Read more!

English | Telugu

సుమ‌న్ గురించి మీకు తెలీని చిన్న‌ప్ప‌టి నిజాలు!

 

సుమ‌న్ వాళ్ల‌మ్మ వృత్తిరీత్యా కాలేజీ లెక్చ‌ర‌ర్‌. చిన్న‌త‌నంలో సుమ‌న్‌ను ఆవిడ చాలా క‌ట్టుదిట్టంగా పెంచారు. ఆయ‌న‌ను ఒంట‌రిగా ఎక్క‌డ‌కూ పంపించేవారు కాదు. ఆమె అంటే సుమ‌న్ కూడా బాగా భ‌య‌ప‌డేవారు. బ‌య‌ట పిల్ల‌ల‌తో క‌లిసి ఆడుకోవాల‌న్న స‌ర‌దా ఆయ‌న‌లో ఉన్న‌ప్ప‌టికీ అమ్మ ఎక్క‌డ కొడుతుందోన‌నే భ‌యంతో ఆయ‌న కూడా బ‌య‌ట‌కు వెళ్లేవాడు కాదు. సుమ‌న్ మ‌ద్రాసులోనే చ‌దువుకున్నారు. మొద‌ట అక్క‌డి చ‌ర్చ్‌పాక్ కాన్వెంట్‌లో చేరారు. ఫ‌స్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ దాకా అక్క‌డే చ‌దువుకున్నారు. ఈయ‌న ఆ కాన్వెంట్‌లో చేరిన‌ప్పుడు త‌ర్వాత కాలంలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసి, త‌లైవిగా ఖ్యాతిపొందిన జ‌య‌ల‌లిత టెన్త్ క్లాస్ చ‌దువుతున్నారు.  సుమ‌న్‌ను డాక్ట‌ర్‌ను చెయ్యాల‌ని వాళ్ల‌మ్మ క‌ల‌. సుమ‌న్‌కేమో పైల‌ట్ అవ్వాల‌ని ఉండేది. అయితే ఆ ఇద్ద‌రి ఊహ‌లూ తారుమారై ఆయ‌న న‌టుడ‌య్యారు.

చిన్న‌ప్ప‌ట్నుంచీ సుమ‌న్‌కు పెయింటింగ్ మీద విప‌రీత‌మైన ఆస‌క్తి ఉండేది. అది గ‌మ‌నించి వాళ్ల‌మ్మ ఆయ‌న‌ను సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ దాకా మ‌ద్రాస్‌లోని బీసెంట్ థియోసాఫిక‌ల్ హైస్కూల్ (క‌ళాక్షేత్ర‌)లో చ‌దివించారు. అక్క‌డ సుమ‌న్ పెయింటింగ్‌లో శిక్ష‌ణ పొంద‌డ‌మే కాకుండా, వ‌రుస‌గా నాలుగేళ్ల‌పాటు ప్ర‌తి సంవ‌త్స‌రం క‌ళాక్షేత్ర వాళ్లు నిర్వ‌హించే వైల్డ్ లైఫ్ పెయింటింగ్ కాంపిటిష‌న్‌లో ఫ‌స్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఆ త‌ర్వాత అక్క‌డే వీణ‌, గిటార్ వాయిద్యాలు కూడా నేర్చుకున్నారు. 

క‌ళాక్షేత్ర‌లో తొమ్మిదో క్లాస్ పాస‌య్యాక, రామ‌కృష్ణా హైస్కూల్‌లో ఎస్ఎస్ఎల్‌సీ చ‌దివారు. ఆ త‌ర్వాత ప‌చ్చ‌య‌ప్ప కాలేజీలో పీయూసీ, బీఏ (లిట‌రేచ‌ర్‌) పూర్తి చేశారు. ప‌చ్చ‌య‌ప్ప కాలేజీ అంటే అప్ప‌ట్లో అల్ల‌రి స్టూడెంట్స్‌కు బాగా పేరుపొందిన కాలేజీ. ఆ కాలేజీలో అడుగుపెట్టిన‌ప్పుడు సీనియ‌ర్ స్టూడెంట్స్ కొంత‌మంది ఆయ‌న చుట్టూ మూగి, రాగింగ్ పేరుతో ష‌ర్ట్ తీసేసి, ప్యాంట్‌తో బొమ్మ‌లాగా నిల్చొని స‌లాం చెయ్య‌మ‌న్నారు. సుమ‌న్ బిక్క‌చ‌చ్చిపోయారు. కొంచెం కోపం కూడా వ‌చ్చింది. అయినా వాళ్లు చెప్పిన‌ట్లు చెయ్య‌క‌పోతే, ప్యాంట్ కూడా తీసేసి అండ‌ర్‌వేర్‌తో ఎక్క‌డ నడ‌వ‌మంటారోన‌ని భ‌య‌ప‌డి, ష‌ర్ట్ తీసేసి స‌లాం కొట్టారు. 

ఇది జ‌రిగిన ఐదు రోజుల‌కు సుమ‌న్ స్కూల్‌మేట్స్ న‌ల‌భై మంది అదే కాలేజీలో చేరారు. వాళ్లంతా బ‌లంగా ఉండేవారే. వాళ్ల‌తో సుమ‌న్ త‌న‌ను సీనియ‌ర్స్‌ ర్యాంగింగ్ చేసిన విష‌యం చెప్పారు. అప్ప‌డు అంద‌రూ క‌లిసి ఒక్క‌టై సుమ‌న్‌ను ర్యాగింగ్ చేసిన సీనియ‌ర్ స్టూడెంట్స్‌ను అల్ల‌రి చేశారు. దాంతో సీనియ‌ర్స్ కాళ్ల బేరానికి వ‌చ్చి సుమ‌న్ బ్యాచ్‌తో స్నేహం చేశారు!