Read more!

English | Telugu

గుణశేఖర్‌ తిట్టడంతో సినిమా చేయనని మొండికేసిన ఎన్టీఆర్‌!

బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్‌ ‘రామాయణం’ చిత్రంలోని తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. గుణశేఖర్‌ దర్శకత్వంలో ఎం.ఎస్‌.రెడ్డి నిర్మించిన ఈ సినిమా పిల్లలకి మంచి వినోదాన్ని అందించింది. ఈ చిత్రాన్ని గుణశేఖర్‌ ఎంతో వైవిధ్యంగా తీర్చిదిద్దారు. దాంతో ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డుకు ‘రామాయణం’ చిత్రాన్ని ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. 

తన కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌లాంటి ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయడానికి గుణశేఖర్‌ ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఎందుకంటే కేవలం పిల్లలు మాత్రమే నటించిన సినిమా ఇది. సాధారణంగా ఒక సినిమాలో ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే వారిని కంట్రోల్‌ చేయడం కష్టం. అలాంటిది కేవలం పిల్లలతోనే సినిమా చెయ్యాలంటే ఆ దర్శకుడు ఎంత టెన్షన్‌ పడాల్సి వస్తుందో గుణశేఖర్‌ని చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులూ పిల్లల్ని కంట్రోల్‌ చేయడం చిత్ర యూనిట్‌కి పెద్ద సమస్యగా మారింది. ఒక్కరు కూడా కుదురుగా ఉండేవారు కాదట. ముఖ్యంగా రాముడి పాత్రధారి ఎన్టీఆర్‌ విపరీతమైన అల్లరి చేసేవాడట. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వానరసైన్యంపై సన్నివేశాలు చిత్రీకరిస్తుంటే.. ఆ గెటప్‌లో ఉన్న పిల్లల తోకలు లాగడం, మూతులు పీకడం చేసేవారట తారక్‌. అరణ్యవాసం సన్నివేశాలు తీయడానికి యూనిట్‌ మొత్తం చేలకుడి వెళ్లింది. ఆ సమయంలో అడవిలో విపరీతమైన చలి. పైగా పిల్లలు చొక్కాలు లేకుండా నటించడానికి వణికిపోతుంటే తారక్‌ వాళ్లని బాణాలతో పొడుస్తూ తెగ ఏడిపించేవాడట. 

శివ ధనుర్భంగం సన్నివేశం కోసం ప్రత్యేకంగా కనిపించాలని ఓ విల్లును టేకుతో తయారు చేయించారట. దాంతోపాటు మరో డూప్లికేట్‌ విల్లును కూడా తయారు చేయించారు. ఈ సన్నివేశం కోసం యూనిట్‌ సిద్ధమవుతున్న సమయంలో పిల్లలతో కలిసి ఆడుకుంటున్న ఎన్టీఆర్‌ డూప్లికేట్‌ విల్లును పైకి లేపడంతో అది సులభంగా పైకి లేచింది. ఆ తర్వాత టేకుతో చేసిన విల్లును ఎత్తడానికి అందరూ ప్రయత్నించారు. కానీ, ఎవరి వల్లా కాలేదు. చివరికి ఎన్టీఆర్‌ దాన్ని ఎత్తే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాలెన్స్‌ చెయ్యలేక కింద పడేశాడు. అది విరిగిపోయింది. ఆ హఠాత్‌ పరిణామానికి ఎన్టీఆర్‌పై గుణశేఖర్‌కు విపరీతమైన కోపం వచ్చి తిట్టారట. దాంతో ‘ఇక నేను సినిమా చేయను.. వెళ్లిపోతాను’.. అంటూ ఒకటే మారాం చేశాడట. ఆ తర్వాత యూనిట్‌ సభ్యులందరూ అతన్ని సముదాయించి షూటింగ్‌కి సిద్ధం చేశారట.