Read more!

English | Telugu

ఆ సినిమా రిలీజ్‌ అవ్వడానికి 18 ఏళ్ళు పట్టింది... ఎన్టీఆర్‌ను చూసి అందరూ షాక్‌ అయ్యారు!

నటరత్న ఎన్‌.టి.రామారావు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్ర పోషించినా అందులో జీవించే ఎన్టీఆర్‌ తన నటజీవితంలో 300కి పైగా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అలాంటి ఎన్టీఆర్‌ చేసిన 300 సినిమాల్లో రెండు సినిమాలకు మాత్రం తను డబ్బింగ్‌ చెప్పలేదు. వేరే వారితో డబ్బింగ్‌ చెప్పించారు. వాటిలో మొదటిది ‘సంపూర్ణ రామాయణం’. ఈ చిత్రాన్ని తమిళ్‌లో రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్‌ శ్రీరాముడిగా నటించారు. ఈ సినిమాలో తెలుగు నటీనటులు కూడా ఉండడంతో తెలుగులోకి డబ్‌ చేశారు. ఈ సినిమాలోని శ్రీరాముడి పాత్రకు వేరొకరితో డబ్బింగ్‌ చెప్పించారు. అది చూసిన తెలుగు ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇక రెండో సినిమా ‘ఎర్రకోట వీరుడు’. ఈ సినిమా 70 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 1955లో దర్శక పితామహుడు హెచ్‌.ఎం.రెడ్డి.. ఎన్‌.టి.రామారావు కథానాయకుడిగా ‘గజదొంగ’ పేరుతో చిత్రాన్ని ప్రారంభించారు. వై.ఆర్‌.స్వామి దర్శకుడు. సావిత్రి, బి.సరోజాదేవి హీరోయిన్లు. రాజనాల, ఆర్‌.నాగేశ్వరరావులను విలన్లుగా తీసుకున్నారు. 

ఈ చిత్రాన్ని ఏ వేళా విశేషంలో ప్రారంభించారో తెలీదుగానీ, అడుగడుగునా ఆటంకాలే ఎదురయ్యేవి. సినిమా సగానికిపైగా పూర్తయిన తర్వాత హెచ్‌.ఎం.రెడ్డి కన్నుమూయడంతో సినిమా ఆగిపోయింది. ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా కావడంతో ఆ సినిమాను పూర్తి చేసేందుకు కొందరు ముందుకు వచ్చారు. కొంతకాలానికి మళ్ళీ షూటింగ్‌ మొదలైంది. కొన్ని రోజులు షూటింగ్‌ చేసిన తర్వాత నటుడు ఆర్‌.నాగేశ్వరరావు మరణించారు. దీంతో మళ్ళీ షూటింగ్‌ ఆగిపోయింది. ఆర్‌.నాగేశ్వరరావు స్థానంలో తమిళ నటుడు నంబియార్‌ను ఎంపిక చేశారు. మళ్ళీ షూటింగ్‌ ప్రారంభించే నాటికి దర్శకుడు కూడా మారిపోయారు. వై.ఆర్‌. స్వామి స్థానంలో పార్థసారథి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. సినిమా టైటిల్‌ను కూడా ‘ధర్మవిజయం’గా మార్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా షూటింగ్‌ను కొనసాగించి మొత్తానికి సినిమాని పూర్తి చేశారు. ఇక పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించే సమయానికి అనుకోని ఇబ్బందులు ఎదురు కావడంతో మళ్ళీ సినిమా ఆగిపోయింది. కొన్నాళ్ళ తర్వాత ఎన్టీఆర్‌, సావిత్రి, బి.సరోజాదేవి నటించిన సినిమా కాబట్టి దాన్ని ఎలాగైనా పూర్తి చేసి రిలీజ్‌ చేద్దామని కొందరు ప్రయత్నించారు. కానీ, ఆ సినిమా చుట్టూ ఉన్న ఆర్థిక సమస్యల వల్ల వాళ్ళు ఆ సాహసం చేయలేకపోయారు. 

అలా ఆగిపోయిన సినిమా గురించి 18 ఏళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. 1973లో ఈ సినిమాని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నిర్మాత టి.గోపాలకృష్ణ. ఈ సినిమాకి ఉన్న ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అక్కడే మరో సమస్య ఎదురైంది. ఈ సినిమాకి ఎన్టీఆర్‌తో డబ్బింగ్‌ చెప్పించాలి. ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సినిమాకు డబ్బింగ్‌ చెప్పమని ఆయన్ని ఎలా అడగాలి అనేది పెద్ద సమస్య. ఒకవేళ ధైర్యం చేసి అడిగినా ఆయన దాన్ని ఎలా తీసుకుంటారో తెలీదు. అందుకే ఎన్టీఆర్‌ను ఈ విషయం గురించి అడగలేదు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ దశరథరామిరెడ్డితో డబ్బింగ్‌ చెప్పించారు. మిగిలిన నటీనటులు కూడా డబ్బింగ్‌ పూర్తి చేశారు. సినిమా పేరును మరోసారి మార్చారు. ఈసారి ‘ఎర్రకోట వీరుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. తమిళ్‌లో ‘తిరుడదే తిరుడన్‌’ అని పేరు పెట్టారు. 1973 డిసెంబర్‌ 14న ఈ సినిమా తెలుగులో విడుదలైంది. అప్పటికే ఎన్టీఆర్‌ నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’, ‘వాడే వీడు’ చిత్రాలు విడుదలై విశేషమైన ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విడుదలైన ‘ఎర్రకోట వీరుడు’  చిత్రానికి కూడా మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయి. సినిమా ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ఎన్టీఆర్‌ పాత్ర ప్రవేశిస్తుంది. చప్పట్లు, ఈలలతో ఎన్టీఆర్‌కు స్వాగతం పలికిన ప్రేక్షకులు మరుక్షణం షాక్‌ అయ్యారు. ఎన్టీఆర్‌కు వేరొకరి వాయిస్‌ పెట్టడం ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో ఈ సినిమా ఫ్లాప్‌ అయింది. ఎన్టీఆర్‌తోనే డబ్బింగ్‌ చెప్పించి ఉంటే మంచి విజయం సాధించేదని  అప్పట్లో ప్రేక్షకులు, కొందరు సినీ ప్రముఖులు కూడా అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా 18 సంవత్సరాలు సినిమాను రిలీజ్‌ చేసేందుకు ఎంతో మంది ప్రయత్నించి ఎట్టకేలకు రిలీజ్‌ చేసినా ఆ సినిమా వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూశారు ఆయా నిర్మాతలు.