Read more!

English | Telugu

బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. ర‌మ్య‌కృష్ణ గురించి చాలా త‌క్కువ‌మందికి తెలిసిన‌ నిజాలు!

 

అందాల తార‌ ర‌మ్య‌కృష్ణ, ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ 2003లో పెళ్లి చేసుకున్నారు. ఆ దంప‌తుల‌కు రిత్విక్ వంశీ అనే కుమారుడు ఉన్నాడు. కెరీర్ మొద‌ట్లో గ్లామ‌ర‌స్ రోల్స్ చేసి, ప్రేక్ష‌కుల ఆరాధ్య‌తార‌గా పేరు తెచ్చుకున్న ర‌మ్య‌కృష్ణ కెరీర్‌ను మ‌రో మ‌లుపు తిప్పిన సినిమా.. ర‌జ‌నీకాంత్ 'న‌ర‌సింహ' (త‌మిళ ఒరిజిన‌ల్ 'ప‌డ‌య‌ప్పా'). అందులో నీలాంబ‌రి అనే నెగ‌టివ్ రోల్‌లో ఆమె చేసిన న‌ట‌న‌ను ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోలేదు. వ‌య‌సుకు అనుగుణంగా హీరోయిన్ పాత్ర‌లు త‌గ్గిపోవ‌డంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారారు ర‌మ్య‌కృష్ణ‌. 'బాహుబ‌లి'లో చేసిన శివ‌గామి పాత్ర ఆమెకు దేశ‌వ్యాప్తంగా కీర్తిని తెచ్చింది. అలాంటి ర‌మ్య‌కృష్ణ కెరీర్ ఆరంభంలో టెలీప్లేల‌లో కూడా న‌టించార‌నే విష‌యం చాలామందికి తెలీదు. నేటి త‌రానికి తెలీని ఆమె కెరీర్ తొలినాళ్ల నిజాలేవంటే...

ర‌మ్య‌కృష్ణ 1983లోనే న‌టిగా చిత్ర‌రంగంలో అడుగుపెట్టారు. సినిమాల్లోకి రాక‌ముందే ఆమె నాట్య‌కారిణి. సినిమాల్లోకి వ‌చ్చాక కూడా ఆమె నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తూ వ‌చ్చారు. అలాగే టీవీ నాట‌కాల‌లో (టెలీప్లేలు) న‌టించారు. అలా మూడు విధాలుగా కూడా ఆమె రాణించారు. నాట్యం అంటే ఆమెకు ఎంతో అభిమానం. వెంప‌టి చిన‌స‌త్యం ద‌గ్గ‌ర కూచిపూడిలో అక్ష‌రాభ్యాసం చేసుకున్నారామె. ధ‌నంజ‌య వ‌ద్ద భ‌ర‌త‌నాట్యంలో తొలి అడుగు వేశారు. మ‌న‌దేశంలోని ప్ర‌ధాన నగ‌రాల్లో నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చే అవ‌కాశం ఆమెకు ల‌భించింది. అందుకే నృత్యం మీద ఉన్న అభిమానం కొద్దీ త‌న పాత్ర‌లు నృత్య ప్ర‌ధానంగా ఉంటే బావుంటుంద‌ని ఆమె అనుకొనేవారు.

తెలుగులో 'భ‌లే మిత్రులు' ఆమె మొద‌టి చిత్రం. అందులో న‌గేశ్ కుమారుడు ఆనంద్‌బాబు స‌ర‌స‌న నాయిక‌గా న‌టించారు. ఆ సినిమా విజ‌యం సాధించింది. అయితే ఆమెలోని న‌ర్త‌కికి న్యాయం చేసిన 'సంకీర్త‌న' (నాగార్జున హీరో) చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డం ఆమెకు నిరాశ‌ను క‌లిగించింది. 'అక్షింత‌లు' చిత్రంలో ఆమె న‌ట‌న విమ‌ర్శ‌కుల‌ను సైతం మెప్పించింది. అలాంటి పాత్ర‌లు కావాల‌ని ఏ న‌టి మాత్రం కోరుకోదు! ఒక వైపు గ్లామ‌ర్‌, మ‌రోవైపు కామెడీ ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లు ఆమె చేసుకుంటూ వ‌చ్చారు.

సినిమాల్లో న‌టిస్తూనే 'అంబికాప‌తి', 'సిలందివ‌లై' అనే రెండు త‌మిళ టీవీ నాట‌కాల్లో న‌టించారు ర‌మ్య‌కృష్ణ‌. 'అంబికాప‌తి' హాస్య‌ప్ర‌ధాన నాట‌కం. అందులో ఆమెకు జోడీగా వై.జి. మ‌హేంద్ర న‌టించారు. 'సిలందివ‌లై' నాట‌కంలో బాగా డాన్స్ చేసే అవ‌కాశం ఆమెకు ల‌భించింది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించిన అతికొద్ది మంది తార‌ల్లో ఒక‌రిగా ర‌మ్య‌కృష్ణ పేరు తెచ్చుకున్నారు. ఆమెకు విన‌య అనే చెల్లెలు కూడా ఉంది. విన‌య‌కు స్పోర్ట్స్ అంటే ఇష్టం. టేబుల్ టెన్నిస్‌లో ఎన్నో బ‌హుమ‌తులు కూడా గెల్చుకున్నారామె.

'ప‌డ‌య‌ప్పా' (న‌ర‌సింహ‌) చిత్రంలో ప్ర‌తినాయిక పాత్ర‌ను బీభ‌త్సంగా పోషించి, త‌న‌కు ఇష్ట‌మైన డాన్స్‌ను కూడా అంతే బీభ‌త్సంగా చేసి ప్రేక్ష‌కులపై చెర‌గ‌ని ముద్ర‌వేసిన ర‌మ్య‌కృష్ణ చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఆమెతో త‌ల్లిదండ్రులూ క‌లిసుంటున్నారు.