Read more!

English | Telugu

ఒకే కథతో పి.పుల్లయ్య రెండు సినిమాలు చేస్తే హిట్‌.. అదే కథతో ఎన్టీఆర్‌ తీస్తే ఫ్లాప్‌!

1939లో పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘శ్రీవేంకటేశ్వర మహత్మ్యం’. ఈ సినిమాలో వేంకటేశ్వరస్వామిగా సీఎస్‌ఆర్‌, పద్మావతిగా శాంతకుమారి నటించారు. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్‌ అయ్యింది. ఆ తర్వాత 1960లో ‘శ్రీవేంకటేశ్వర మహత్మ్యం’ పేరుతోనే మళ్ళీ రూపొందించారు పి.పుల్లయ్య. ఈ సినిమాలో వేంకటేశ్వరస్వామిగా ఎన్‌.టి.రామారావు నటించగా, పద్మావతిగా సావిత్రి నటించారు. ఇక విశేషం ఏమిటంటే 1939లో వచ్చిన ‘శ్రీవేంకటేశ్వర మహత్మ్యం’ చిత్రంలో పద్మావతిగా నటించిన శాంతకుమారి ఈ సినిమాలో వకుళాదేవిగా తల్లి పాత్రలో నటించారు. ఈ రెండు సినిమాలూ మంచి ఘనవిజయాన్ని సాధించాయి. 

ఆ తర్వాత ఎన్‌.టి.రామారావు 1979లో ఇదే సినిమాని మళ్లీ చెయ్యాలన్ని ప్రయత్నించారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో చేసిన ఆ రెండు సినిమాలు పెద్ద హిట్‌ అయ్యాయి. అదే కలర్‌లో చేసే ఇంకా బాగా ఆడుతుందని భావించిన ఎన్టీఆర్‌ తనే దర్శకనిర్మాతగా ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’ పేరు అదే సినిమాను మళ్ళీ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్‌.టి.రామారావు వేంకటేశ్వరుడిగా, పద్మావతిగా జయప్రద, లక్ష్మీదేవిగా జయసుధ నటించారు. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ నారదుడి పాత్ర పోషించారు. ఇంతటి భారీ తారాగణంతో రంగుల్లో నిర్మించిన ఈ సినిమా విజయం సాధించలేదు. అంతకుముందు వచ్చిన రెండు సినిమాలే ప్రేక్షకుల మదిలో ఉండడం వల్ల ఈ సినిమాకి ఆదరణ లభించలేదు.