Read more!

English | Telugu

రావుగోపాలరావు చెయ్యాల్సిన క్యారెక్టర్‌ కోట శ్రీనివాసరావుకి దక్కింది.. దశ తిరిగింది!

సినిమాల్లోని కొన్ని క్యారెక్టర్లు వారి కోసమే పుట్టాయా అన్నంత కరెక్ట్‌గా ఆయా నటీనటులకు సరిపోతాయి. ఇక కొన్ని క్యారెక్టర్స్‌ ఒక నటుడు చెయ్యాల్సి ఉంటే.. అటు తిరిగి ఇటు తిరిగి మరొకరికి ఆ అవకాశం దక్కుతూ ఉంటుంది. అలాంటి ఓ అద్భుతమైన క్యారెక్టర్‌ కోట శ్రీనివాసరావుని వరించింది. 1988లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘అహనా పెళ్ళంట’ చిత్రాన్ని ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఎందుకంటే ఆ సినిమాలోని హాస్యం అంతగా ప్రేక్షకుల్లో నాటుకుపోయింది. ముఖ్యంగా  లక్ష్మీపతిగా కోట శ్రీనివాసరావు, అరగుండుగా బ్రహ్మానందం పండిరచిన కామెడీ ఇప్పటికీ నవ్వు తెప్పిస్తుంది. వీరిద్దరూ ఈ సినిమాకి ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సీన్స్‌ అన్నీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. ఈ సినిమా అంతటి ఘనవిజయం సాధించిందంటే దానికి కారణం కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

వాస్తవానికి లక్ష్మీపతి క్యారెక్టర్‌ కోట శ్రీనివాసరావుకి ఒక వరంలా లభించిందనే చెప్పాలి. మొదట ఈ కథ అనుకున్నప్పుడు లక్ష్మీపతి క్యారెక్టర్‌ని రావుగోపాలరావుతో చేయించాలనుకున్నారు. అప్పటికే కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో నటించిన ‘మండలాదీశుడు’ సినిమాను చూసి కోట అయితేనే క్యారెక్టర్‌కి న్యాయం జరుగుతుందని భావించారు జంధ్యాల. ఇదే విషయాన్ని నిర్మాత రామానాయుడుతో చెప్పారు. దానికాయన ఒప్పుకోలేదు. రావుగోపాలరావు అయితేనే బాగుంటుందని ఆయన భావించారు. జంధ్యాల మాత్రం కోటకే ఫిక్స్‌ అయ్యారు. మొత్తానికి రామానాయుడికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ క్యారెక్టర్‌ను కోట శ్రీనివాసరావుతో చేయించేందుకు ఆయన్ని ఒప్పించారు. అయితే ఈ విషయాన్ని కోటకు వెంటనే చెప్పలేదు జంధ్యాల. 

ఈ విషయాన్ని కోట శ్రీనివాసరావు స్వయంగా ఒకసారి ప్రస్తావించారు. ‘నేను చెన్నయ్‌ వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాను. అక్కడ ఓచోట రామానాయుడు కూర్చొని ఉన్నారు. అప్పటికి నటుడుగా నాకు అంత గుర్తింపు లేదు. అలాంటిది ఆయన ముందు కూర్చునేందుకు సంశయించాను. అప్పుడు ఆయనే నన్ను పిలిచి జంధ్యాలతో ఒక సినిమా ప్లాన్‌ చేశామయ్యా. ఈరోజే ఫైనల్‌ అయింది. అందులో ఒక మంచి క్యారెక్టర్‌ ఉంది. అది వర్కవుట్‌ అయితే సినిమా చాలా పెద్ద హిట్‌ అయిపోతుంది. దాన్ని రావుగోపాలరావుతో చేయించాలనుకున్నాను. జంధ్యాల మాత్రం నీతోనే చేయిస్తానని పట్టుపట్టాడు. కాబట్టి నువ్వే ఆ క్యారెక్టర్‌ చేద్దువుగాని. నాకు నీ డేట్స్‌ 20 రోజులు కావాలి అని అడిగారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. సంతోషంగా చేస్తానని చెప్పాను. ఆ క్యారెక్టర్‌ను నాతోనే చేయించాలని జంధ్యాల ఎందుకు అనుకున్నారోగానీ, నా కెరీర్‌ని ఒక మలుపు తిప్పింది ఆ సినిమా’ అని గుర్తు చేసుకున్నారు కోట శ్రీనివాసరావు.