Read more!

English | Telugu

'పుష్ప' విల‌న్ ఎవ‌రి కొడుకో తెలుసా? అత‌ని తండ్రి నాగార్జునను డైరెక్ట్ చేశాడు!

 

అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషించిన 'పుష్ప' మూవీ ద్వారా ఒక మ‌ల‌యాళం న‌టుడు మెయిన్ విల‌న్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. అత‌ను.. ఫ‌హ‌ద్ ఫాజిల్‌. మ‌ల‌యాళంలో అత‌నొక స్టార్ యాక్ట‌ర్‌. హీరో పాత్ర‌ల‌తో పాటు విభిన్న పాత్ర‌ల‌తో న‌టునిగా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అత‌ను న‌టించిన కొన్ని సినిమాలు కొవిడ్ టైమ్స్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై విడుద‌లై ఆడియెన్స్‌కు వినోదాన్నివ్వ‌డంతో పాటు భిన్న అనుభ‌వాల‌ను, అనుభూతుల‌ను ఇచ్చాయి. వాటిలో 'ట్రాన్స్' మొద‌ట థియేట‌ర్ల‌లో రిలీజైనా, త‌ర్వాత ఓటీటీలో మంచి పాపులారిటీ సాధించింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా నాలుగు సినిమాలు.. 'సి యు సూన్‌', 'ఇరుళ్‌', 'జోజి', 'మాలిక్'.. డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ‌య్యాయి. ఇవ‌న్నీ ఆడియెన్స్‌ను మెప్పించాయి.  

అత‌నికీ, తెలుగు సినిమాకీ ప‌రోక్షంగా ఒక క‌నెక్ష‌న్ ఉంది. అవును. అత‌ని తండ్రి తెలుగులో ఒక సినిమాని, అదీ.. అక్కినేని నాగార్జున సినిమాని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా.. 'కిల్ల‌ర్' (1991). ఆ డైరెక్ట‌ర్‌.. ఫాజిల్‌! మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లోని అగ్ర‌గ‌ణ్యులైన ద‌ర్శ‌కుల్లో ఫాజిల్ ఒక‌రు. ఆయ‌న వార‌సుడిగా డైరెక్ట‌ర్ కాకుండా యాక్ట‌ర్ అయ్యాడు ఫ‌హద్‌. 2002లో 'కైయేతుమ్ దూర‌త్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఫ‌హ‌ద్‌, ఆ త‌ర్వాత రెండో సినిమా చేయ‌డానికి ఏడేళ్లు నిరీక్షించాల్సి వ‌చ్చింది. 'కేర‌ళ కేఫ్' (2009) త‌ర్వాత అత‌ను వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌ల‌గ‌లేదు. 2011లో 'చాప్ప కురిషు' చిత్రంలో న‌ట‌న‌కు గాను తొలిసారి కేర‌ళ ప్ర‌భుత్వం నుంచి బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్ అవార్డును అందుకున్నాడు ఫ‌హ‌ద్‌.

Also read:  చివ‌రి రోజుల్లో కుటుంబ పోష‌ణ కోసం సీరియ‌ల్స్‌లో న‌టించిన సుత్తి వేలు!

ఆ త‌ర్వాత రెండేళ్ల‌కే 'ఆర్టిస్ట్', 'నార్త్ 24 కాథ‌మ్' (2013) సినిమాల్లో చేసిన క‌థానాయ‌కుడి పాత్ర‌ల‌కు ఈసారి బెస్ట్ యాక్ట‌ర్‌గా స్టేట్ అవార్డ్ సాధించాడు. దిలీష్ పోత‌న్ డైరెక్ట్ చేసిన 'తొండిముత‌లుమ్ దృక్‌సాక్షియుమ్' (2017)లో చేసిన ప్ర‌సాద్ అనే దొంగ‌పాత్ర‌కు గాను బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గా జాతీయ అవార్డు అందుకున్నాడు ఫ‌హ‌ద్‌. ఇప్పుడు 'పుష్ప' మూవీతో టాలీవుడ్‌కు విల‌న్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ట్లే కాలీవుడ్‌కు సైతం ఇదివ‌ర‌కే అత‌ను విల‌న్‌గా ఇంట్ర‌డ్యూస్ అయ్యాడు. ఆ సినిమా.. శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టించిన 'వేలైక్కార‌న్' (2017). 

'పుష్ప‌'లో మెయిన్ విల‌న్ రోల్‌కు సుకుమార్ మొద‌ట ఎంచుకున్న‌ది విజ‌య్ సేతుప‌తిని. మొద‌ట గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సేతుప‌తి.. ఆ త‌ర్వాత కొవిడ్ కార‌ణంగా త‌ను అదివ‌ర‌కే న‌టిస్తోన్న మిగ‌తా సినిమాల షెడ్యూళ్లు దెబ్బ‌తినడంతో వాటికోసం 'పుష్ప‌'ను వ‌దులుకున్నాడు. అలా 'భ‌న్వ‌ర్‌సింగ్ షెకావ‌త్ ఐపీఎస్' క్యారెక్ట‌ర్‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడు ఫ‌హ‌ద్ ఫాజిల్‌. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ పుష్ప‌రాజ్ (అల్లు అర్జున్‌)ను ఢీకొట్టే పాత్ర‌లో గుండుతో వైవిధ్య‌మైన లుక్‌తో అత‌ను క‌నిపిస్తున్నాడు. ప‌ర్ఫార్మెన్స్‌ప‌రంగా బ‌న్నీకి ఫ‌హ‌ద్ స‌రైన జోడీ అన‌డంలో సందేహం లేదు. తెర‌పై ఆ ఇద్ద‌రు న‌టుల అభిన‌యం సినీ ప్రియుల‌కు క‌నువిందు కావ‌డం ఖాయం.

Also read:  ఫ‌హ‌ద్ ఫాజిల్‌, న‌జ్రియా న‌జీమ్ బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీ.. రీల్ క‌పుల్ నుంచి రియ‌ల్ క‌పుల్ దాకా!

అన్న‌ట్లు.. ఫ‌హ‌ద్‌కు సంబంధించిన మ‌రో ముఖ్య‌మైన విష‌యం.. అత‌ను తోటి మ‌ల‌యాళం తార న‌జ్రియా న‌జీమ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. ఆమె కూడా త్వ‌ర‌లో నాని స‌ర‌స‌న నాయిక‌గా 'అంటే.. సుంద‌రానికి' సినిమా ద్వారా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం కాబోతోంది!