Read more!

English | Telugu

రౌడీలా ఉన్నాడు.. సినిమా తియ్యగలడా.. అనుకున్న ఎన్టీఆర్‌ని స్టార్‌ హీరోని చేసిన వినాయక్‌!

సినిమారంగంలో అనుకోకుండా ఎన్నో జరుగుతాయి. కొన్ని సక్సెస్‌ని తెచ్చేవి అయితే, మరికొన్ని అపజయాల్లోకి నెట్టేసేవి. అలా అనుకోకుండా కుదిరిన కొన్ని సినిమాలు చరిత్ర సృష్టించిన సందర్భాలు ఇండస్ట్రీలో చాలా జరిగాయి. అలాంటి వాటిలో ఎన్టీఆర్‌, వి.వి.వినాయక్‌ కాంబినేషన్‌లో వచ్చిన బాక్లస్‌బస్టర్‌ ‘ఆది’ ఒకటి. ‘స్టూడెంట్‌ నెం.1’ సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్‌ స్విట్జర్లాండ్‌కి వెళ్ళింది. అక్కడ షూటింగ్‌ పూర్తి చేసుకొని ఇండియాకి బయల్దేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు ‘నన్ను గుర్తుపట్టారా.. నా పేరు బుజ్జి.. నిన్ను చూడాలని సినిమా మార్నింగ్‌ షో చూసి గుంటూరు నుంచి మీకు ఫోన్‌ చేశాను’ అని గుర్తు చేశాడు. ఆ తర్వాత పక్కనే వున్న వ్యక్తిని పరిచయం చేస్తూ ‘ఇతని పేరు వి.వి.వినాయక్‌.. సాగర్‌గారి దగ్గర అసోసియేట్‌గా చేశాడు. ప్రస్తుతం చంద్రమహేష్‌ డైరెక్షన్‌లో వస్తున్న ‘చెప్పాలని ఉంది’ చిత్రానికి పనిచేస్తున్నాడు. పాటల కోసం ఇక్కడికి వచ్చాం. మీకు కరెక్ట్‌గా సరిపోయే కథ ఒకటి మా దగ్గర ఉంది. వింటారా’ అని అడిగాడు బుజ్జి. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత కలవమని చెప్పాడు ఎన్టీఆర్‌. చెప్పినట్టుగానే ఎన్టీఆర్‌ను కలిసారు బుజ్జి, వినాయక్‌. చూడటానికి రౌడీలా ఉన్నాడు.. ఇతను సినిమా తియ్యగలడా అనుకున్నాడు ఎన్టీఆర్‌. వినాయక్‌ మాత్రం కథ చెప్పేందుకు సిద్ధమయ్యాడు. 

‘కథ మొత్తం చెపక్కర్లేదు. ఇండ్రక్షన్‌, ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ చెబితే చాలు’ అన్నాడు ఎన్టీఆర్‌. అప్పుడు వినాయక్‌ ‘ఇంట్రో ఒక్కటే చెబుతాను. మీకు నచ్చితే మిగతా కథ వినండి’ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. అలా రెండు గంటల పాటు కథ విన్న తర్వాత ’మనం ఈ సినిమా చేస్తున్నామన్నా’ అన్నాడు ఎన్టీఆర్‌. దాంతో ఎన్టీఆర్‌తో వినాయక్‌ సినిమా చెయ్యబోతున్నాడన్న వార్త ఇండస్ట్రీలో స్ప్రెడ్‌ అయిపోయింది. నాలుగు రోజుల తర్వాత ఎన్టీఆర్‌ నుంచి వినాయక్‌కి కబురొచ్చింది. వినాయక్‌ వెళ్ళి ఎన్టీఆర్‌ను కలిసాడు. ‘కథ బాగానే ఉంది గానీ లవ్‌ స్టోరీ చెయ్యొద్దంటున్నాడు కొడాలి నాని. మంచి మాస్‌ కథ ఏదైనా ఉంటే చెయ్యమన్నాడు. అలాంటి కథ ఏదైనా ఉంటే చెప్పండి’ అన్నాడు ఎన్టీఆర్‌. అప్పటికప్పుడు మాస్‌ కథ అంటే ఎలా వస్తుంది అనుకుంటూ ఉన్న వినాయక్‌కి తను ఎప్పుడో అనుకున్న రెండు సీన్లు గుర్తొచ్చాయి. అవే చెప్పాడు వినాయక్‌. అవేమిటంటే.. ఒక చిన్న పిల్లాడు బాంబులు వేయడం, బ్లాస్ట్‌లో సుమోలు గాల్లోకి లేవడం.. ఈ రెండు చెప్పాక ‘ఫ్యాక్షన్‌ కథ నాకు హెవీ అయిపోతుందేమో’ అన్నాడు. ఎలాగైనా తనని వదిలించుకోవాలని అలా చెబుతున్నాడని వినాయక్‌కి అర్థమైంది. అయినా ‘ఒక వారం టైమ్‌ ఇవ్వండి. కథ రెడీ చేస్తాను. అది కూడా నచ్చకపోతే డేట్స్‌ ఎవరికైనా ఇచ్చెయ్యండి అని చెప్పాడు. 

తిండి, నిద్ర మీద ధ్యాస పెట్టకుండా ప్రతిక్షణం స్క్రిప్‌ రెడీ చెయ్యడానికే ఉపయోగించాడు. ఫలితంగా 58 పేజీల స్క్రిప్ట్‌ రెడీ అయిపోయింది. కథ విన్న ఎన్టీఆర్‌ ఎగిరి గంతేశాడు. సినిమా చెయ్యడానికి ఒక కండిషన్‌ పెట్టాడు ఎన్టీఆర్‌. బూరుగపల్లి శివరామకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తారు అని చెప్పారు. దానికి వినాయక్‌ అభ్యంతరం చెబుతూ బుజ్జి ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలని ఎదురు చూస్తున్నాడు. నేను అతనికి మాట ఇచ్చాను అన్నాడు. వినాయక్‌లోని మాటకు కట్టుబడే గుణం ఎన్టీఆర్‌కి నచ్చింది. అందుకే వినాయక్‌ చెప్పినట్టుగానే చేద్దాం అన్నాడు. బెల్లంకొండ సురేష్‌ సమర్పణలో నాగలక్ష్మీ నిర్మాతగా, బుజ్జి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా ప్రాజెక్ట్‌ సెట్‌ అయ్యింది. అలా ‘ఆది’ సినిమా ప్రారంభమైంది. డైరెక్టర్‌కి, హీరోకి ట్యూనింగ్‌ బాగుంటే సినిమాలు ఎంత త్వరగా పూర్తవుతాయనికి నిదర్శనంగా ‘ఆది’ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. హైదరాబాద్‌, వైజాగ్‌, విజయనగరం ప్రాంతాల్లో 65 రోజుల్లో సినిమాను పూర్తి చేశారు.  2002 మార్చి 28న ‘ఆది’ రిలీజ్‌ అయి బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. 19 ఏళ్ళ వయసులో స్టార్‌ హీరో అయిపోయాడు ఎన్టీఆర్‌. ఇక వి.వి.వినాయక్‌ ఓవర్‌ నైట్‌ స్టార్‌ డైరెక్టర్‌ అయిపోయాడు. ఈ సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.2.35 కోట్లు. అన్నిచోట్టా బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది. రూ.25 కోట్లకు పైగా కలెక్షన్‌ సాధించి సంచలనం సృష్టించింది.