English | Telugu

 నాగ్ ని కింగ్ ని చేసిన టాప్ 10 మూవీస్ ఇవే!

కింగ్ నాగార్జున.. వెండితెర సమ్మోహనాస్త్రం. మూడున్నర దశాబ్దాలకిపైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. స్వీట్ 60 క్లబ్ లోనూ గ్లామర్ తో కనువిందు చేస్తున్న 'మన్మథుడు'. అలాంటి నాగ్ ని తెలుగునాట 'కింగ్'ని చేసిన టాప్ 10 జనరంజక చిత్రాలేంటో చూద్దాం..

1. గీతాంజలి: అప్పటి యువతకి సరికొత్త ప్రేమకథని పరిచయం చేసిన చిత్రమిది. ఇందులో క్యాన్సర్ వ్యాధికి గురైన యువకుడు ప్రకాశ్ గా తన సహజ నటనతో ఆకట్టుకున్నారు నాగ్. ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ఈ సినిమాకి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పాటలు ఎస్సెట్ గా నిలిచాయి.

2. శివ: టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్స్ లో 'శివ' ఒకటి. ఈ సినిమాతోనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరంగేట్రం చేశారు. ఇందులో విభిన్న ఛాయలున్న శివ పాత్రలో తన అద్బుతాభినయంతో అలరించారు నాగ్. హిందీలోనూ ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ అయి.. అక్కడా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

3. ప్రెసిడెంటుగారి పెళ్ళాం:'శివ' తరువాత ట్రాక్ తప్పిన నాగార్జున కెరీర్ ని.. మళ్ళీ విజయపథంలోకి తీసుకువచ్చిన సినిమా 'ప్రెసిడెంటు గారి పెళ్ళాం'. ఈ చిత్రాన్ని ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. ఇందులో పల్లెటూరి యువకుడు రాజాగా మాస్ ని భలేగా ఎంటర్టైన్ చేశారు నాగ్.

4. హలో బ్రదర్: తెరపై ఒక్క నాగార్జున కనిపిస్తేనే.. ఫ్యాన్స్ కి మస్త్ ఎంటర్టైన్మెంట్. అలాంటిది రెండు పాత్రల్లో దర్శనమిస్తే.. అది 'హలో బ్రదర్'లా అటు క్లాస్ ని, ఇటు మాస్ ని మెస్మరైజ్ చేసే బ్లాక్ బస్టర్ బొమ్మే. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దేవా, రవివర్మ గా తన ద్విపాత్రాభినయంతో అభిమానులను భలేగా అలరించారు ఈ అక్కినేని వారి హ్యాండ్సమ్ స్టార్.

5. నిన్నే పెళ్ళాడతా: కుటుంబ ప్రేక్షకులకు నాగ్ ని ఎంతో దగ్గర చేసిన సినిమా 'నిన్నే పెళ్ళాడతా'. ఇందులో శీను పాత్రలో ఎంతో నేచురల్ గా కనిపించి మురిపించారు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో టబుతో నాగ్ పండించినఆన్ స్క్రీన్ రొమాన్స్ ఇప్పటికీ చర్చనీయాంశమే.

6. అన్నమయ్య: నాగ్ కెరీర్ ని 'అన్నమయ్య'కి ముందు, తరువాత అన్నంతగా ప్రభావంచూపిన సినిమా. నిజంగా అన్నమయ్య అంటే ఇలానే ఉంటారేమో అన్నట్లుగా పాత్రలో ఒదిగిపోయారు నాగ్. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాతో ఉత్తమ నటుడుగా తొలి నందిని అందుకోవడమే కాకుండా స్పెషల్ మెన్షన్ కేటగిరిలో జాతీయ పురస్కారం కూడా సొంతం చేసుకున్నారు నాగార్జున.

7. నువ్వు వస్తావని: 'అన్నమయ్య' చిత్రం తరువాత సరైన విజయాల్లేని నాగ్ ని.. మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చిన చిత్రం 'నువ్వు వస్తావని'. ఇందులో చిన్ని కృష్ణ పాత్రలో జీవించేశారు నాగ్. ఈ సాఫ్ట్ రోల్ తో మహిళా ప్రేక్షకులకు మరెంతో దగ్గరయ్యారు. నూతన దర్శకుడు వి.ఆర్. ప్రతాప్ రూపొందించిన 'నువ్వు వస్తావని' అప్పట్లో ఓ సంగీత సంచలనం.

8. మన్మథుడు: అమ్మాయిలంటే అస్సలు పడని అభిరామ్ అనే యువకుడిగా నాగ్ ఎంటర్టైన్ చేసిన మూవీ 'మన్మథుడు'. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ విజయభాస్కర్ డైరెక్టోరియల్.. నాగ్ కి సరికొత్త అభిమాన గణాన్ని అందించింది. ఇక 'మన్మథుడు' అనే టైటిల్ కాస్త నాగ్ కి ముద్దు పేరైపోయింది.

9. మనం: ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలకథానాయకులు కలిసి నటించడమంటేనే.. ఓ అపురూపమైన అంశం. దానికి ఓ అద్భుతమైన కథ తోడైతే.. అది 'మనం' చిత్రమే. ఇటు తండ్రి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతోనూ, అటు తనయుడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతోనూ నాగ్ స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ మెమరబుల్ మూవీని విక్రమ్ కుమార్ తీర్చిదిద్దారు.

10. సోగ్గాడే చిన్ని నాయనా: తండ్రీకొడుకులుగా నాగార్జున నటించిన మాస్ ఎంటర్టైనర్ ఇది. అంతేకాదు.. నాగ్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన సినిమా కూడా. నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో బంగార్రాజు, రాముగా మెస్మరైజ్ చేశారు కింగ్.