దానికి కృష్ణగారు ‘అలాగా అయితే వెంకన్నబాబుకి చెప్పి థియేటర్‌లో ఎరేంజ్‌ చెయ్యమను అందరం చూద్దాం’ అన్నారు. థియేటర్‌లో షో ఎరేంజ్‌ చేశారు. నేను, రంగారావుగారు, కృష్ణగారు, నిర్మలగారు, రంగారావుగారి మేకప్‌ మేన్‌ అందరం రష్‌ చూశాం. బయటికి వచ్చిన తర్వాత ‘కృష్ణా! ఈ సినిమా పూర్తయ్యే వరకు డ్రిరక్‌ ముట్టుకోను. నీకు ఇంకో విషయం చెబుతున్నాను. ఈ సినిమా చూసి బయటికి వచ్చిన ప్రేక్షకులు నా గురించి చెప్పుకుంటారు. ఇట్స్‌ ఏ ఛాలెంజ్‌’ అన్నారు. ఆయన అన్నట్టుగానే ఆ పాత్రకు జీవం పోశారు. తన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. కృష్ణగారు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒక కమిట్‌మెంట్‌తో కంప్లీట్‌ చేశారు. కృష్ణగారు ఆర్టిస్టులతో అంత బాగా ఉండేవారు. ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్‌ వారికి ఇచ్చేవారు. ఎక్కడైనా నేర్చుకోవాల్సింది ఉంటే నేర్చుకునేవారు’ అంటూ ‘పండంటి కాపురం’నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు సూపర్‌స్టార్‌ కృష్ణ పర్సనల్‌ మేకప్‌మేన్‌ సి.మాధవరావు.