Read more!

English | Telugu

సూర్య‌-జ్యోతిక ల‌వ్ స్టోరీ గురించి మీకెంత తెలుసు?

 

అత‌ను యువ‌త‌రం హృద‌య స్పంద‌న అయితే, ఆమె త‌న అందం, అభిన‌యంతో వెండితెర‌ను శాసించిన తార‌. అంద‌మైన ప్రేమ‌క‌థ‌కు అచ్చ‌మైన ఉదాహ‌ర‌ణ సూర్య‌, జ్యోతిక క‌థ‌. ఆనంద‌క‌ర‌మైన వైవాహిక జీవితానికి ప్రేమ ఒక్క‌టే చాలున‌ని వారు నిరూపించారు. పెళ్ల‌యి 15 సంవ‌త్స‌రాలు గ‌డిచినా, ఆ జంట త‌మ అనురాగంతో అభిమానుల‌ను అల‌రిస్తూనే ఉన్నారు.

సీనియ‌ర్ త‌మిళ న‌టుడు శివ‌కుమార్ కుమారుడైన సూర్య అస‌లు పేరు శ‌ర‌వ‌ణ‌న్‌. తెర‌పేరును సూర్య‌గా మార్చుకొని సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ క‌లిగిన స్టార్ల‌లో ఒక‌డిగా ఎదిగాడు. అంత‌ర్ముఖుడిగా, అత్యంత విన‌య‌శీలిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నాడు. 22 సంవ‌త్స‌రాల వ‌య‌సులో 'నెర్రుక్కు నేర్' సినిమాతో ప‌రిచ‌య‌మ‌య్యాడు. మొద‌ట్లో అత‌నికి స‌రైన విజ‌యాలు ద‌క్క‌లేదు.

1999లో 'పూవెల్ల‌మ్ కెట్టుప్పార్' సినిమాలో న‌టించేప్పుడు సూర్య, జ్యోతికి తొలిసారి ఒక‌రికొక‌రు ప‌రిచ‌య‌మ‌య్యారు. అప్ప‌టికి ఇద్ద‌రిలో ఎవ‌రూ పెద్ద పేరున్న‌వాళ్లు కాదు. జ్యోతిక ముంబై నుంచి వ‌చ్చింది. త‌మిళం ఒక్క ముక్క రాక‌పోవ‌డంతో ఆ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌న ముద్ర‌వేయ‌డానికి ఆమె చాలా క‌ష్ట‌ప‌డింది. వ‌ర్క్ విష‌యంలో ఆమె డెడికేష‌న్‌, ఆమె డైలాగ్ డెలివ‌రీ సూర్య‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ప‌ని విష‌యంలో ఆమె సిన్సియారిటీ, స‌హ న‌టుల‌తో ఆమె ప్ర‌వ‌ర్తించే తీరు ఆక‌ర్షించాయి.

2001లో ఒక సినిమా షూటింగ్‌లో ఉన్న జ్యోతిక‌, అటువైపు వెళ్తున్న సూర్య‌ను చూసి, అత‌డిని పిల‌వ‌మంటూ త‌న అసిస్టెంట్‌కు పుర‌మాయించింది. అలా వాళ్లిద్ద‌రూ రెండోసారి క‌లుసుకున్నారు. క్ర‌మంగా ఇద్ద‌రూ స్నేహితుల‌య్యారు. ఆ త‌ర్వాత త‌ను వెళ్లే పార్టీల‌కు జ్యోతిక‌ను కూడా పిలుస్తూ వ‌చ్చాడు సూర్య‌. త‌న క్లోజ్ ఫ్రెండ్స్‌కు ఆమెను ప‌రిచ‌యం చేశాడు.

2001లో సూర్య టైటిల్ రోల్ చేసిన 'నందా' ఫిల్మ్ ప్రీమియ‌ర్‌కు అటెండ్ అయిన జ్యోతిక‌కు, అత‌ని ప‌ర్ఫార్మెన్స్ బాగా న‌చ్చింది. 'కాక్క కాక్క' (2003) మూవీలో హీరోయిన్‌గా డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ త‌న‌ను ఎంపిక చేసినప్పుడు, హీరో క్యారెక్ట‌ర్‌కు సూర్య బాగుంటాడ‌ని రిక‌మెండ్ చేసింది జ్యోతిక‌. ఆ సినిమాలో చేసే టైమ్‌లోనే త‌మ మ‌ధ్య ప్రేమ‌బంధం పెన‌వేసుకుంటోంద‌నే విష‌యం ఇద్ద‌రూ గ్ర‌హించారు. ఆ ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్న విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది. 

అయితే ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని సూర్య‌ ఇంట్లో చెప్పిన‌ప్పుడు తండ్రి శివ‌కుమార్ వెంట‌నే అంగీక‌రించ‌లేదు. ఆయ‌న క‌న్విన్స్ అవ‌డానికి కొంత టైమ్ ప‌ట్టింది. చివ‌ర‌కు త‌ల్లితండ్రులు స‌రేన‌న‌డంతో సింపుల్‌గా వారి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. 2006 సెప్టెంబ‌ర్ 11న సూర్య‌, జ్యోతిక జీవిత భాగ‌స్వాములుగా మారారు. ఆ వివాహ వేడుక‌కు త‌మిళ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని పేరుపొందిన తార‌లంతా హాజ‌ర‌య్యారు. 

పెళ్లి త‌ర్వాత ముంబై నుంచి చెన్నైకు వ‌చ్చేసిన జ్యోతిక న‌ట‌న‌ను విడిచిపెట్టింది. ఫ్యామిలీకే స‌మ‌యాన్నంతా వెచ్చించింది. 2007లో వారి జీవితాల్లోకి లిటిల్ ఏంజెల్ దియా వ‌చ్చింది. 2010లో కొడుకు దేవ్ పుట్టాడు. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా, భార్యాపిల్ల‌ల కోసం త‌న డేట్స్‌ను అడ్జ‌స్ట్ చేసుకుంటూ, వారితో క్వాలిటీ టైమ్ గ‌డుపుతూ వ‌స్తున్నాడు సూర్య‌.

పిల్ల‌లు కాస్త ఎదిగిన త‌ర్వాత తిరిగి కెమెరా ముందుకు వ‌చ్చింది జ్యోతిక‌. 2015లో '36 వ‌య‌దినిలే' సినిమాతో న‌టిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ సినిమాని సూర్య స్వ‌యంగా నిర్మించాడు. పర‌స్ప‌ర ప్రేమ‌, అనురాగం, గౌర‌వంతో నిజ‌మైన ప్రేమ ఎన్న‌టికీ నిలిచి వుంటుంద‌ని సూర్య‌-జ్యోతిక నిరూపిస్తున్నారు.