Read more!

English | Telugu

13 ఏళ్ళ వయసులో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడా కమెడియన్‌ 200 కోట్లకు అధిపతి 

జానీ లివర్‌.. ఈ పేరు ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు పూయిస్తుంది. హిందీ కమెడియన్స్‌ అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు మెహమూద్‌, అస్రాని, జానీ వాకర్‌, జగదీప్‌, కెష్టో ముఖర్జీ. వీరంతా బాలీవుడ్‌లో టాప్‌ కమెడియన్స్‌గా కొనసాగుతున్న రోజుల్లో ఎంట్రీ ఇచ్చిన జానీ లివర్‌.. తనదైన శైలితో అందర్నీ ఆకట్టుకున్నాడు. దాదాపు 350కిపైగా సినిమాల్లో తన కామెడీతో అలరించాడు. తెలుగువాడైన జానీ లివర్‌ తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. తినడానికి తిండి కూడా లేని స్థితి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు రూ.200 కోట్లకు అధిపతి అయ్యాడు. అతను ఈ స్థితికి రావడానికి పడిన కష్టం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. 

జానీ లివర్‌ అసలు పేరు జనుమల జాన్‌ ప్రకాశరావు. 14 ఆగస్టు 1957, ఆంధ్రప్రదేశ్‌లోని కనిగిరిలో జన్మించాడు. తండ్రి హిందుస్థాన్‌ యునీలివర్‌లో ఉద్యోగం చేసేవాడు. అందుకే వారు ముంబాయిలోని ధారావిలో నివసించేవారు. అయితే తాగుడికి బానిస అయిన తండ్రి.. పిల్లలను, వారి భవిష్యత్తు పట్టించుకోకపోవడంతో కుటుంబంలో దరిద్రం తాండవించేది. దీంతో 13 ఏళ్ళ వయసులో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని రైల్వే ట్రాక్‌పై నిలబడ్డాడు జాని. రైలు సమీపిస్తున్నప్పుడు కళ్లు మూసుకున్న జానీకి అతని ముగ్గురు చెల్లెళ్ళు మనసులో మెదిలారు. వారి భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనతో వెంటనే ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తన కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని, ముగ్గురు చెల్లెళ్ళకు బంగారు భవిష్యత్తునివ్వాలని  నిర్ణయించుకున్నాడు. అయినా అప్పుడప్పుడు కలిగే మానసిక ఆందోళన వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వస్తూ వుండేదట. ఆ ఆలోచనల నుంచి తనని సంగీతం కాపాడిరదని చెబుతాడు జానీ. 

ఒకరోజు ఉదయం 7 గంటలకు నిద్ర లేవగానే దగ్గరలో ఉన్న బార్బర్‌ షాప్‌కి వెళ్ళాడు. అక్కడ ఒక పాట వినిపిస్తోంది. ఆ షాప్‌ వెనుకే ఉన్న బెంచ్‌పై కూర్చొని ఆ పాట విన్నాడు. 1962లో వచ్చిన ‘మన్‌ మౌజీ’ సినిమాలోని ‘మై తో తుమ్‌ సంగ్‌ నైనా మిలా కే హార్‌ గయీ సజ్నా’ పాట అది. ఆ పాటలో ఏముందోగానీ అలా వింటూ ఉండిపోయాడు. తన మనసులోని ఆందోళన అంతా ఒక్కసారి మాయమైందన్న విషయాన్ని గ్రహించాడు. అప్పటి నుంచి పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టాడు. సంగీతం ద్వారా ఎంతో హాయిని పొందానని, అదే తనకు జీవిత పాఠాలు నేర్పిందని చెబుతాడు జాని. 

కుటుంబ బాధ్యతను తీసుకున్న జానీ ఎన్నో రకాల పనులు చేశాడు. ముంబాయిలోని వీధుల్లో కొన్నాళ్ళు పెన్నులు, నోట్‌బుక్స్‌ అమ్మాడు. హైదరాబాద్‌లోని యాకత్‌పూరలోని తన బంధువుల ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడు. అక్కడ అతనికి చాలా మంది ఫ్రెండ్స్‌ అయ్యారు. ఆ సమయంలోనే మిమిక్రీ నేర్చుకున్నాడు. ముంబాయి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మిమిక్రీ షోలు చేసేవాడు. ఆ తర్వాత హిందుస్థాన్‌ లివర్‌లో 6 సంవత్సరాలపాటు చిన్న ఉద్యోగం చేశాడు. లంచ్‌ టైమ్‌లో అక్కడి వారికి కాలక్షేపం కోసం తన మిమిక్రీతో వారిని నవ్వించేవాడు. ఆ తర్వాత కంపెనీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో తన పై అధికారులను సైతం అనుకరించి అందరి చేత శభాష్‌ అనిపించుకున్నాడు. అప్పటినుంచి కంపెనీకి సంబంధించిన ఏ ఫంక్షన్‌లోనైనా జానీ షో తప్పనిసరిగా ఉండేది. క్రమంగా అతను మిమిక్రీ షోలతో బిజీ అయిపోయాడు. విదేశాల్లో కూడా పెర్‌ఫార్మ్‌ చేసేందుకు వెళ్లేవాడు. వివిధ షోల ద్వారా సంపాదన బాగానే ఉండడంతో హిందుస్థాన్‌ లివర్‌లో జాబ్‌ని వదిలేశాడు. అతనిలో ఉన్న టాలెంట్‌కి సినిమాల్లో అయితే బాగా రాణిస్తావని స్నేహితులు అనేవారు. అప్పుడే అతనికి సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. అలా 1981లో ‘యే రిష్తా న టూటే’ చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్‌ చేయడం ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు జానీ. ఆ సినిమా తర్వాత అడపా దడపా అవకాశాలు వచ్చేవి.

1987లో నసీరుద్దీన్‌ షా, అర్చనా పురాన్‌ సింగ్‌ జంటగా వచ్చిన ‘జల్వా’ చిత్రం అతని లైఫ్‌ని మార్చేసింది. ఆ సినిమాలో అతను చేసిన ముత్తు క్యారెక్టర్‌కి విపరీతమైన రెస్పాన్స్‌ రావడంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు జానీ. ఇక అక్కడి నుంచి ప్రతి సంవత్సరం 10 సినిమాలకు తగ్గకుండా చేస్తూ వచ్చాడు. ఒక్క సంవత్సరంలో 20 సినిమాలు చేసిన సందర్భాలు కూడా వున్నాయి. ఒక దశలో బాలీవుడ్‌లో తిరుగులేని కమెడియన్‌గా ఒక వెలుగు వెలిగాడు. జానీ తెలుగు సినిమాల్లో నటించకపోయినా తెలుగు సినిమాలను తరచూ చూస్తుంటాడు. అతనికి బ్రహ్మానందం అంటే ఎంతో అభిమానం. అతనెప్పుడు హైదరాబాద్‌ వచ్చినా బ్రహ్మానందంని కలవకుండా వెళ్ళడు. ఎంతో దయనీయమైన పరిస్థితి నుంచి కోట్లకు అధిపతిగా ఎదిగిన జానీ లివర్‌ తెలుగు వాడు కావడం మనందరం గర్వించదగిన విషయం.