English | Telugu
వెండితెర సమ్మోహనాస్త్రం.. మన్మథుడు నాగార్జున!
Updated : Aug 28, 2023
వెండితెరపై ప్రయోగాలు చేయడానికే.. 'నేనున్నాను' అంటారాయన. నట సమ్రాట్ కి 'వారసుడు' అన్న ట్యాగ్ తోనే సినీ 'గగనం'లో అడుగుపెట్టిన ఆ 'గ్రీకు వీరుడు'.. ఒక దశలో వరుస విజయాలతో 'జైత్రయాత్ర' సాగించి 'ఎదురులేని మనిషి'గా నిలిచారు. క్లాస్ కైనా, 'మాస్'కైనా.. తనే 'బాస్' అనిపించుకున్నారు. 'నిన్నే ప్రేమిస్తా', 'నిన్నే పెళ్ళాడతా' అని అమ్మాయిలను పలవరించేలా చేసి.. వారి కలలకు 'ఊపిరి' పోశారు. 'ఆకాశ వీధిలో' 'మజ్ను'లా సాగుతూ.. తన 'గీతాంజలి'తో మురిపించారు. 'గోవింద గోవిందా', 'ఓం నమో వేంకటేశాయ' అంటూ 'అన్నమయ్య' 'సంకీర్తన'లు ఆలపిస్తూనే.. ఆ 'జానకి రాముడు'కి 'శ్రీరామదాసు'డయ్యారు. జన 'చైతన్యం' కోసం 'ఢమరుకం' మ్రోగించి వెండితెరపై 'శివ' తాండవం చేశారు. 'సంతోషం' పంచడానికి 'అంతం' లేదంటూ.. అనూహ్య 'నిర్ణయం' తీసుకుని మరీ బుల్లితెరపైనా 'సూపర్' అనిపించుకున్నారు. ఇంతలా సమ్మోహనపరిచిన ఆ 'మన్మథుడు' ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అతనే మన 'కింగ్' నాగార్జున.
తెలుగు తెరపై ఎందరో నట వారసులు సందడి చేశారు. అయితే, కొందరు మాత్రమే స్టార్స్ గా వెలుగొందారు. అలాంటి వారిలో.. కింగ్ నాగార్జున ఒకరు. నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగార్జున.. కెరీర్ ఆరంభంలో లుక్స్ విషయంలోనూ, యాక్టింగ్ స్కిల్స్ విషయంలోనూ పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఒకవైపు వాటిని స్వాగతిస్తూనే.. మరోవైపు తనను తాను మెరుగుపరుచుకుంటూ 'వజ్రం'లా ప్రకాశించే దిశగా అడుగులు వేశారు. 'విక్రమ్' వంటి విజయవంతమైన చిత్రంతో 1986లో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన నాగ్.. ఆపై ఫ్లాప్, హిట్స్ సమంగా చూస్తూ ముందుకు సాగారు. అయితే 1989.. నాగ్ కెరీర్ లో మరపురాని సంవత్సరమనే చెప్పాలి. ఆ ఏడాది తను నటించిన 'గీతాంజలి', 'శివ' చిత్రాలు తనని స్టార్ చేశాయి. అప్పటివరకు సాదాసీదా కథానాయకుడిగానే సాగుతున్న నాగార్జునని కాస్త సమ్ థింగ్ స్పెషల్ గా చేశాయి ఆ చిత్ర ద్వయాలు. ఆ విజయాల స్ఫూర్తితోనే మరిన్ని ప్రయోగాలు చేశారు ఈ అక్కినేని హ్యాండ్సమ్ హీరో. వాటిలో వికసించిన వాటికంటే వికటించినవే ఎక్కువ. అయినప్పటికీ కొత్తదనమే తన 'ఊపిరి' అనుకుంటూ వైవిధ్యానికే పెద్దపీట వేశారు.
ఈ క్రమంలోనే.. 'జైత్రయాత్ర', 'అంతం' వంటి విభిన్న ప్రయత్నాలు నిరాశపరిచినా.. 'ప్రెసిడెంటు గారి పెళ్ళాం', 'వారసుడు', 'అల్లరి అల్లుడు', 'హలో బ్రదర్', 'ఘరానా బుల్లోడు' వంటి మాస్ ఎంటర్టైనర్స్ తో హిట్స్ పట్టారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. 'నిన్నే పెళ్ళాడతా'తో రొమాంటిక్ కింగ్ అనిపించుకున్న నాగ్.. ఆపై వెనువెంటనే వచ్చిన 'అన్నమయ్య'తో తెలుగుజనులను భక్తిపారవశ్యంలో ముంచేయడం అనూహ్యం, అసాధారణం, అపూర్వమనే చెప్పాలి. "నాగార్జున ఏంటి? అన్నమయ్యగా చేయడమేంటి?" అన్నవాళ్ళకు తన అద్భుతాభినయంతో సమాధానమివ్వడమే కాకుండా.. తొలిసారి 'నంది' పురస్కారాన్ని, అలాగే 'స్పెషల్ జ్యూరీ' విభాగంలో నేషనల్ అవార్డ్ ని కైవసం చేసుకుని విస్మయపరిచారు. 'శివ' తరువాత ఎలాగైతే నాగ్ కి వరుస పరాజయాలు పలకరించాయో.. 'అన్నమయ్య' తరువాత కూడా దాదాపు అదే పరిస్థితి ఎదురైంది. అయితే, మ్యూజికల్ సెన్సేషన్ 'నువ్వు వస్తావని'తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చి.. ఆపై 'నిన్నే ప్రేమిస్తా', 'ఆజాద్' వంటి హిట్స్ తో 2000లో హ్యాట్రిక్ చూశారు. మళ్ళీ 2001లో వరుస ఫ్లాఫ్స్ తో మరోసారి ఇబ్బందిపడ్డప్పటికీ.. మరుసటి ఏడాది నుంచి 'సంతోషం', 'మన్మథుడు', 'శివమణి', 'నేనున్నాను', 'మాస్' వంటి వరుస హిట్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేశారు. 'శ్రీరామదాసు'గా మరోసారి ఆధ్యాత్మిక బాట పట్టి మరో నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.
శ్రీరామదాసు అనంతరం దాదాపు పదేళ్ళ పాటు తన స్థాయికి తగ్గ హిట్ లేనప్పటికీ.. వైవిధ్యం పంచడంలో వెనుకడుగేయలేదు నాగ్. ఆపై 'మనం', 'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి' వంటి వరుస విజయాలతో మెరిశారు. అటుఇటుగా అదే సమయంలో బుల్లితెరపై 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి హోస్ట్ గా చేసి మెస్మరైజ్ చేశారు. ఆపై 'బిగ్ బాస్' షోతోనూ పలు సీజన్స్ లోమురిపించారు. ఎందరో దర్శకులను తెలుగు తెరకు పరిచయం చేసి 'సెల్యులాయిడ్ సైంటిస్ట్' అనిపించుకున్న నాగ్.. నిర్మాతగానూ తిరుగులేని విజయాలు చూశారు. అదేవిధంగా తెలుగు తెరకే పరిమితం కాకుండా హిందీ, తమిళ పరిశ్రమల్లోనూ తనదైన ముద్ర వేశారు. అడపాదడపా అతిథి పాత్రల్లోనూ మెరిశారు. అవార్డులు, రివార్డులు, రికార్డుల్లోనూ తనదైన బాణీ పలికించారు. ఓవరాల్ గా.. 98 సినిమాలు పూర్తిచేసిన నాగార్జున త్వరలో తన 99వ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. బహుశా వచ్చే ఏడాది ఇదే సమయానికి 'శతచిత్రాల కథానాయకుడు' అనే ట్యాగ్ సైతం పొందే అవకాశం లేకపోలేదు. 1959 ఆగస్టు 29న జన్మించిన నవ మన్మథుడు నాగార్జున.. 64 ఏళ్ళు పూర్తిచేసుకుని 65వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తోంది 'తెలుగువన్. కామ్'.