Read more!

English | Telugu

హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి.. టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చరిత్ర సృష్టించారు!

సినిమా ఇండస్ట్రీలో అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. కొందరు హీరోగా రాణించాలని వస్తారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా అతను డైరెక్టర్‌ అయిపోతాడు. మరికొందరు డైరెక్టర్‌ అవ్వాలని వస్తే... అతను హీరోగా సెటిల్‌ అయిపోతాడు. సినిమా రంగానికి చెందిన చాలా మంది విషయంలో ఇలాంటి విచిత్రాలు జరిగాయి. ప్రముఖ సంగీత దర్శకుడు దివంగత కె.వి.మహదేవన్‌ విషయంలో ఇది మరీ విచిత్రంగా ఉంటుంది. అతని తండ్రి గోటు వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించారు. ఇక తాత ఒక దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుడుగా ఉండేవారు. అలాంటి సంగీత కుటుంబంలో పుట్టిన మహదేవన్‌ చిన్నతనం నుంచి సంగీతం నేర్చుకున్నప్పటికీ అందులో ప్రావీణ్యం సంపాదించాలన్న ఆలోచన ఉండేది కాదు. ఇక చదువు మీద కూడా శ్రద్ధ లేదు. ఎంతసేపూ నాటకాల వైపే ఆయన మొగ్గు చూపించేవారు. ఏడవ తరగతితోనే చదువుకి స్వస్తి పలికారు. నాటకాలు వేస్తూ అందులోనే తన ఆనందాన్ని వెతుక్కునేవారు. సినిమాల్లో నటించి మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలన్న కోరికతో మద్రాస్‌ రైలెక్కేశారు. అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అక్కడ ఏర్పడిన పరిచయాలతో ‘మాతృభూమి’ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మళ్ళీ ఊరికి వెళ్లే ఉద్దేశంలేని మహదేవన్‌ నాటకాల్లో వివిధ పాత్రలు పోషించేవారు. ఆడవేషంలో కూడా అందర్నీ మెప్పించేవారు. కొన్ని సినిమాలకు జూనియర్‌ ఆర్టిస్టుగా కూడా వెళ్లేవారు. అవకాశాలు ఏవీ లేనపుడు హోటల్‌లో సర్వర్‌గా కూడా పనిచేశారు మహదేవన్‌. 

అలా ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన బాధ చూసి ఒక తమిళ హాస్యనటుడు ఎస్‌.వి.వెంకట్రామన్‌ అనే సంగీత దర్శకుడికి తీసుకెళ్ళి ‘ఈ అబ్బాయికి సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉంది. కానీ, సినిమాల్లో నటిస్తానంటూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. మీ దగ్గర ఉంటే బాగుపడతాడని తీసుకొచ్చాను’ అని చెప్పాడు. అప్పుడు మహదేవన్‌ను తన అసిస్టెంట్‌గా తీసుకున్నారు వెంకట్రామన్‌. ఇక అక్కడి నుంచి ఆయన జీవితం కొత్త మలుపు తిరిగింది. సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన మహదేవన్‌కి అక్కడి వాతావరణం బాగా నచ్చింది. ఇక నటన జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. సంగీతంలోనే పేరు తెచ్చుకోవాలనే కృతనిశ్చయానికి వచ్చారు. పాటను ఎలా ట్యూన్‌ చేయాలి, ఆర్కెస్ట్రాను ఎలా కండక్ట్‌ చేయాలి, రికార్డింగ్‌ ఎలా చేయాలి వంటి విషయాలపై అవగాహన పెంచుకున్నారు. అతనిలో ఉన్న సంగీత జ్ఞానాన్ని చూసి కొన్ని పాటలు ట్యూన్‌ చేయించుకున్నారు. కానీ, అవి అంతగా సెట్‌ అవ్వలేదు. 1957 వరకు అలా అసిస్టెంట్‌గానే పనిచేస్తూ అన్నీ నేర్చుకున్నారు. ఆ తర్వాత ఎం.జి.రామచంద్రన్‌, శివాజీ హీరోలుగా నటించిన సినిమాకి సంగీతం చేసే అవకాశం వచ్చింది. అప్పుడు అందరి దృష్టీ మహదేవన్‌పై పడిరది. ఆ తర్వాత ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే ఓ చిన్న బడ్జెట్‌ సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో మహదేవన్‌కి కూడా పేరు రాలేదు. 

ఆ తర్వాత జగ్గయ్య, షావుకారు జానకి జంటగా నటించిన ‘ముందడుగు’ చిత్రానికి సంగీతం చేసే అవకాశం వచ్చింది. అందులో ఆయన ట్యూన్‌ చేసిన ‘కోడెకారు చిన్నవాడా’ అనే పాట చాలా పెద్ద హిట్‌ అయింది. ఇక అక్కడి నుంచి మహదేవన్‌కు అవకాశాలు రావడం మొదలైంది. ఆ సమయంలోనే 1962లో ‘మంచి మనసులు’ సినిమా వచ్చింది. ఈ సినిమా తమిళ్‌ సినిమాకి రీమేక్‌. తమిళ్‌లో మహదేవన్‌ సంగీతం అందించారు. కాబట్టి తెలుగుకి కూడా ఆయన్నే తీసుకున్నారు. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ సినిమా తర్వాత ఆయనకి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంతో బిజీ అయిపోయారు. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ భాషల్లో 680కి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఆయన కెరీర్‌లో అవార్డులకు కొదవలేదు. బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎన్నోసార్లు అవార్డు అందుకున్నారు. ‘శంకరాభరణం’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్‌ అవార్డు అందుకోవడం తను ఎప్పటికీ మరచిపోలేనని చెబుతుండేవారు మహదేవన్‌. సంగీత దర్శకుడిగా ఆయన చివరి సినిమా బాపు దర్శకత్వంలో 1991లో వచ్చిన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’. ఈ సినిమా సమయంలోనే ఆయనకు పక్షవాతం రావడం, ఎవరినీ గుర్తుపట్టే స్థితిలో లేకపోవడంతో ఆయన శిష్యుడు పుహళేంది ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. అలా పది సంవత్సరాలపాటు మంచం మీదే వున్న మహదేవన్‌ 2001లో తుదిశ్వాస విడిచారు.