Read more!

English | Telugu

ఇద్దరు అగ్ర దర్శకుల పోటీ వల్ల చరిత్ర సృష్టించే సినిమాలు చేసిన ఎన్టీఆర్‌!

1976 వరకు పౌరాణిక, జానపద చిత్రాలు, కుటుంబ కథలతో కూడిన సాంఘిక చిత్రాలు, యాక్షన్‌ మూవీస్‌.. ఇలా విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఎన్‌.టి.రామారావుకి ఒక కొత్త ఇమేజ్‌ని తీసుకొచ్చేందుకు, ఆయన సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిపించడమే లక్ష్యంగా ఇద్దరు దర్శకులు వచ్చారు. వారే దర్శకరత్న దాసరి నారాయణావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. ఎన్టీఆర్‌తో పోటాపోటీగా సినిమాలు తీసి ఒక దాన్ని మించి మరొకటి హిట్‌ అయ్యే విధంగా సినిమాలను రూపొందించారు. ‘మనుషులంతా ఒక్కటే’ చిత్రంతో ప్రారంభమైన వీరి విజయపరంపర పదేళ్ళపాటు కొనసాగింది. 

1976లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన డిఫరెంట్‌ మూవీ ‘మనుషులంతా ఒక్కటే’. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించడమే కాకుండా ఎన్టీఆర్‌ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. ఆ తర్వాత 1977లో ఎన్టీఆర్‌తో ‘అడవిరాముడు’ చిత్రాన్ని చేశారు రాఘవేంద్రరావు. ఈ సినిమాతో ఎన్టీఆర్‌ లుక్‌ను, ఇమేజ్‌ను మార్చేయడమే కాకుండా ఒక కమర్షియల్‌ హీరోగా ఆయన్ని ప్రజెంట్‌ చేశారు రాఘవేంద్రరావు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించి సిల్వర్‌ జూబ్లీ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ‘సింహబలుడు’, ‘కేడీ నెం.1’, ‘డ్రైవర్‌ రాముడు’ వంటి సినిమాలతో ఎన్టీఆర్‌ రేంజ్‌ని మరింత పెంచారు రాఘవేంద్రరావు. డ్రైవర్‌ రాముడు తర్వాత పూర్తి పౌరాణిక చిత్రంగా శ్రీమద్‌విరాటపర్వం చిత్రాన్ని చేశారు ఎన్టీఆర్‌. ఆ సినిమా తర్వాత పూర్తి కమర్షియల్‌ సినిమాగా ‘వేటగాడు’ చిత్రాన్ని రూపొందించారు రాఘవేంద్రరావు. ఇలా కేవలం రెండు సంవత్సరాల్లో ఎన్టీఆర్‌ హీరోగా 5 సినిమాలు చేశారు రాఘవేంద్రరావు. 

‘మనుషులంతా ఒక్కటే’ తర్వాత 4 సంవత్సరాలకుగానీ మళ్ళీ ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం రాలేదు దాసరికి. 1980లో ‘సర్కస్‌ రాముడు’ పేరుతో ఓ కమర్షియల్‌ చిత్రాన్ని ప్లాన్‌ చేశారు. కానీ, ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత వెంటనే అద్భుతమైన సబ్జెక్ట్‌తో ‘సర్దార్‌ పాపారాయుడు’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు. ఈ సినిమా ఎన్టీఆర్‌ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌గా నిలిచింది. దాన్ని మించిన విజయం సాధించేలా రాఘవేంద్రరావు ‘గజదొంగ’ చిత్రాన్ని ప్లాన్‌ చేశారు. ఈ సినిమా కూడా కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ వెంటనే ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లతో ‘సత్యం శివం’ చిత్రాన్ని రూపొందించారు రాఘవేంద్రరావు. అయితే ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమా తర్వాత దాసరి ఓ విభిన్నమైన కథాంశంతో ఎన్టీఆర్‌ని ఎంతో డిగ్నిఫైడ్‌గా చూపిస్తూ ‘విశ్వరూపం’ అనే చిత్రాన్ని చేశారు. ఈ సినిమా ఎన్టీఆర్‌కు, దాసరికి చాలా మంచి పేరు తెచ్చింది.  ఆ మరుసటి సంవత్సరం అంటే 1981లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘కొండవీటి సింహం’, 1982లో వచ్చిన ‘జస్టిస్‌ చౌదరి’ చిత్రాలు సాధించిన విజయంతో ఎన్టీఆర్‌ రేంజ్‌ ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించడమే కాకుండా కమర్షియల్‌గా సంచలనం సృష్టించాయి. ఈ రెండు సినిమాలకు ధీటుగా ఉండేలా ఒక అద్భుతమైన కథతో సినిమా తియ్యాలని ఆలోచించిన దాసరి అదే సంవత్సరం ‘బొబ్బిలిపులి’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఎంతో వేగంగా చిత్రాన్ని పూర్తి చేసి అదే సంవత్సరం విడుదల చేశారు. ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ఒక మైల్‌స్టోన్‌ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పెర్‌ఫార్మెన్స్‌, ఆయన చెప్పిన డైలాగ్స్‌ ప్రేక్షకుల్లోకి బాణాల్లా దూసుకెళ్ళాయి. 

నందమూరి తారక రామారావుతో ఒకరిని మించి ఒకరు సినిమాలు తీసి హిట్‌ కొట్టాలన్న పట్టుదలతో దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు ఎంతో స్పోర్టివ్‌గా సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని అందించడంలో ఇద్దరూ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యారు. ఎన్టీఆర్‌తో వీరిద్దరి విజయ పరంపర ‘బొబ్బిలిపులి’తో ముగిసింది. 1982లో ఎన్టీఆర్‌తో ‘జస్టిస్‌ చౌదరి’ చిత్రాన్ని చేసిన రాఘవేంద్రరావు దాదాపు 11 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రాన్ని చేసి మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ‘బొబ్బిలిపులి’ తర్వాత ఎన్టీఆర్‌తో మరో సినిమా చెయ్యలేదు దాసరి. 

ఒకే హీరోతో ఇద్దరు విభిన్న స్వభావాలు, విభిన్న తరహా సినిమాలు చేసే అగ్ర దర్శకులు పోటీ పడి మరీ సినిమాలు చేసి ఘనవిజయాలు అందుకోవడం అనేది సినిమా చరిత్రలో అరుదుగా జరుగుతుంది. అది ఎన్‌.టి.రామరావు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు విషయంలోనే జరిగింది. ఒక సినిమాని మించి మరో సినిమా హిట్‌ చెయ్యాలన్న పట్టుదలతో సినిమాలు చేసిన ఈ ఇద్దరు దర్శకులు ఏ దశలోనూ వివాదాలకు తావు ఇవ్వలేదు. వారిద్దరి మధ్య చిన్న మనస్పర్థ కూడా రాలేదు. అంతటి స్పోర్టివ్‌నెస్‌తో సినిమాలు తీసిన ఈ అగ్ర దర్శకుల నుంచి ఈతరం దర్శకులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.