Read more!

English | Telugu

శ్రుతి హాస‌న్ త‌ల్లి సారిక 6 రోజుల పాటు కారులోనే గ‌డిపార‌ని తెలుసా?!

 

క‌మ‌ల్ హాస‌న్ మాజీ భార్య‌, శ్రుతి హాస‌న్ త‌ల్లి సారిక ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను ఓసారి చూస్తే న‌మ్మ‌లేని నిజాలు మ‌న‌కు కొన్ని క‌నిపిస్తాయి. ఆమె జీవితం చాలా క్లిష్టంగా కొన‌సాగిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. ఆమె చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రులు విడిపోయారు. నాలుగేళ్ల ప‌సి వ‌య‌సులోనే ఆమె ప‌నిచేయ‌డం ప్రారంభించింది. స్కూలుకు వెళ్ల‌డానికి బ‌దులుగా ఆమె ఫిల్మ్ స్టూడియోల చుట్టు చ‌క్క‌ర్లు కొడుతూ వ‌చ్చింది.

21 సంవ‌త్స‌రాల యువ‌తిగా ఉండ‌గా, చేతిలో డ‌బ్బులు లేకుండా, ఒంటి మీద బ‌ట్ట‌ల‌తోటే ఆమె త‌న త‌ల్లి ఇంటిని విడిచిపెట్టింది. ఆ త‌ర్వాత ఏం చేయాలో తెలీక‌, ఆలోచిస్తూ త‌న కారులోనే ఆమె ఆరు రోజుల పాటు గ‌డిపిందనే విష‌యం వింటే ఎవ‌రికైనా ఒళ్లు జ‌ల‌ద‌రించ‌కుండా ఉంటుందా! 

1988లో 28 ఏళ్ల వ‌య‌సులో సౌత్ సూప‌ర్‌స్టార్స్‌లో ఒక‌రైన క‌మ‌ల్ హాస‌న్‌ను వివాహం చేసుకున్న ఆమె, న‌ట‌న‌ను వ‌దిలేసింది.

43 ఏళ్ల వ‌య‌సులో మెట్టింటిని విడిచిపెట్టిన సారిక‌, త‌న ఇద్ద‌రు కూతుళ్లు శ్రుతి, అక్ష‌ర‌ను వెంట‌పెట్టుకొని ముంబైకి వెళ్లిపోయి, అప్పుడెప్పుడో వ‌దిలేసిన న‌ట‌న‌ను తిరిగి మొద‌లుపెట్టింది.

ఈ విష‌యాలు చాలు.. సారిక జీవితం గాలిప‌టంలా ఎటు బ‌లంగా గాలివీస్తే, అటు మ‌ళ్లింద‌నీ, కొన్నిసార్లు తెగిన గాలిప‌టంలా ఆమె జీవితం వ‌ణికిపోయింద‌నీ తెలుసుకోవ‌డానికి!

నాలుగేళ్ల వ‌య‌సులో బాల‌న‌టిగా ఆమె కెరీర్ ప్రారంభించిన సినిమా లెజెండ‌రీ డైరెక్ట‌ర్ బి.ఆర్‌. చోప్రా రూపొందించిన‌ 'హ‌మ్‌రాజ్‌' (1967). చిన్న‌త‌నంలో ఎక్కువ‌గా మాస్ట‌ర్ సూర‌జ్ పేరుతో అబ్బాయి పాత్ర‌లు చేసింద‌ని మ‌న‌లో ఎంత‌మందికి తెలుసు! ఆ ప‌సి వ‌య‌సులో ప‌నిచేయ‌డం మంచిదా, కాదా అనే విష‌యం ఆమెకు ఎలా తెలుస్తుంది. ఆమెకు తెలిసింద‌ల్లా షూటింగ్ ఉన్న‌ప్పుడు స్టూడియోకు వెళ్లి కెమెరా ముందు న‌టించ‌డం, ఆ త‌ర్వాత ఇంటికి వ‌చ్చేయ‌డం. నిజం చెప్పాలంటే ఆమెకు వేరే ఆప్ష‌న్ కూడా లేదు. మిగ‌తా అంద‌రు పిల్ల‌ల్లా స్కూలుకు వెళ్లే అవ‌కాశం ఆమెకు ల‌భించ‌లేదు.

క‌మ‌ల్ హాస‌న్‌తో పెళ్ల‌య్యాక రెండు కార‌ణాల‌తో ఆమె న‌ట‌న‌కు దూర‌మైంది. ఒక‌టి.. బాల‌న‌టిగా కెరీర్ ప్రారంభించిన త‌ను ఇంత దాకా న‌టించింది చాల‌ని అనుకోవ‌డం, కెమెరా ముందు న‌టించీ న‌టించీ అల‌సిపోవ‌డం. రెండు.. న‌టిగా ఉంటే అందంగా క‌నిపించాలి కాబ‌ట్టి రోజూ త‌ల‌స్నానం చేసి, చ‌క్క‌గా ముస్తాబ‌వ్వాలి. అదే టెక్నీషియ‌న్‌గా ఉంటే, అంత‌గా ముస్తాబ‌వ్వాల్సిన ప‌నిలేదు. అందుక‌ని కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా మారింది. క‌మ‌ల్ సినిమా 'హే రామ్' మూవీతో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్ సైతం పొందిందామె.

చెన్నైను వ‌దిలేసి, ముంబైకి తిరిగి వెళ్లిపోవ‌డం చాలా క్లిష్ట‌మైన ప‌నే అయిన‌ప్ప‌టికీ ఆమె భ‌రించింది. పైగా అప్పుడామెతో ఇద్ద‌రు కూతుళ్లు కూడా ఉన్నారు. సింగిల్ మ‌ద‌ర్‌గా వారి ఆల‌నా పాల‌నా చూసుకోవ‌డం అంత ఈజీ కాదు. ఆ ఇద్ద‌రూ పెద్ద‌యి, ఇద్ద‌రూ కెరీర్‌ను స్టార్ట్ చేశాకే ఆమె రిలాక్స్ అయ్యింది. 

ముంబైకి వెళ్లిపోయాక ఆమె టెక్నీషియ‌న్ ప‌నిని కాకుండా తిరిగి యాక్ట‌ర్‌గా కెరీర్‌ను పునఃప్రారంభించ‌డం గ‌మ‌నార్హం. కార‌ణం.. న‌టిగా ఎక్కువ డ‌బ్బు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టం. ఇద్ద‌రు పిల్ల‌ల్ని పెంచ‌డానికి ఆమెకు డ‌బ్బు అవ‌స‌ర‌మైంది. అప్ప‌టికి ఆమెకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదంటే న‌మ్మ‌శ‌క్యం కాదు కానీ అది ప‌చ్చి నిజం. అట్లా రాహుల్ ధొలాకియా డైరెక్ష‌న్‌లో న‌టించిన 'ప‌ర్జానియా' మూవీలో న‌ట‌న‌కు గాను ఏకంగా ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డును సాధించిందామె.