Read more!

English | Telugu

జయలలిత రాజకీయ నాయకురాలు అవుతుందని మొదట చెప్పిన హీరో ఎవరో తెలుసా?

జయలలిత అంటే తమిళ ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే రాజకీయ నాయకురాలిగా సుపరిచితమే. అంతకుముందు తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో నటించి సినీరంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించింది. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జయలలిత మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందింది. 1991లో ముఖ్యమంత్రి పదవి చేపట్టింది. ఫిబ్రవరి 24 జయలలిత జయంతి. ఈ సందర్భంగా ఆమె జీవితంలో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి తెలుసుకుందాం. 

హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో జయలలితకు రాజకీయాల పట్ల అవగాహన లేదు. అసలు రాజకీయాల్లోకి వెళ్లాలన్న కోరిక కూడా ఆమెకు లేదు. ఆ సమయంలోనే ఓ సంఘటన జరిగింది. జయలలిత రాజకీయాల్లోకి వెళుతుంది అని అందాల నటుడు శోభన్‌బాబు ఓ సందర్భంలో అన్నారు. అసలు శోభన్‌బాబు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. శోభన్‌బాబు, జయలలిత ఎంతో అభిమానంగా ఉండేవారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆరోజుల్లోనే జయలలిత ఒక కాస్ట్‌లీ గిఫ్ట్‌ని శోభన్‌బాబుకి ఇచ్చింది. అదేమిటంటే.. రూ.25 లక్షల విలువ చేసే డైమండ్‌ రింగ్‌. సరిగ్గా అలాంటి రింగే అంతకుముందు అప్పటి ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్‌కి కూడా ఆమె ఇచ్చారు. శోభన్‌బాబు అంటే జయలలితకు అంత ఇష్టం. అతనికి ఎలాంటి ఫుడ్‌ ఇష్టమో తెలుసుకొని అవన్నీ తెచ్చి పెట్టేది. అంత సన్నిహితంగా ఉండే జయలలిత, శోభన్‌బాబు ఓ సందర్భంలో ఓ పందెం వేసుకోవాల్సి వచ్చింది. 

అదేమిటంటే.. నువ్వు నటి కాకపోయి ఉంటే ఏమై ఉండేదానివి అని శోభన్‌బాబు.. జయలలితను అడిగారు. దానికామె.. సరే మీరు చెప్పండి అని శోభన్‌బాబుని అడిగింది. దానికాయన ఏముంది అందరు చెప్పినట్టుగానే యాక్టర్‌ కాకపోతే డాక్టర్‌ అయివుండేదాన్ని అని చెబుతావు అన్నారు. అది కాదు, వేరే ఉంది అని చెప్పింది. అంతకుమించి ఏమీ ఉండదని శోభన్‌బాబు వాదించారు. అయితే వెయ్యి రూపాయలు పందెం అనుకున్నారు. ఓ మూడు రోజులు గడిచిన తర్వాత ఒక పుస్తకం తీసుకొచ్చారు జయలలిత. తను మూడో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‌ సావనీర్‌ అది. అందులో తను రాసిన మాటలని చూపించింది. అది చూసి శోభన్‌బాబు షాక్‌ అయ్యారు. అందులో.. నేను పెద్దయ్యాక రామ్‌ జెఠ్మలాని అంతటి పెద్ద పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అవుతాను అని రాసి ఉంది. అది చదివిన తర్వాత తాను ఓడిపోయానని ఒప్పుకున్నారు శోభన్‌. ఇది తీసుకొచ్చి చూపించడానికే ఆ సమాధానం నా నోటినుంచే చెప్పించావన్నమాట అంటూ సరదాగా అన్నారు. అంతటితో ఆగకుండా.. ‘నీది పెద్ద రాజకీయమే.. భవిష్యత్తులో రాజకీయ నాయకురాలు అయ్యేంత తెలివితేటలు నీకు ఉన్నాయి’ అని శోభన్‌బాబు అన్నారు. ఆయన అలా ఎందుకు అన్నారో తెలీదు గానీ, ఆ తర్వాతి రోజుల్లో జయలలిత రాజకీయాల్లో చక్రం తిప్పి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే.