Read more!

English | Telugu

షూటింగ్‌కు వెళ్ల‌డానికి ముందే డైలాగ్స్ అన్నీ త‌న స్టైల్లో చెప్పిన ఎన్టీఆర్‌!

 

ఒక గ్రీన్ క‌ల‌ర్ మోరిస్ మైన‌ర్ కారు కోడంబాకం హైరోడ్డులోని ఒక ఇంటి గుమ్మానికి కొంచెం దూరంగా ఆగింది. డ్రైవ‌ర్ సీట్లోంచి ఒక అంద‌మైన యువ‌కుడు దిగాడు. తెలుగుత‌నం ఉట్టిప‌డేలా పంచెకట్టు, లాల్చీ, చేతిలో ఓ ఫైలు ప‌ట్టుకొని, కారు డోర్ తాళంవేసి, ముందుకు న‌డిచి, ఆ ఇంటి గేటువేపు క‌దిలాడు. ఆ ఇంటి ముందు ఎడ‌మ ప‌క్క‌నున్న ఓ ప‌ర్ణ‌శాల‌లోకి అడుగుపెట్టాడు.
"ప‌ప్పాజీ ఉన్నారా?" అన‌డిగాడు.
"ఉన్నారు. కూర్చోండి." అని ఆయ‌న‌ను కూర్చోబెట్టి, లోనికి వెళ్లాడు అక్క‌డి ఆఫీస్ ఇన్‌చార్జ్‌.
కొంచెం సేప‌య్యాక 'ప‌ప్పాజీ' వ‌చ్చారు. ఆయ‌న‌తో పాటు 'స్వామీజీ' కూడా వ‌చ్చారు. ప‌ప్పాజీ అంటే తెలుగుసినిమా పితామ‌హుడు హెచ్‌.ఎం. రెడ్డి. స్వామీజీ అంటే ఆయ‌న అభిమాన పుత్రుడు వై.ఆర్‌. స్వామి, 'వ‌ద్దంటే' డ‌బ్బు చిత్ర ద‌ర్శ‌కుడు.

ఆ వ‌చ్చిన అంద‌గాడు నంద‌మూరి తార‌క‌రామారావు. విజ‌యా ప్రొడ‌క్ష‌న్స్ వారి సినిమాల్లో మాత్ర‌మే న‌టించాల‌న్న అగ్రిమెంట్ పూర్త‌యిన త‌ర్వాత‌, ఇత‌ర నిర్మాత‌ల చిత్రాల్లో న‌టించ‌డానికి ఆయ‌న ఒప్పుకున్న చిత్రాల్లో ఒక‌టి.. 'వ‌ద్దంటే డ‌బ్బు'. ఆ సినిమాకు సంబంధించిన పూర్తి డైలాగ్స్ ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఫైలులో ఉన్నాయి. ఆ డైలాగ్స్ రాసింది స‌దాశివ బ్ర‌హ్మం.

అక్క‌డున్న ఆఫీసు సిబ్బందిని అంద‌రినీ పేరుపేరునా అడిగి ప‌రిచ‌యం చేసుకున్నారు ఎన్టీఆర్‌. కొంచెంసేపు పిచ్చాపాటీ అయిన త‌ర్వాత‌, ప‌ప్పాజీ! మీరు పంపిన స్క్రిప్టు పూర్తిగా, క్షుణ్ణంగా చ‌దివాను. కాసేపు మీరు ఉంటానంటే నా సంభాష‌ణ‌లు అన్నీ నా ఫ‌క్కీలో మీకు వినిపిస్తాను, ఆ త‌ర్వాత మీ ఇష్ట‌ప్ర‌కారం మార్పులు చేసుకోవ‌చ్చు అన్నారు ఎన్టీఆర్‌. ఆయ‌న డైలాగ్స్‌ను పూర్తిగా న‌టిస్తూ వినిపించారు.

సాయంత్రం 6 గంట‌ల నుంచి మొద‌లుకొని రాత్రి 2 గంట‌ల దాకా ఆ సినిమా షూటింగ్‌ 30 రోజులు జ‌రిగింది. ఔట్‌డోర్ సీన్లు మాత్ర‌మే ప‌గ‌టి పూట చిత్రీక‌రించారు. షూటింగ్‌కు ముందు ఎన్టీఆర్ ఇలా సినిమాలోని త‌న డైలాగ్స్ అన్నింటినీ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు వినిపించార‌ని చెబితే ఇప్ప‌టి యాక్ట‌ర్లు కానీ, డైరెక్ట‌ర్లు కానీ న‌మ్మ‌రు. కానీ అది నిజం!