Read more!

English | Telugu

అర్థరాత్రి ఒంటిగంటకు ‘మెహబూబా.. మెహబూబా’... అదే ‘ముక్కాలా.. ముకాబ్‌లా’ అయ్యింది!

ఆస్కార్‌ విన్నర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌కు, సింగర్‌ నాగూర్‌బాబుకి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఎ.ఆర్‌.రెహమాన్‌ కెరీర్‌ ప్రారంభం నుంచి అతను మ్యూజిక్‌ చేసిన సినిమాల్లోని పాటలు పాడుతున్నాడు. రెహమాన్‌ సంగీత సారధ్యంలో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం కంటే ఎక్కువ పాటలు పాడిన ఘనత నాగూర్‌బాబుకే దక్కుతుంది. అతనంటే రెహమాన్‌కి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ అభిమానంతో నాగూర్‌బాబు సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్క సినిమా ‘సోంబేరి’ ఆడియో ఫంక్షన్‌కి ప్రత్యేకంగా హాజరయ్యాడు రెహమాన్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో పాటలు వచ్చాయి. వాటిలో ‘ముక్కాలా.. ముకాబ్‌లా..’ పాటకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ పాట రికార్డింగ్‌ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.  

శంకర్‌ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా రూపొందిన ‘ప్రేమికుడు’ చిత్రంలోని ఆ పాట విశేషాలను నాగూర్‌బాబు తెలియజేస్తూ ‘నేను ఎప్పటిలాగే పలు స్టూడియోలకు వెళ్లి రికార్డింగ్స్‌లో పాల్గొని సాయంత్రం ఇంటికి వెళుతున్నాను. ఆ సమయంలో రెహమాన్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఒక పాట పాడాల్సి ఉంది రమ్మన్నారు. రెహమాన్‌ జీవన శైలి విభిన్నంగా ఉంటుంది. రాత్రంతా పనిచేసి పగలు నిద్రపోతారు. అందుకే సాయంత్రం ఫోన్‌ చేశారు. నేను రాత్రి 11 గంటలకు స్టూడియోకు వెళ్లాను. అప్పటికి నేను పాడాల్సిన పాటకు లిరిక్స్‌ రెడీ అవ్వలేదు. నన్ను వెయిట్‌ చెయ్యమన్నారు. స్టూడియోకి దగ్గరలో ఉన్న ఓ హోటల్‌కి వెళ్లి టిఫిన్‌ చేసి వచ్చి సోఫాలో కూర్చున్నాను. నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. అర్థరాత్రి ఒంటిగంటకు రెహమాన్‌ నుంచి పిలుపొచ్చింది. నాకు నిద్ర మత్తు వదల్లేదు. అలాగే స్టూడియోలోకి వెళ్లాను. అది మెక్సికన్‌ స్టైల్‌లో ఉండే పాటని, చాలా డిఫరెంట్‌గా పాడాల్సి ఉంటుందని చెప్పారు రెహమాన్‌. ఆ పాటను రకరకాలుగా పాడి వినిపించాను. కానీ, ఏదీ అతనికి నచ్చలేదు. పైగా ఆ పాటకు ఒక కండిషన్‌ కూడా పెట్టారు. ‘మీరు పాట పాడేటపుడు అరిచినట్టు ఉండాలి.. అదే సమయంలో అరిచినట్టు కూడా ఉండకూడదు. మరి ఆలోచించండి ఎలా పాడతారో’ అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. ‘నాకు కొంచెం టైం ఇస్తే టీ తాగి ఆలోచిస్తాను’ అన్నాను. 

బయటికి వచ్చి ఓ హోటల్‌లో టీ తాగుతుండగా దూరం నుంచి ‘షోలే’లో ఆర్‌.డి.బర్మన్‌ పాడిన ‘మెహబూబా.. మెహబూబా’ పాట వినిపించింది. నాకు వెంటనే ఓ ఆలోచన వచ్చింది. స్టూడియోకి వెళ్లి ఆర్‌.డి.బర్మన్‌ని అనుకరిస్తూ గొంతు మార్చి ‘ముక్కాలా.. ముకాబ్‌లా’ పాట పాడాను. అది రెహమాన్‌కి బాగా నచ్చింది. మ్యూజిక్‌ లేకుండా 20 నిమిషాల్లో ఆ పాట పాడేశాను. పది రోజుల తర్వాత ఆ పాట ఫైనల్‌ వెర్షన్‌ వినిపించారు రెహమాన్‌. నేను ఆశ్చర్యపోయాను. ఆయన ఏం మేజిక్‌ చేశారో తెలీదు. వింటున్నప్పుడు అంత అద్భుతంగా అనిపించింది’ అంటూ ఆ పాట వెనుక ఉన్న కథను వివరించారు నాగూర్‌బాబు.