Read more!

English | Telugu

డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ త‌ల్లి అరుదైన కేన్స‌ర్‌తో చ‌నిపోయార‌ని తెలుసా?

 

నిఖిల్ హీరోగా న‌టించిన 'యువ‌త‌'తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై, ఇవాళ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబుతో 'స‌ర్కారువారి పాట' చేసే దాకా ఎదిగిన ప‌ర‌శురామ్ పేట్ల డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌కు క‌జిన్‌. పూరి సొంత బాబాయ్ కొడుకే ప‌ర‌శురామ్‌. త‌ను పుట్టింది విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకి దగ్గర్లోని బాపిరాజు కొత్తపల్లి అనే ఊళ్లో అయినా, పెరిగింది మాత్రం చెర్లోపాలెంలో. ప‌ర‌శురామ్ వాళ్ల‌ నాన్న కో-ఆపరేటివ్‌ బ్యాంకులో చిన్న ఉద్యోగి. వాళ్ల‌కు ఒక పౌల్ట్రీ ఫామ్ కూడా ఉండేది. దాని వ్య‌వ‌హారాల‌ను వాళ్ల‌మ్మ చూసుకొనేవారు.

ఓసారి పౌల్ట్రీ ఫామ్‌కి వైరస్‌ సోకి కోళ్లన్నీ చనిపోయాయి. పెట్టుబడి మొత్తం పోయింది. అప్పటివరకూ ప‌ర‌శురామ్‌తో పాటు వాళ్ల‌క్క కూడా ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకున్నారు. సరిగ్గా డబ్బు పెట్టి పిల్ల‌ల్ని పైచదువులు చదివించాలని అమ్మ‌ ఆశపడ్డ సమయానికి అలా జరిగింది. దాంతో ఆమె కాస్త డీలా పడింది. ప‌ర‌శురామ్‌ ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీయే చదివేట‌ప్పుడు ఓ ఇంటర్నెట్‌ సెంటర్‌లో పార్ట్‌టైమ్‌ పని చేసేవాడు. అలా రోజులు గడుస్తుండగా ఓసారి అమ్మకు ఒంట్లో బాలేదని ఫోన్‌ వస్తే వెళ్లాడు. డాక్టర్లు హెమోగ్లోబిన్‌ తక్కువగా ఉందన్నారు. స్నేహితులతో కలిసి రక్తం ఇచ్చి వచ్చాడు. 

ఓ పదిరోజుల తరవాత మళ్లీ అమ్మకు నీరసంగా ఉందంటే వెళ్లాడు. పరీక్షలు చేయిస్తే ఎక్యూట్‌ బ్లడ్‌ క్యాన్సరని తేలింది. రెండు మూడు నెలలకు మించి బతకడం కష్టమన్నారు. ఆ మాట వినగానే ప‌ర‌శురామ్‌ కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. ఏకంగా చనిపోయేంత జబ్బు అమ్మ‌కు ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. అక్కకు తెలిస్తే తనేదైనా చేసుకుంటుందేమోనన్న భయంతో చెప్పలేదు. నాన్న దగ్గరా ఓ పదిరోజులు దాచిపెట్టాడు. నటుడు జోగినాయుడు వాళ్ల‌ పెద్దమ్మ కొడుకే. అప్ప‌టికి ఝాన్సీ, ఆయ‌నా క‌లిసే ఉన్నారు. ఆ ఇద్ద‌రూ హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. జబ్బు బయటపడిన ఆర్నెల్లకు ప‌ర‌శురామ్ వాళ్ల‌మ్మ చ‌నిపోయారు.

ఆమె పోయిన‌ ఏడాదిలోపే ఉన్న కొద్దిపాటి భూముల్ని అమ్మేసి వాళ్ల‌క్క‌ పెళ్లి చేశారు. తరవాత వాళ్ల నాన్న తెలీని నైరాశ్యంలోకి జారిపోయారు. అలానే గడిపితే త‌నూ డిప్రెషన్‌లోకి వెళ్తానేమోనని భయమేసి ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని హైదరాబాద్‌ వచ్చాడు ప‌ర‌శురామ్‌. అలా మొద‌ట‌ అన్న పూరి జ‌గ‌న్నాథ్ ద‌గ్గ‌ర, త‌ర్వాత ద‌శ‌ర‌థ్‌, వీరు పోట్ల‌, భాస్క‌ర్ లాంటి ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర రైట‌ర్‌గా, అసిస్టెంట్‌గా ప‌నిచేశాడు. 

'మంత్ర' నిర్మాత‌లు ముందుకు రావ‌డంతో నిఖిల్ హీరోగా న‌టించిన‌ 'యువ‌త' మూవీతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌య్యాడు ప‌ర‌శురామ్‌. ఆ సినిమా హిట్‌. త‌ర్వాత ఆంజ‌నేయులు, సోలో, సారొచ్చారు, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు, గీత గోవిందం సినిమాలు తీశాడు. వీటిలో 'సారొచ్చారు' ఒక్క‌టే డిజాస్ట‌ర్‌. మిగ‌తావ‌న్నీ నిర్మాత‌ల‌కు లాభాలు తెచ్చిన‌వే. 'గీత గోవిందం' అయితే బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ఆ సినిమాయే ఇప్పుడు మ‌హేశ్‌తో 'స‌ర్కారువారి పాట‌'ను తీయ‌డానికి కార‌ణ‌మైంది. మే 12న రానున్న ఈ మూవీతో ప‌ర‌శురామ్ మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌నున్న‌డ‌ని అంద‌రూ న‌మ్ముతున్నారు.