Read more!

English | Telugu

కార‌వాన్‌లో కూర్చోవాలంటే చిరాకు అనిపించేది.. విజ‌య‌శాంతి మ‌న‌సులో మాట‌!

 

లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి చాలా కాలం త‌ర్వాత మ‌హేశ్‌బాబు సినిమా 'స‌రిలేరు నీకెవ్వ‌రు'లో ఓ కీల‌క పాత్ర‌లో తెర‌మీద క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. 2020లో సంక్రాంతికి వ‌చ్చిన ఆ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. మ‌ళ్లీ ఆమె సినిమాలు రెగ్యుల‌ర్‌గా చేస్తారేమోన‌ని ఆశించిన అభిమానులను నిరుత్సాహ‌ప‌రుస్తూ ఇంత‌దాకా మ‌రో సినిమాని ఆమె ఒప్పుకోలేదు. తాను రెగ్యుల‌ర్‌గా సినిమాలు చేయ‌న‌ని ఆమె తేల్చేశారు. ఎప్పుడ‌న్నా గొప్ప పాత్ర వ‌స్తే అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే చేస్తాన‌ని తెలుగువ‌న్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె స్ప‌ష్టం చేశారు.

కాగా ఇవాళ హీరో హీరోయిన్ల‌తో పాటు పేరున్న ఆర్టిస్టుల‌కు కూడా నిర్మాత‌లు కార‌వాన్‌ను స‌మ‌కూరుస్తున్నారు. దానివ‌ల్ల వారి బ‌డ్జెట్ ఖ‌ర్చు పెరుగుతున్న మాట వాస్త‌వం. అయితే త‌న‌కు కార‌వాన్ అనేది న‌చ్చ‌లేద‌ని విజ‌య‌శాంతి చెప్పారు. "ఇదివ‌ర‌కు యూనిట్ అంతా లైట్‌బాయ్స్ ద‌గ్గ‌ర్నుంచి ఆర్టిస్టుల దాకా అంద‌రం చెట్టుకింద కూర్చొని లంచ్ చేసేవాళ్లం. అంతా ఒక కుటుంబ స‌భ్యుల్లా ఉండేవాళ్లం. మిగ‌తా వాళ్లు ఏం తినేవాళ్లో మేం కూడా అదే తినేవాళ్లం. ఇప్పుడు కార‌వాన్‌లో ఉండాలంటే చాలా చిరాకు అనిపించింది. ఏదో గుహ‌లో గంట‌ల త‌ర‌బ‌డి కూర్చోబెట్టిన‌ట్లు అనిపించేది." అని ఆమె అన్నారు.

బ‌య‌ట కూర్చుంటే చెట్లు, ప‌క్షులు, గాలి ఉంటాయ‌నీ, అంద‌రూ క‌న‌ప‌డ‌తారనీ విజ‌య‌శాంతి చెప్పారు. "మేక‌ప్ వేసుకోవ‌డానికో, డ్ర‌స్ చేంజ్ చేసుకోవ‌డానికో, వాష్ రూమ్‌కో అయితే ఓకే. కానీ గంట‌, రెండు గంట‌ల‌సేపు అదేప‌నిగా కార‌వాన్‌లో కూర్చోవాలంటే బోర్ కొడుతుంది. అవ‌న్నీ నాకు న‌చ్చ‌లేదు. నాకు బ‌య‌ట కూర్చోవాల‌నిపించేది. భోజ‌నం చేసి, మేక‌ప్ అయ్యాక వెంట‌నే సెట్‌కు వ‌చ్చేసేదాన్ని." అని ఆమె తెలిపారు.