Read more!

English | Telugu

నిన్న‌టి హీరోయిన్ ర‌జ‌ని టెన్త్ క్లాస్ కూడా చ‌ద‌వ‌లేదంటే న‌మ్ముతారా?

 

తెలుగు, త‌మిళ భాష‌ల్లో 150 సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించారు అందాల తార ర‌జ‌ని. ఆమె అస‌లు పేరు శ‌శిక‌ళ మ‌ల్హోత్రా. తెలుగులో త‌ను న‌టించిన కాలంలో ఒక్క చిరంజీవి మిన‌హా మిగ‌తా అంద‌రు టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించారామె. ఒక‌ప్పుడు తీరిక లేకుండా కాలం వెంట ప‌రుగులు తీస్తూ షూటింగ్‌ల‌తో బిజీగా గ‌డిపిన ఆమె ఇప్పుడు గృహిణిగా తన ముగ్గురు పిల్ల‌ల ఆల‌నా పాల‌నా ద‌గ్గ‌రుండి చూసుకుంటూ సంతృప్తిక‌ర‌మైన జీవితాన్ని గ‌డుపుతున్నారు. రెండు ద‌శాబ్దాలుగా హైద‌రాబాద్‌లోనే సినిమా వాతావ‌ర‌ణానికి దూరంగా కాలం గ‌డుపుతున్నారు.

ఇంగ్లీష్‌లో అల‌వోక‌గా మాట్లాడే ర‌జ‌ని టెన్త్ క్లాస్ కూడా చ‌ద‌వ‌లేదంటే న‌మ్మాల్సిందే. ఆమె నైన్త్ పాస‌య్యారు. టెన్త్‌కి వెళ్ల‌డానికి ప్రిపేర‌వుతున్న స‌మ‌యంలోనే 1984లో ఆమెకు సినిమా ఆఫ‌ర్ వ‌చ్చింది. అది త‌మిళ సినిమా. టైటిల్‌.. 'ఇళ‌మే కాలందు'. ఆ మూవీలో మోహ‌న్ హీరో. దానికి మ‌ణివ‌ణ్ణ‌న్ డైరెక్ట‌ర్‌. ర‌జ‌నిని ఎక్క‌డో చూసిన ఓ ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ అమ్మాయి బాగుంద‌ని మ‌ణివ‌ణ్ణ‌న్‌కు చెప్పాడు. ఆయ‌న ర‌జ‌ని వాళ్ల‌నాన్న‌కు క‌బురు చేశారు. ఈ ఆఫ‌ర్ ఆమే కాదు, ఆమె త‌ల్లితండ్రులు కూడా ఊహించ‌నిది.

టెన్త్ పూర్తిచెయ్య‌గానే ఆమెకు పెళ్లి చెయ్యాల‌నేది వాళ్ల ఆలోచ‌న‌. అందుకే, "అమ్మాయికి పెళ్లి చెయ్యాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నాం. మీరు అడుగుతున్నారు క‌నుక ఈ విష‌యాన్ని మా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో ఒక‌సారి మాట్లాడి చెప్తాను" అన్నారు ర‌జ‌ని వాళ్ల నాన్న‌. ఇంటికి వ‌చ్చి అంద‌ర్నీ కూర్చోపెట్టి విష‌యం చెప్పారు. ర‌జ‌ని వాళ్ల‌మ్మ ఓ మాట‌న్నారు. "ఏవండీ.. మ‌న‌మ్మాయికి పెళ్ల‌యి పిల్ల‌ల్ని క‌ని అమ్మ‌మ్మో, నాయ‌న‌మ్మో అయిన త‌ర్వాత మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌ను ప‌క్క‌న కూర్చోపెట్టుకొని త‌ను న‌టించిన సినిమా చూడ‌ట‌మ‌న్న‌ది ఓ అద్భుత‌మైన విష‌యం. అందుకే ఈ ఒక్క సినిమా ఒప్పుకుందాం. త‌ర్వాత అవ‌కాశాలు వ‌చ్చినా, రాక‌పోయినా స‌రే." అని ఆమె చెప్ప‌డంతో ఆయ‌న స‌రేన‌న్నారు. అలా మోహ‌న్ స‌ర‌స‌న హీరోయిన్‌గా 'ఇళ‌మే కాలందు'తో సినిమా ఎంట్రీ ఇచ్చారు ర‌జ‌ని.

(మార్చి 1 ర‌జ‌ని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా...)