Read more!

English | Telugu

యాక్సిడెంట్‌లో నెత్తుటి గాయాలు.. అమ్మ‌కు అబ‌ద్ధం చెప్పిన సుమ‌న్‌!

 

సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ వాళ్ల‌మ్మ‌గారికి సైకిల్‌, మోటార్ సైకిల్ లాంటి ద్విచ‌క్ర వాహ‌నాలంటే విప‌రీత‌మైన భ‌యం. అందుకే చిన్న‌ప్పుడు ఆయ‌న‌కెప్పుడూ సైకిల్ కొనివ్వ‌లేదు. సుమ‌న్ సైకిల్ తొక్క‌డం నేర్చుకుంటానంటే ఒప్పుకొనేవారు కాదు. అందుక‌ని ఆమెకు తెలీకుండా దొంగ‌త‌నంగా సైకిల్ తొక్క‌డం, మోటార్ బైక్ డ్రైవ్ చెయ్య‌డం నేర్చుకున్నారు సుమ‌న్‌. కాలేజీలో చ‌దువుకొనేప్పుడు ఒక‌రోజు ఫ్రెండ్‌తో క‌లిసి, అత‌ని బైక్‌పై సినిమాకు బ‌య‌లుదేరారు సుమ‌న్‌. ఆయ‌న బైక్ న‌డుపుతుంటే, ఫ్రెండ్ వెనుక కూర్చున్నాడు.

బైక్ న‌డ‌ప‌డం నేర్చుకున్న కొత్త‌లో కావ‌డంతో, బాగా స్పీడుగా పోనిస్తున్నారు సుమ‌న్‌. చెన్నై మౌంట్ రోడ్‌లో వెళ్తుండ‌గా, వాళ్ల బైక్‌కు ముందు ఓ సిటీ బ‌స్ వెళ్తోంది. ఎదురుగా మ‌రో మోటార్ బైక్ వ‌స్తోంది. ఆ బైక్‌ను త‌మాషాగా అలంక‌రించి వుండ‌టంతో, దాన్నే చూస్తూ బైక్ న‌డుపుతున్నారు సుమ‌న్‌. అనుకోకుండా వాళ్ల ముందున్న సిటీ బ‌స్ స‌డ‌న్ బ్రేక్‌తో ఆగింది. ఇది గ్ర‌హించ‌క‌పోవ‌డంతో సుమ‌న్ న‌డుపుతున్న బైక్ ఆ బ‌స్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది.  సుమ‌న్‌, ఫ్రెండ్‌.. ఇద్ద‌రూ కింద‌ప‌డ్డారు. 

ప‌క్క‌నే విమెన్స్ కాలేజీ బ‌స్టాప్‌లో నిల్చున్న కొంత‌మంది అమ్మాయిలు వాళ్ల‌ను చూసి న‌వ్వ‌డం ప్రారంభించారు. అస‌లే కాళ్లూ, చేతులూ గీరుకుపోయి, నెత్తురు కారుతూ, గాయాలు క‌లిగించే మంట కంటే ఆ అమ్మాయిలు త‌మ‌ని చూసి న‌వ్వ‌డం వారికి మ‌రింత బాధ‌నూ, కోపాన్నీ క‌లిగించింది. అంత‌లో బ‌స్ డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌, బ‌స్‌లోని జ‌నం, రోడ్డుమీద పోయే జ‌నం వారి చుట్టూ మూగి తిట్ట‌సాగారు. దాంతో సుమ‌న్‌కు దాదాపు ఏడుపొచ్చినంత ప‌నైంది. అయినా ఆ దుఃఖాన్ని దిగ‌మింగుకొని మెల్ల‌గా తేలుకుట్టిన దొంగ‌ల్లా ఇల్లు చేరుకున్నారు.

గుమ్మంలోనే సుమ‌న్ వాళ్ల‌మ్మ‌గారు ఎదురై నెత్తుటి గాయాల‌తో ఉన్న సుమ‌న్‌నూ, అత‌ని ఫ్రెండ్‌నూ చూసి గాబ‌రాప‌డ్డారు. ఏం జ‌రిగింద‌ని ఆమె అడ‌గ‌క‌ముందే, "హాకీ ఆడుతూ కింద‌ప‌డ్డాం, దెబ్బ‌లు త‌గిలాయి.. అంతే!" అని అబద్ధం చెప్పి, ఆమె శిక్ష నుంచి త‌ప్పించుకున్నారు. ఆ రోజు నుంచి సుమ‌న్ మోటార్ బైక్‌కు గుడ్‌బై చెప్పేశారు.