Read more!

English | Telugu

రామానాయుడు అప్పుడా నిర్ణయం తీసుకోకపోతే ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ అనేదే ఉండేది కాదు!

 

తెలుగు సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకోవాలని, మంచి సినిమాలు తీసి గొప్ప నిర్మాత అనిపించుకోవాలని వచ్చినవారు ఎంతో మంది ఉన్నారు. కానీ, సక్సెస్‌ అయిన వారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు మూవీ మొఘల్‌ డా. డి.రామానాయుడు. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేని రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన అగ్రనిర్మాతగా పేరు తెచ్చుకోవడం వెనుక ఎంతో కృషి ఉంది. తను ఎంతో వేగంగా తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ ఘనతను సాధించారు. ఆయన సినీ ప్రయాణంలో తీసుకున్న ఆ నిర్ణయాల వల్లే రామానాయుడు నిర్మాత అయ్యారు. ఆయన పెద్ద కుమారుడు సురేష్‌బాబు అగ్రనిర్మాతగా పేరు తెచ్చుకుంటున్నారు, చిన్న కుమారుడు వెంకటేష్‌ హీరోగా ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరి రామానాయుడు తీసుకున్న ఆ నిర్ణయాలు ఏమిటో తెలుసుకుందాం.

రైతు కుటుంబంలో పుట్టిన రామానాయుడు ఎప్పుడూ తనదే పైచేయిగా ఉండాలని కోరుకునేవారు. తన పక్క పొలం కంటే బస్తా ఎక్కువ పండిరచాలనే పట్టుదల ఉండేది. అప్పటికే వారి కుటుంబానికి 300 ఎకరాల పొలం ఉండేది. అంతేకాకుండా రైస్‌ మిల్లులు కూడా ఉండేవి. వ్యవసాయం చేసుకుంటూనే ఎంతో నిజాయితీగా రైస్‌ వ్యాపారం కూడా చేసేవారు. ఒకసారి రైస్‌ మిల్లుకు సంబంధించి బిల్లులు రాసి పెట్టే విషయంలో కాస్త జాప్యం జరిగిన కారణంగా అధికారులు ఆయనకు ఫైన్‌ వేసారు. అలా ఫైన్‌ వేసిన మరుసటిరోజే ఆ వ్యాపారం తనకు సరిపడదని రైస్‌ మిల్లుని మూసేశారు. ఆయన నిర్ణయానికి కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు. ఆ తర్వాత మద్రాస్‌ వచ్చి ఇటుకల వ్యాపారం చెయ్యాలని అనుకున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ కూడా వ్యవసాయం లాగే బురదలో పని చెయ్యాల్సి వస్తుందన్న ఉద్దేశంతో అది కూడా వద్దని చిటికెలో నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత తన బంధువుల సలహాతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చెయ్యాలని తమిళనాడులోనే 90 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దాన్ని పక్కన పెట్టి మరో వ్యాపారం ఏదైనా చేస్తే బాగుంటుందని హోటల్‌ వ్యాపారంలోకి దిగారు. స్నేహితులతో కలిసి కొంత పెట్టుబడి పెట్టి ఓ హోటల్‌ని తెరిచారు. మొదటి రోజే అది కూడా సరికాదని ఆరోజే ఆ వ్యాపారానికి స్వస్తి పలికారు. అదే సమయంలో మద్రాసులోని ఆంధ్రా క్లబ్‌లో సినిమా వాళ్ళు కొందరు పరిచయమయ్యారు. ఏదైనా డబ్బింగ్‌ సినిమా ఉంటే తాను చేసుకుంటానని రామానాయుడు వారిని అడిగారు. అయితే కొందరు స్నేహితులు కలిసి ‘అనురాగం’ అనే సినిమా చేస్తున్నారని, అందులో భాగస్వామిగా చేరమని రామానాయుడికి స్నేహితులు సలహా ఇచ్చారు. ఆ ప్రకారమే ఆ సినిమాకి భాగస్వామి అయ్యారు. ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది కానీ డబ్బు రాలేదు. సినిమాకి పెట్టిన 50 వేల రూపాయలు పోగొట్టుకున్నారు నాయుడు. 

ఎలాగైనా ఒక హిట్‌ సినిమా చెయ్యాలన్న కసి రామానాయుడులో పెరిగింది. ఎన్‌.టి.రామారావుతో సినిమా చెయ్యాలని డిసైడ్‌ అయ్యారు. ఆయన్ని తన ఉద్దేశాన్ని చెప్పారు నాయుడు. దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ఎన్టీఆర్‌ అంతకుముందే విని వుండడంతో ఆయనకు కూడా నమ్మకం కుదిరింది. దాంతో ఓకే చెప్పారు. తన సినిమాకి తాపీ చాణక్యను దర్శకుడుగా సెలెక్ట్‌ చేసుకున్నారు నాయుడు. అయితే అప్పటికే చాణక్య చేసిన 9 సినిమాలు వరసగా ఫ్లాప్‌ అవ్వడంవల్ల చాణక్య డైరెక్టర్‌ అనగానే అందరూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇచ్చిన మాట తప్పడం రామానాయుడికి అలవాటు లేకపోవడం వల్ల చాణక్యే తన సినిమాకి డైరెక్టర్‌ అని ఫిక్స్‌ అయిపోయారు. 

మరి ఈ సినిమాకి కథ ఏమిటి? అనే విషయంలో రామానాయుడు, చాణక్య ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఎన్నో కథలు విన్నారు. కానీ, ఏదీ వారికి నచ్చలేదు. అదే సమయంలో రచయిత డి.వి.నరసరాజు పరిచయమయ్యారు. 1959లో ‘స్కేప్‌గోట్‌’ అనే ఇంగ్లీషు నవల ఇన్‌స్పిరేషన్‌తో ‘రాముడు భీముడు’ కథను రాసుకున్నారు నరసరాజు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆ కథతో సినిమా చెయ్యాలని మిద్దె జగన్నాథరావు, మిద్దె రామకృష్ణరావు అనుకున్నారు. కానీ, కుదరలేదు. దాంతో ఆ కథను పక్కన పెట్టేసారు నరసరాజు. ఈ విషయం తెలుసుకున్న రామానాయుడు, చాణక్య ఆ కథ వినిపించమని అడిగారు. డ్యూయల్‌ రోల్‌ కథ అయిన ‘రాముడు భీముడు’ కథ వారిద్దరికీ నచ్చింది. అలాగే ఎన్టీఆర్‌కి కూడా కథ చెప్పారు. ఆయనకు కూడా బాగా నచ్చింది. 1963 నవంబర్‌ 16న సురేష్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌లో ‘రాముడు భీముడు’ ప్రారంభమైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. రాముడి సరసన ఎల్‌.విజయలక్ష్మీ, భీముడి సరసన జమున హీరోయిన్లుగా నటించారు. అంతకుముందు ‘అనురాగం’ చిత్రానికి భాగస్వామిగా ఉన్న రామానాయుడు షూటింగ్‌ సమయంలో సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని వ్యవహారాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం వల్ల ‘రాముడు భీముడు’ చిత్రాన్ని పక్కా ప్లానింగ్‌తో అనుకున్న సమయానికి పూర్తి చేశారు. 1964 మే 21న ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాకి 6 లక్షల 30 వేల రూపాయలు ఖర్చయింది. ఆ డబ్బు మొదటి వారంలోనే తిరిగి వచ్చింది. 30 ప్రింట్లతో రిలీజ్‌ అయిన ఈ సినిమా అన్ని కేంద్రాల్లోనూ 10 వారాలపాటు విజయవంతంగా ప్రదర్శితమైంది. 10 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా శతదినోత్సవాన్ని మద్రాస్‌లో ఘనంగా నిర్వహించారు రామానాయుడు. 

ఏదో ఒక వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకున్న రామానాయుడు అనుకోకుండానే నిర్మాతగా మారారు. మొదట్లో రైస్‌ మిల్లు విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప నిర్మాత పరిచయమయ్యారు. ఆయన ద్వారా సురేష్‌బాబు అనే అగ్ర నిర్మాత టాలీవుడ్‌కి రాగలిగారు. రామానాయుడు వల్లే వెంకటేష్‌ వంటి ప్యామిలీ హీరో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించగలిగారు.