Read more!

English | Telugu

విల‌న్‌గా భ‌య‌పెట్టి 50 ఏళ్ల వ‌య‌సులోనే అర్ధంత‌రంగా క‌న్నుమూసిన త్యాగ‌రాజు!

 

విల‌న్ క్యారెక్ట‌ర్ల‌లో ఉన్న‌త స్థాయిలో రాణించి, వాటిపై త‌న‌దైన ప్ర‌త్యేక ముద్ర వేసిన న‌టుడు త్యాగ‌రాజు. సినీ రంగంలో అడుగుపెట్టి తొలి సినిమాలోనే మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావును ఢీకొట్టే విల‌న్ పాత్ర‌ను చేసి, మెప్పించారాయ‌న‌. 1964లో వ‌చ్చిన ఆ సినిమా 'మంచి మ‌నిషి'. ఆ త‌ర్వాత రెండున్న‌ర ద‌శాబ్దాల కెరీర్‌లో ఎన్నో సాంఘిక‌, జాన‌ప‌ద‌, పౌరాణిక‌, చారిత్ర‌క‌, కౌబాయ్ చిత్రాల్లో ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టే ప్ర‌తినాయ‌క పాత్ర‌ల్లో గొప్ప‌గా రాణించి, వారి హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానం సంపాదించారు.

త్యాగ‌రాజు 1941లో వరంగల్ జిల్లా హన్మకొండలో టి.ఆర్‌. నారాయణస్వామి నాయుడు, యతిరాజమ్మ దంపతులకు జన్మించారు. ఈయ‌న‌ పూర్తి పేరు పగడాల త్యాగరాజు నాయుడు. వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్‌లో చ‌దువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే ఒక‌వైపు స్టేజిపై న‌టిస్తూనే, మ‌రోవైపు క్రికెట్ ఆట‌గాడిగా రాణించారు. త‌న కాలేజీ క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు కూడా. ఆంధ్రా యూనివ‌ర్సిటీలో జ‌రిగిన ఇంట‌ర్ యూనివ‌ర్సిటీ నాట‌కోత్స‌వాల్లో ఉస్మానియా యూనివ‌ర్సిటీ త‌ర‌పున ప్ర‌ద‌ర్శించిన 'ప‌గిలిన గోడ‌లు' నాట‌కానికి ప‌లు అవార్డులు ల‌భించాయి. ఉత్తమ నాటకం, ఉత్తమ స్క్రిప్టు, ఉత్తమ నటుడు బహుమతులతో పాటు త్యాగరాజు పోషించిన రిక్షావాడి పాత్రకు ఉత్తమ సహాయనటుడి బహుమతి వచ్చింది. నాటకాలపై ఉన్న ఆసక్తితో వరంగల్‌లో మిత్రులందరితో కలిసి కాకతీయ కళాసమితి అనే సంస్థను స్థాపించారు త్యాగ‌రాజు. ఈ సంస్థ పక్షాన చాలా నాటకాలు వేశారు.

సినిమాల్లో న‌టించాల‌నే కోరిక‌తో మద్రాసు వెళ్లి దర్శకుడు ప్రత్యగాత్మను కలిశారు. త్యాగ‌రాజును ఆయ‌న నిరుత్సాహ‌ప‌ర‌చ‌లేదు. తాను దర్శకత్వం వహించిన 'మంచి మనిషి' చిత్రంలో విలన్‌గా అవకాశం ఇచ్చారు. ఆ వెంటనే గుత్తా రామినీడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ 'పల్నాటి యుద్ధం' (1966)లో వీరభద్రుడి వేషం, బి.ఎన్‌. రెడ్డి రూపొందించిన 'రంగుల రాట్నం' (1967)లో వాణిశ్రీ తండ్రి వేషంతో నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆ త‌ర్వాత ఆయ‌న వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌లుగ‌లేదు. అత్యంత దుర్మార్గుడైన‌ విలన్‌ వేషాలు వేయడంలో తనకు తానే సాటి రాగలడనే పేరు తెచ్చుకున్న త్యాగరాజు 'పాప కోసం', 'శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం' వంటి చిత్రాల్లో సాత్విక పాత్ర‌లు ధరించి ప్రేక్షకుల సానుభూతిని పొందారు కూడా. Also read: మ‌న గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచివుండే ఎవ‌ర్‌గ్రీన్ హీరో.. ఏఎన్నార్‌!

విల‌న్‌గా ఆయ‌న‌కు బాగా పేరు తెచ్చిన సినిమాల్లో గండికోట రహస్యం, కొరడా రాణి, మంచివాళ్ళకు మంచివాడు, చిక్కడు దొరకడు, మహా బలుడు, పంచ కళ్యాణి - దొంగల రాణి, జాతకరత్నం మిడతంబొట్లు, సీతా కళ్యాణం, మోసగాళ్లకు మోసగాడు, జేమ్స్‌బాండ్‌ 777 వంటివి ఉన్నాయి. 'అల్లూరి సీతారామ‌రాజు' సినిమాలో కరడుగట్టిన బ్రిటీష్‌ పోలీసాఫీసర్‌ బాస్టన్‌ దొరగా త్యాగరాజు న‌ట‌న‌ను మ‌ర‌చిపోగ‌ల‌మా! Also read: ​పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు దూర‌మైన‌ జ‌య‌మాలిని.. భ‌ర్త ఆమెపై ఆంక్ష‌లు పెట్టారా?

27 సంవ‌త్స‌రాల సినిమా కెరీర్‌లో ఏడాదికి స‌గ‌టున ప‌దికి మించిన చిత్రాలలో నటించిన త్యాగరాజు 50 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే అకాల మ‌ర‌ణం పొందారు. 1991 ఫిబ్రవరి 24న హైదరాబాదులోని అశోక్‌నగర్‌లో ఉన్న తన సోదరుని ఇంట్లో హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న న‌టించ‌గా విడుద‌లైన చివ‌రి చిత్రం ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ప్రేమ‌ఖైదీ' (1991). తెలుగు సినీ చరిత్రలో విలక్షణ విలన్‌గా త్యాగరాజు స్థానం సుస్థిరం.