Read more!

English | Telugu

ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా హరికృష్ణ చేసిన సీన్.. షాక్‌ అయిన చౌదరి!

ఇది ఓ సినిమాలోని డైలాగ్‌, ఈ డైలాగ్‌ వెనుక ఓ కథ ఉంది. నందమూరి హరికృష్ణ తొలినాళ్ళలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ తండ్రి ఎన్‌.టి.రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత నటనకు స్వస్తి పలికి ఎన్టీఆర్‌ వాహనానికి సారథిగా మారారు. ఆయన జీవించి ఉన్నన్ని సంవత్సరాలు ఆయనతోనే ఉన్నారు. పాతికేళ్ళపాటు సినిమా రంగానికి దూరంగా ఉన్న హరికృష్ణ ‘శ్రీరాములయ్య’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. అందులో సత్యం పాత్రలో కనిపిస్తారు హరికృష్ణ. అది నక్సలైట్‌ క్యారెక్టర్‌ కావడంతో ఇండస్ట్రీలోని చాలామంది ఆ పాత్ర చేసేందుకు భయపడ్డారు. కానీ, హరికృష్ణ మాత్రం ధైర్యంగా ముందుకొచ్చారు. ఆ క్యారెక్టర్‌ని అత్యద్భుతంగా పోషించి అందర్నీ మెప్సించారు. ఆ తర్వాత సీతారామరాజు, సీతయ్య, శివరామరాజు, టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌, స్వామి వంటి సినిమాల్లో ఎంతో విలక్షణమైన పాత్రలు పోషించి తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నారు. ఈ క్రమంలోనే వై.వి.యస్‌.చౌదరి దర్శకత్వంలో రూపొందిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు హరికృష్ణ. ఎన్నో సంవత్సరాలపాటు ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. అయినప్పటికీ ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో హరికృష్ణ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నటించడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. తన ప్రత్యర్థి జయప్రకాష్‌రెడ్డి ఎదురుగా కారులో వస్తుండగా, ఆగమని హరికృష్ణ లైట్లు వేసినా ఆగకుండా వచ్చేస్తాడు. దీంతో కార్లు రెండూ రైల్వే ట్రాక్‌పైకి వచ్చి సరిగ్గా మధ్యలో ఆగిపోతాయి. కొద్దిసేపటి వరకూ ఎవరూ వెనక్కి తగ్గరు. అదే సమయంలో రైలు వేగంగా వస్తుండటంతో భయపడిన జయప్రకాష్‌రెడ్డి తన కారును వెనక్కి పోనీయమని చెబుతాడు. అప్పుడు వెంటనే హరికృష్ణ కారు ముందుకు వెళ్లాలి. కానీ, కారు సడన్‌గా ఆగిపోయింది. స్టార్ట్‌ చేసినా అవ్వలేదు. ఓ పక్క ట్రైన్‌ వచ్చేస్తోంది. కానీ, హరికృష్ణ ఏమాత్రం భయపడకుండా మరో రెండుసార్లు స్టార్ట్‌ చెయ్యడానికి ట్రై చేశారు. మూడోసారి కారు స్టార్ట్‌ అయింది. వెంటనే ముందుకు దూకించారు హరికృష్ణ. అలాంటి టైమ్‌లో హరికృష్ణ భయపడి ఏమీ చెయ్యకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అప్పటివరకు టెన్షన్‌తో ఉన్న అక్కడి వాతావరణం.. ఒక్కసారిగా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. హరికృష్ణ ధైర్యాన్ని చూసి దర్శకుడు వై.వి.యస్‌.చౌదరి షాక్‌లో ఉండిపోయారట. అలా కారును ముందుకు దూకించిన తర్వాత హరికృష్ణ చెప్పే డైలాగ్‌.. ‘మగాడు అన్నాక తెగింపు ఉండాలిరా.. చావుకి మనం భయపడకూడదు. చావే మనల్ని చూసి భయపడాలి’ ఈ డైలాగ్‌ చెప్పిన తర్వాత అది సినిమా కోసం చెప్పినట్టు కాకుండా అక్కడి సిట్యుయేషన్‌కి అద్దం పట్టినట్టు ఉందని హరికృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు యూనిట్‌ సభ్యులు.