Read more!

English | Telugu

ఎస్‌.పి.బాలు, యద్దనపూడి సులోచనారాణి జంటగా బాపు సినిమా!

గానగంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం.. తన గాన మాధుర్యంతో అందరికీ మధురానుభూతిని పంచిన గాయకుడు. 
యద్దనపూడి సులోచనారాణి.. తన రచనలతో వేలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న రచయిత్రి. ఆమె రచించిన నవలల ఆధారంగా తెలుగులో ఎన్నో సినిమాలు రూపొందాయి. పాత తరంలో యద్దనపూడి రచనలకు ఎంతో ఆదరణ ఉండేది. 

ఈ ఇద్దరూ జంటగా సినిమా అనేది చాలా మందికి విచిత్రంగా అనిపించవచ్చు. కానీ, దర్శకుడు బాపు ఆ ఆలోచన చేశారు. 1967లో ‘సాక్షి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన బాపు 1968లో తన రెండో సినిమాని ప్లాన్‌ చేశారు. 1967లో విడుదలైన ‘త్రీ బైట్స్‌ ఆఫ్‌ ది యాపిల్‌’ అనే అమెరికన్‌ కామెడీ సినిమా ప్రేరణతో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌  మొదలుపెట్టారు. దానికి ‘బంగారు పిచిక’ అనే టైటిల్‌ని పెట్టి కొత్తవారిని హీరో, హీరోయిన్‌గా పరిచయం చెయ్యాలనుకున్నారు. హీరోయిన్‌ అనే స్పెషల్‌ లక్షణాలు లేకుండా సహజంగా ఉండాలన్న ఉద్దేశంతో రచయిత్రి యద్దనపూడి సులోచనారాణిని సంప్రదించారు. అయితే తనకు నటన తెలియదని, నటించే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. 

1966లో నేపథ్యగాయకుడిగా పరిచయమైన ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం అప్పుడప్పుడే సింగర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఆ సమయంలో ‘మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ అనే సినిమాలోని ఓ ఫంక్షన్‌లో పాట పాడే సన్నివేశం ఉంది. ఆ వేషాన్ని బాలసుబ్రహ్మణ్యంతోనే చేయించారు. పాట పాడుతూ తొలిసారి స్క్రీన్‌పై కనిపించారు బాలు. దాంతో అతను హీరోగా నటించే అవకాశం కూడా ఉందని భావించిన బాపు ‘బంగారు పిచిక’ గురించి చెప్పారు. కానీ, బాలు ఆ సినిమాలో హీరోగా నటించేందుకు ఒప్పుకోలేదు. 

అలా బాలు, సులోచనారాణి తిరస్కరించడంతో చంద్రమోహన్‌, విజయనిర్మలతో ‘బంగారు పిచిక’ చిత్రాన్ని రూపొందించారు. ఇదే సినిమాని 1994లో నరేష్‌, దివ్యవాణి జంటగా ‘పెళ్లికొడుకు’ పేరుతో తీశారు బాపు. కానీ, ఈ సినిమా విజయం సాధించలేదు.