Read more!

English | Telugu

ముగ్గురు ముఖ్యమంత్రులతో స్టెప్పులేయించిన కొరియోగ్రాఫర్‌ జీవితం అలా ముగిసింది!

మన సినిమాల్లో పాటలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ పాటలను అందంగా తెరపై ఆవిష్కరించడంలో కొరియోగ్రాఫర్‌ పాత్ర ఎంతో కీలకం. కొన్ని సినిమాల్లోని పాటలు ఎంత బాగున్నా ఆ పాటలకు సరైన నృత్యరీతులు కుదరకపోవడం వల్ల అందర్నీ ఆకట్టుకోలేవు. కొన్ని సినిమాల్లోని పాటలకు వేసే స్టెప్పుల వల్ల రిపీట్‌ ఆడియన్స్‌ థియేటర్స్‌కి వచ్చిన సందర్భాలు కోకొల్లలు. పాటలకు అలాంటి స్టెప్స్‌ కంపోజ్‌ చేసి ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగిన కొరియోగ్రాఫర్‌ సలీమ్‌ మాస్టర్‌. ఈ మూడు భాషల్లో ఏ హీరో అయినా, ఏ హీరోయిన్‌ అయినా తమకు సలీమ్‌ మాస్టరే కావాలి అని పట్టుపట్టేవారు. 

అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఒక కారణం ఉందని చెప్పేవారు సలీమ్‌. సాధారణంగా డాన్స్‌ మాస్టర్లు తమకు వచ్చిన విద్యను ప్రదర్శించేందుకు, తమకు ఎంత టాలెంట్‌ ఉందో నలుగురికీ చెప్పేందుకు కష్టమైన స్టెప్పులతో పాటలు కంపోజ్‌ చేసేవారు. ఇతను డాన్స్‌ మాస్టర్‌ కాబట్టి ఆ స్టెప్పులు అవలీలగా వేయగలడు. సినిమా కోసం అప్పటికప్పుడు చెప్పింది చెప్పినట్టు చేసే హీరోహీరోయిన్లకు అది  చాలా కష్టంగా ఉండేది. ఒక పాట పూర్తి చేయడానికి నానా కష్టాలు పడేవారు. హీరోహీరోయిన్లు తనను మాత్రమే ఎందుకు కోరుకునేవారు అనే విషయాన్ని తెలియజేస్తూ ‘ఏ హీరోకైనా, హీరోయిన్‌కైనా బాడీ లాంగ్వేజ్‌ అనేది ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పాటలకు స్టెప్పులు కంపోజ్‌ చేస్తాను. ఎలాంటి స్టెప్పులైతే వాళ్ళు ఎక్కువ కష్టపడకుండా అందంగా చెయ్యగలరో గమనించి దానికి తగ్గట్టుగా కంపోజ్‌ చేస్తాను. దాంతో ఏమాత్రం శ్రమ తెలియకుండా పాటలు పూర్తి చేసేవారు. అందుకే ప్రతి సినిమాకీ నన్నే పిలిచేవారు’ అంటూ అసలు విషయం చెప్పారు సలీమ్‌. 

తెలుగులో ఎన్‌.టి.రామారావు, తమిళ్‌లో ఎం.జి.రామచంద్రన్‌, జయలలిత.. ఈ ముగ్గురూ ఒకప్పుడు స్టార్సే.. ఆ తర్వాత ముగ్గురూ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే ఈ ముగ్గురు నటించిన చాలా సినిమాలకు సలీమ్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులతో స్టెప్పులేయించిన ఘనత సలీమ్‌ మాస్టర్‌కి దక్కింది. అయితే విధి బలీయమైనది. ఎంతటి స్టేటస్‌ ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఒక్క ఘటనతో జీవితాలు తారుమారు అవుతాయి. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి.. ఈ ఉదాహరణ సలీమ్‌ మాస్టర్‌కి కరెక్ట్‌గా సూట్‌ అవుతుంది. ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న సలీమ్‌ ఒక్కసారిగా అనాథ అయిపోయాడు. కడుపునిండా భోజనం చేయడానికి కూడా లేని పరిస్థితికి వచ్చేశాడు. 

వివరాల్లోకి వెళితే.. డాన్స్‌ మాస్టర్‌గా కొన్ని వందల సినిమాలకు పనిచేసిన సలీమ్‌ మద్రాస్‌ టి.నగర్‌లోని నార్త్‌ ఉస్మాన్‌ రోడ్‌లో ఒక పెద్ద బిల్డింగ్‌ను కట్టించాడు. దాని గృహ ప్రవేశానికి ఎన్‌.టి.రామారావు హాజరయ్యారు.  బిల్డింగ్‌ కిందే షాపులు కూడా ఉండేవి. అందులోని ఒక షాప్‌లో ఇద్దరు సోదరులు హార్డ్‌వేర్‌ బిజినెస్‌ చేసేవారు. వారికి ఆ షాప్‌ బాగా కలిసొచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల షాప్‌ ఖాళీ చెయ్యాల్సిందిగా వారిని కోరాడు సలీమ్‌. వాళ్ళు ఒప్పుకోలేదు. కోర్టుకు వెళ్లి నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. దీంతో తన మనుషులతో వారిపై దాడి చేయించాడు. ఆ దాడిలో ఇద్దరు సోదరుల్లో ఒకరు చనిపోయారు. ఈ కేసులో సలీమ్‌తోపాటు పది మందిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. సలీమ్‌కి జైలు శిక్ష పడిరది. సినిమా ఇండస్ట్రీకి కొత్త డాన్స్‌మాస్టర్స్‌ రావడం అప్పుడే మొదలైంది. దీంతో సలీమ్‌కి అవకాశాలు తగ్గాయి. ఆ సమయంలో అతను మర్డర్‌ కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచి తిరిగి వచ్చేసరికి అతని కుటుంబం చెల్లా చెదురైపోయింది. ఉన్న ఆస్తిని అమ్మేసి అతని భార్య.. పిల్లలతో సహా కేరళ వెళ్లిపోయింది. ఏం చెయ్యాలో తోచక సినిమాల్లో అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగాడు. ఆ సమయంలోనే తాగుడికి బానిస అయ్యాడు. పరిశ్రమ హైదరాబాద్‌ వచ్చేసింది కాబట్టి ఇక్కడే ప్రయత్నాలు చెయ్యాలని హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయ్యాడు. కృష్ణానగర్‌లో ఒక చిన్న గది అద్దెకు తీసుకొని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కానీ, లాభం లేకపోయింది. మరో ప్రయత్నంగా ‘సినిమా డాన్సులు నేర్పబడును’ అని బోర్డు పెట్టుకొని స్టూడెంట్స్‌ కోసం ఎదురుచూశాడు. అతని పరిస్థితి చూసిన కొందరు హీరోలు అప్పుడప్పుడు ఆర్థిక సాయం చేసేవారు. ఆ డబ్బు కొన్నిరోజుల్లో ఖర్చయిపోయేది. మళ్ళీ పరిస్థితి మామూలే. డాన్స్‌ స్కూల్‌ కోసం తీసుకున్న రూమ్‌కి కూడా అద్దె కట్టలేకపోవడంతో దాన్ని కూడా మూసేశాడు. 

ఆ తర్వాత పొట్ట కూటి కోసం ఒక అపార్ట్‌మెంట్‌లో చాలా కాలం వాచ్‌మెన్‌గా ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో కూడా ఉండలేక తిరిగి చెన్నయ్‌ వెళ్లిపోయాడు. అక్కడ ఒక స్లమ్‌ ఏరియాలో రేకులతో కట్టిన చిన్న రూమ్‌లో బతుకు వెళ్లదీశాడు. ఆ స్థితిలో ఉన్న సలీమ్‌ని గుర్తుపట్టిన ఒక సినిమా రిపోర్టర్‌ అతన్ని చేరదీసి కడుపునిండా భోజనం పెట్టించాడు. అంతేకాదు, అతనికి ఏదైనా సాయం చెయ్యాలని తనకు చేతనైనంత వరకు చేశాడు. సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా ఓ వెలుగు వెలిగిన సలీమ్‌ చివరికి అత్యంత దీనావస్థకు చేరి 2011లో కన్నుమూశారు.