English | Telugu
శంకర్ 'బాయ్స్'కి 20 ఏళ్ళు.. కుర్రకారుని పిచ్చెక్కించిన సినిమా!
Updated : Aug 28, 2023
సామాజిక సందేశానికి సాంకేతికతను జోడించి సినిమాలు తెరకెక్కించడం.. దర్శకుడు శంకర్ శైలి. యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన తెరకెక్కించిన 'బాయ్స్' కూడా ఈ తరహా సినిమానే. ఫ్యాషన్, మ్యూజిక్, లైఫ్ స్టైల్ వంటి అంశాల చుట్టూ తిరిగే ఈ చిత్రం.. ప్రధానంగా ఐదుగురు అబ్బాయిలు, ఓ అమ్మాయి పై సాగే కథ. యూత్ కోసమే తీసిన సినిమా కావడంతో.. కథానుసారం కొన్ని బోల్డ్ సీన్స్ కూడా తెరకెక్కించారు శంకర్. అవి అప్పట్లో వివాదస్పదం అయినప్పటికీ.. కాలక్రమంలో కల్ట్ క్లాసిక్ గా నిలిచింది ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్.
సిద్ధార్థ్, జెనీలియా, భరత్, తమన్ (నేటి ప్రముఖ సంగీత దర్శకుడు), నకుల్, మణికంఠన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బాయ్స్'లో వివేక్, భువనేశ్వరి, అనితా రత్నం, జానకి సబేష్, సుభాషిణి, ఇళవరసు, మనోబాల, రామ్ జీ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రముఖ గాయకులు ఎస్పీబీ, హరిహరన్, విజయ్ యేసుదాస్, రంజిత్, బ్లాజీ అతిథి పాత్రల్లో మెరిశారు.
స్వరమాంత్రికుడు ఎ.ఆర్. రెహమన్ సంగీతం 'బాయ్స్'కి ఎస్సెట్ గా నిలిచింది. ఇందులోని "నాకొక గాళ్ ఫ్రెండ్ కావలెను", "ఎగిరి దుమికితే", "సరిగమ", "బూమ్ బూమ్", "మారో మారో", "డేటింగ్", "ప్లీజ్ సార్" అంటూ మొదలయ్యే పాటలు యువతరాన్ని ఉర్రూతలూగించాయి. 2003 ఆగస్టు 29న విడుదలై బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించిన 'బాయ్స్'.. మంగళవారంతో 20 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.