Read more!

English | Telugu

స్టార్లు లేరు.. స్టోరీ మాత్రమే ఉంది.. అయినా సంవత్సరం ఆడిందా సినిమా!

ఒకప్పుడు మనుషుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉండేవి. కుటుంబంలో బంధాలకు, అనుబంధాలకు విలువ వుండేది. రాను రాను అవి అంతరించిపోతూ ఉన్న తరుణం, తల్లిదండ్రులను పట్టించుకోకుండా తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకులు సమాజంలో వేళ్ళూనుకుంటున్న రోజులు, చివరి దశలో ఉన్న తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టడానికి కూడా ఆలోచించే కొడుకులు పుట్టుకొస్తున్న రోజులు అవి.. ఈ పరిస్థితిని సరైన సమయంలో ఒడిసి పట్టుకొని ఓ కొత్త దర్శకుడు తీసిన సినిమా అందర్నీ ఆలోచింపజేసింది. సినిమా చూసిన వారి ముఖాలు మాడిపోయాయి. ఎందుకంటే అప్పుడప్పుడే అలాంటి ఘటనలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. వాటికి అద్దం పడుతూ తెరకెక్కించిన సినిమా అది. ఆ సినిమాయే ‘తాతమనవడు’. 

‘తాతమనవడు’ దర్శకనిర్మాతలది చాలా విచిత్రమైన ప్రయాణం. దర్శకుడు దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఓ వైపు కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేస్తూనే మరో వైపు హిందీ, తెలుగు ట్యూషన్స్‌ చెప్పేవారు. మరోపక్క హైకోర్టు దగ్గర పార్ట్‌టైమ్‌ టైపిస్టుగా పనిచేసేవారు. మరోచోట పార్ట్‌ టైమ్‌ ఎకౌంటెంట్‌గా కూడా పనిచేశారు దాసరి. నిర్మాత కె.రాఘవ ట్రాలీ పుల్లర్‌, ఆఫీస్‌ బోయ్‌, ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌, స్టంట్‌ అసిస్టెంట్‌, డాన్స్‌ కంపోజర్‌.. ఇలా సినిమాకి సంబంధించిన ఎన్నో శాఖల్లో ప్రావీణ్యం సంపాదించారు. కొంతమంది భాగస్వాములతో కలిసి జగత్‌ జెంత్రీలు, జగత్‌జెట్టీలు, జగత్‌కిలాడీలు వంటి కొన్ని సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత తనే సొంతంగా ప్రతాప్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌ను స్థాపించారు. అప్పటికే దాదాపు 50 సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, కథకుడిగా, మాటల రచయితగా పనిచేసిన దాసరి నారాయణరావులోని ప్రతిభను గుర్తించిన రాఘవ.. మంచి కథ తెచ్చుకుంటే డైరెక్టర్‌గా అవకాశం ఇస్తానని చెప్పారు. ఆరోజుల్లో దర్శకుడిగా ఛాన్స్‌ రావాలంటే నిర్మాతను మెప్పించడమే కాదు, డిస్ట్రిబ్యూటర్‌ని కూడా ఒప్పించాలి. అలా ఓ పంపిణీదారుడి ఆఫీస్‌కి వెళ్లి అక్కడి ఇన్‌ఛార్జ్‌కి కథ చెప్పారు. దర్శకుడు కొత్తవాడు కావడంతో ఎందుకొచ్చిన రిస్క్‌ అనుకున్న ఆ పంపిణీదారుడు కథ నచ్చలేదని రాఘవకు చెప్పారు. ఆ తర్వాత మరో డిస్ట్రిబ్యూటర్‌ కథ విని ఓకే అన్నారు. ఇలా ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని 1972లో ‘తాతమనవడు’ షూటింగ్‌ మొదలైంది. 

తాత పాత్రకు ఎస్‌.వి.రంగారావును ఓకే చేసుకున్నారు. మనవడి పాత్రకు మొదట శోభన్‌బాబుని అనుకున్నారు. కానీ, చివరికి ఆ అవకాశం రాజబాబుకి దక్కింది. హాస్యపాత్రలు చేసే రాజబాబుకి సినిమాలోని ప్రధాన పాత్ర ఇవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమాలో నాగభూషణం కోసం ఓ క్యారెక్టర్‌ సృష్టించారు దాసరి. ఆ క్యారెక్టర్‌ని అతనితోనే చేయించాలనుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత రాఘవకు చెప్పారు దాసరి. ఆయన దానికి ఓకే చెప్పారు. అయితే అతనికి ఇచ్చే రెమ్యునరేషన్‌ ఇదీ.. దానికి ఇష్టమైతే ఆయనతోనే చేయించు అన్నారు. నాగభూషణం అంతకుముందు ఒకే కుటుంబం అనే సినిమాను నిర్మించారు. దానికి దాసరి కో డైరెక్టర్‌గా పనిచేశారు. వాస్తవానికి దాసరి మొదటి సినిమా నాగభూణం నిర్మాతగానే చెయ్యాల్సింది. కానీ, అది సాధ్య పడలేదు. ఇక ‘తాతమనవడు’ సినిమాలో నాగభూషణంతో ఒక క్యారెక్టర్‌ చేయించుకోవాలని ఆశపడ్డ దాసరి కోరిక తీరలేదు. ఎందుకంటే రాఘవ ఇస్తానన్న రెమ్యునరేషన్‌ నాగభూషణంకి నచ్చలేదు. దాంతో ఆ క్యారెక్టర్‌ గుమ్మడికి దక్కింది. మరో క్యారెక్టర్‌ కోసం సూర్యకాంతంని అనుకున్నారు. అంతకుముందు మేనకోడలు అనే సినిమాకి దాసరి డైలాగ్‌ రైటర్‌గా వర్క్‌ చేశారు. అందులో సూర్యకాంతం తన వెర్షన్‌కి సంబంధించిన డైలాగ్స్‌లో ఓ డైలాగ్‌ను ఆమె మార్చేశారు. అది దృష్టిలో ఉంచుకొని ఆ క్యారెక్టర్‌ కోసం మంజుల అనే సీనియర్‌ నటిని ఎంపిక చేసుకున్నారు. ఇక కొడుకు పాత్ర కోసం కైకాల సత్యనారాయణను తీసుకున్నారు. అప్పటివరకు విలన్‌ పాత్రలు పోషిస్తూ ఎదుగుతున్న సత్యనారాయణ ఈ సినిమాలో ఓ విలక్షణమైన పాత్రతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాఘవ నిర్మించిన సినిమాలన్నింటికీ ఎస్‌.పి.కోదండపాణి సంగీతాన్ని అందించారు. అయితే ‘తాతమనవడు’ చిత్రానికి మాత్రం రమేష్‌ నాయుడుని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పెట్టుకున్నారు దాసరి. ఈ సినిమాలోని ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం..’ ‘ఈనాడే బాబు నీ పుట్టినరోజు..’ వంటి పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. 

ఈ సినిమాకి దాసరి నారాయణరావు అందుకున్న పారితోషికం నెలకు 200 రూపాయలు. ఈ సినిమాకి ఎస్‌.వి.రంగారావు అందుకున్న పారితోషికం 2,000 రూపాయలు. రూ.5 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను 35 రోజుల్లో పూర్తి చేశారు. డిసెంబర్‌ 27, 1972న ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకొని 1973 మార్చి 23న విడుదలైంది. తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది. ఇద్దరు అగ్ర హీరోల సినిమాల మధ్య విడుదలైన ఈ సినిమాకి మొదటి వారం కలెక్షన్స్‌ లేవు. మౌత్‌ టాక్‌ బాగా స్ప్రెడ్‌ అవడంతో రెండో వారం నుంచి కలెక్షన్లు పుంజుకున్నాయి. అలా రజతోత్సవం జరుపుకునే స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. కొన్ని కేంద్రాల్లో సంవత్సరం పాటు ఈ సినిమాను ప్రదర్శించారు. 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతిలలో ఈ సినిమా శతదినోత్సవాన్ని నిర్వహించారు. మద్రాస్‌లోని సవేరా హోటల్‌లో రజతోత్సవాన్ని చేశారు. ‘తాతమనవడు’ చిత్రంతో దాసరి తిరుగులేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అప్పటివరకు స్టార్‌ వేల్యూతో ఉన్న తెలుగు సినిమా ‘తాతమనవడు’ చిత్రంతో స్టోరీ వేల్యూకి నీరాజనం పట్టింది. డైరెక్టర్‌కి స్టార్‌ హీరో ఇమేజ్‌ తీసుకొచ్చిన ఘనత దాసరి నారాయణరావుకే దక్కుతుంది. ఎన్టీఆర్‌ సినిమా, ఎఎన్నార్‌ సినిమా అని చెప్పుకున్నట్టుగానే ఇది దాసరి నారాయణరావు సినిమా అని చెప్పుకునే స్థాయికి వెళ్ళారు దాసరి. ‘తాతమనవడు’ చిత్రానికి ప్రేక్షకుల రివార్డులే కాదు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు కూడా దక్కాయి. ఉత్తమ ద్వితీయ చిత్రంగా వెండి నందిని గెలుచుకుందీ చిత్రం. ఉత్తమ రచయితగా, ఉత్తమ దర్శకుడిగా దాసరి నారాయణరావు అవార్డులు అందుకోగా, ఉత్తమ నటుడిగా కైకాల సత్యనారాయణ ఎంపికయ్యారు.