Read more!

English | Telugu

ఇప్పటికీ.. ఎప్పటికీ ఆ సినిమా రికార్డును క్రాస్‌ చెయ్యడం ప్రపంచంలోని ఏ హీరో వల్లా కాదు!

ప్రస్తుతం వస్తున్న స్టార్‌ హీరోల సినిమాలు, పాత రోజుల్లో విడుదలైన స్టార్‌ హీరోల సినిమాలను కంపేర్‌ చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటి సినిమాల విషయాన్నే తీసుకుంటే ఒక స్టార్‌ హీరో చేసిన సినిమా రిలీజ్‌ అయిన మొదటి షో నుంచే హడావిడి మొదలవుతుంది. ఫస్ట్‌ రివ్యూ అంటూ, పబ్లిక్‌ టాక్‌ అంటూ జనాన్ని ఊదరగొట్టేస్తుంటారు. ఇక రెండో రోజు పబ్లిసిటీలో మొదటి రోజు ఆ సినిమా ఎంత కలెక్ట్‌ చేసింది అనేది యాడ్స్‌ ద్వారా మీడియా అంతా స్ప్రెడ్‌ చేసేస్తారు. ఫస్ట్‌ డే కలెక్షన్‌లో కొత్త రికార్డు అంటారు, లేదా తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది అంటారు. అలా రెండోరోజు, మూడో రోజు కలెక్షన్స్‌.. ఇలా ప్రతిరోజూ కలెక్షన్స్‌ వివరాలను ప్రేక్షకులకు తెలియజేస్తుంటారు. ఇక మొదటి వారం పూర్తి కాగానే ఫస్ట్‌ వీక్‌ కలెక్షన్స్‌లో రికార్డు క్రియేట్‌ చేసిందంటూ మళ్లీ మొదలు పెడతారు. ఇలా ఒక సినిమా కాదు, స్టార్‌ హీరోల సినిమాలన్నీ దాదాపు ఇదే పద్దతిలో పబ్లిసిటీ చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఒక సినిమాని మించి మరో సినిమా రికార్డులు సాధించిందంటూ ప్రచారం చేస్తారు. ఒక సినిమా టోటల్‌గా 600 కోట్లు కలెక్ట్‌ చేస్తే.. మరో సినిమా 1000 కోట్లు కలెక్ట్‌ చేసి కొత్త రికార్డు క్రియేట్‌ చేసింది అంటారు.. 

తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా సాధించిన రికార్డును గతంలో ఎవరూ బ్రేక్‌ చేయలేకపోయారు. ఇక భవిష్యత్తులో దాన్ని బ్రేక్‌ చేసే అవకాశం ఎలాంటి సినిమాకైనా లేదు అనే విషయం మీకు తెలుసా? ఎన్ని వందల కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమా అయినా, ప్రపంచంలోని ఎన్ని దేశాల్లో రిలీజ్‌ చేసినా ఆ రికార్డును క్రాస్‌ చెయ్యడం ఎవ్వరి వల్లా కాదు. అదేమిటో చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి జంటగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన ‘ప్రేమాభిషేకం’ చిత్రం అది. ఫిబ్రవరి 16, 1981లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆ సినిమాలోని కొత్తదనం, అద్భుతమైన పాటలు, నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌, దాసరి నారాయణరావు రాసిన మాటలు, టేకింగ్‌.. ఇవన్నీ అప్పటి ప్రేక్షకులు నావెల్టీగా ఫీల్‌ అయ్యారు. అందుకే సినిమాకి బ్రహ్మరథం పట్టారు. 

‘ప్రేమాభిషేకం’ చిత్రం రిలీజ్‌ అయిన అన్ని సెంటర్లలో 100 రోజులు రన్‌ అయింది. అన్ని సెంటర్లలో సిల్వర్‌ జూబ్లీకి కూడా వెళ్లింది. దాదాపు 20 సెంటర్లలో సంవత్సరంపాటు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇలాంటి ఘనత సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. ఒకప్పుడు వినోదం అనేది సినిమా ద్వారానే ప్రేక్షకులకు అందేది. వినోదం కావాలంటే థియేటర్‌కే వెళ్ళాలి. అందుకే కొన్ని సినిమాలు సంవత్సరాలపాటు రన్‌ అయ్యేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎంత పెద్ద హిట్‌ సినిమా అయినా 50 రోజులు రన్‌ చెయ్యాలంటే సాధ్యమయ్యే విషయం కాదు. రెండు, మూడు వారాలకే థియేటర్ల నుంచి తీసేస్తున్నారు. నెలరోజుల్లో ఓటీటీలో ఎంత పెద్ద సినిమా అయినా ప్రత్యక్షమవుతోంది. అలాంటప్పుడు 100 రోజులు, సిల్వర్‌ జూబ్లీ వరకు ఒక సినిమా వెళ్లడం అనేది ఎప్పటికీ సాధ్యపడే విషయం కాదు.