Read more!

English | Telugu

కాలేజీలో కృష్ణకు ‘దేవుడు’ అనే నిక్‌నేమ్‌ ఎందుకు పెట్టారోగానీ నిజంగా ఇండస్ట్రీకి ఆయన దేవుడే

సినిమా ఇండస్ట్రీలో మంచివాళ్ళకు కొదవలేదు. అలాగే చెడ్డవాళ్ళకు కూడా కొదవలేదు. అయితే దేవుడులాంటి వారు అని చెప్పుకునే అర్హత ఉన్నవారు కొద్దిమందే ఉంటారు. వారిలో సూపర్‌స్టార్‌ కృష్ణ పేరును ముందు చెప్పుకోవాలి. ఈ మాట ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్‌ చెప్పడం కాదు, తోటి హీరోలు కూడా అదే మాట చెప్పడం కృష్ణలో ఉన్న గొప్పతనానికి నిదర్శనం. సూపర్‌స్టార్‌ కృష్ణ, మురళీమోహన్‌ క్లాస్‌మేట్స్‌. సినిమాల్లోకి రాకముందు నుంచి ఇద్దరూ మంచి స్నేహితులు. కృష్ణ తనకి సినిమాల్లోకి రావాలని ఉందని మొట్ట మొదట చెప్పింది మురళీమోహన్‌కే. కృష్ణతో తనకు ఉన్న అనుబంధం, ఆయన వ్యక్తిత్వం గురించి ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్‌ ప్రస్తావించారు. ఆ విశేషాలన్నీ ఆయన మాటల్లోనే...

‘తను కోరుకున్న ఎంపిసి గ్రూప్‌ సీటు తెనాలిలో కృష్ణకు రాలేదు. దాంతో ఏలూరు వచ్చి నేను చదువుతున్న కాలేజీలో జాయిన్‌ అయ్యాడు. అతనికి ‘మల్లెపూవు’ నిర్మాత ముఖర్జీ తప్ప ఆ ఊరిలో తెలిసిన వారెవరూ లేరు. దీంతో ముఖర్జీగారు కృష్ణను నాకు పరిచయం చేసి మీరిద్దరూ ఓకే చోట కూర్చోండి అని నాకు అప్పగించారు. అలా మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యాం. అయితే తనకు సినిమాల్లో నటించాలనిగానీ, హీరోగా పేరు తెచ్చుకోవాలని గానీ అప్పుడు లేదు. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావుగారు 60 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరు కాలేజీలో వజ్రోత్సవం జరిగింది. అక్కినేని, పేకేటి ఆ ఫంక్షన్‌కి హాజరయ్యారు. ఆ సమయంలో అక్కినేనికి ఉన్న క్రేజ్‌, ఒక హీరో కోసం జనం ఎగబడుతున్న తీరు చూసిన కృష్ణకు మొదటిసారి సినిమాల్లో నటించాలన్న కోరిక కలిగింది. మనం అందంగానే ఉన్నాం కదా. మనమెందుకు సినిమాల్లో ట్రై చేయకూడదు అన్నారు. మనం అంటే తను ఆని ఆయన ఉద్దేశం. అందంగానే ఉన్నావు కదా ట్రై చెయ్యి, బాగుంటుంది అని చెప్పాను. ఆ తర్వాతి నుంచి తను పెద్ద హీరో అయిపోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చెబుతూ ఉండేవారు. వాళ్ళ ఊర్లో గెయిటీ అనే థియేటర్‌ ఉంది. దానంత పెద్ద థియేటర్‌ కట్టాలని, పడవలా ఉండే కారులో తిరగాలని.. చెబుతుండేవారు.  ఈ విషయాలన్నీ నాతోపాటు అతనికి ఫ్రెండ్లీగా ఉండే కొందరి దగ్గర మాత్రమే ప్రస్తావించేవారు. స్వతహాగా కృష్ణ మితభాషి. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కాలేజీకి వచ్చినా మాలాంటి వారితో తప్ప ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. తన సీట్లో అలా కూర్చొనేవారు. సాధారణం కాలేజీల్లో నిక్‌నేమ్స్‌ పెడుతుంటారు. అలా కృష్ణకి ‘దేవుడు’ అని నిక్‌నేమ్‌ పెట్టారు. ఎప్పుడూ ఒక విగ్రహంలా తన సీట్లో కూర్చుని వుండేవారు. అందుకే ఆ పేరు పెట్టారు. ఏ వేళా విశేషంలో దేవుడు అని పేరు పెట్టారోగానీ, ఆ తర్వాత ఇండస్ట్రీలో నిజంగానే దేవుడు అనిపించుకున్నారు. నిర్మాత శ్రేయస్సును కోరుకునే ఏకైక హీరో కృష్ణ.

ఏ నిర్మాతయినా తనతో సినిమా తీసి నష్టపోయి ఆ తర్వాత కనిపించకపోతే, అతని గురించి వాకబు చేసేవారు. అలా ఓ నిర్మాత గురించి తమ్ముడు హనుమంతరావుగారిని పిలిచి అడిగారు. సినిమా ఫ్లాప్‌ అయింది కదా అందుకే రావడం లేదు అని ఆయన చెబితే వెంటనే మనిషిని పంపి ఆ నిర్మాతను పిలిపించారు. ఎందుకు కనిపించడం లేదు అని అడిగితే తను చేసిన సినిమా వల్ల నష్టపోయానని, ఇప్పుడు సినిమా స్టార్ట్‌ చేస్తే కొబ్బరికాయ కొట్టడానికి కూడా తన దగ్గర డబ్బులేదని చెప్పారు. అవన్నీ వదిలేసి నువ్వు ముందు సినిమా మొదలుపెట్టు అని ఆ సినిమాకి ఫైనాన్స్‌ చేయించి, సబ్జెక్ట్‌ కూడా తనే సెలక్ట్‌ చేసి డైరెక్టర్‌ని కూడా తనే ఫిక్స్‌ చేసి తీయించారు. అలా చాలా మంది నిర్మాతల్ని ఆదుకున్నారు కృష్ణ. ఒకవేళ రిలీజ్‌ టైమ్‌లో డబ్బు కట్టాల్సి వస్తే దానికి కూడా తను సంతకం పెట్టేవారు. సినిమా రిలీజ్‌ అయిన తర్వాత అన్ని లెక్కలూ చూసి వచ్చిన లాభాన్ని అతనికే ఇచ్చేవారు. అలా ఎవరు చేస్తారు? నాకు తెలిసి ఎవరూ అలా చేయరు. ఈ విషయంలో ఇండస్ట్రీ మొత్తంలో ఆయన తర్వాతే ఎవరైనా. నేను కూడా ఆయన తర్వాతే. మరో విషయం ఏమిటంటే డబ్బు ఇస్తేనేగానీ షూటింగ్‌కి రాను అని అతని కెరీర్‌లో ఎప్పుడూ ఏ నిర్మాతతోనూ అనలేదు. అలా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ డబ్బు విషయం ప్రస్తావనకు వచ్చినా డబ్బుదేముంది ముందు సినిమా కంప్లీట్‌ చేసి రిలీజ్‌ చెయ్యి అనేవారు. నేను కూడా ఆయన ఇన్‌ఫ్లుయెన్స్‌తోనే వచ్చాను కాబట్టి నాది కూడా అదే స్కూల్‌. నేను కూడా డబ్బులిస్తేనే షూటింగ్‌కి వస్తానని ఏరోజూ అనలేదు. నేను కూడా నిర్మాతల హీరోనే. మొదటి నుంచీ సినిమా డబ్బు పెట్టేది నిర్మాతే. చివరలో చిల్ల ఏరుకునేది కూడా నిర్మాతే. అతను చేసిన సినిమా సక్సెస్‌ నాలుగు రూపాయలు వస్తే మరో సినిమా తియ్యగలడు. నిర్మాత శ్రేయస్సును కోరుకునే హీరోల్లో ప్రథముడు కృష్ణ. అందుకే ఇండస్ట్రీ ఆయన్ని దేవుడు అంటుంది’ అని వివరించారు మురళీమోహన్‌.