Read more!

English | Telugu

'రైతుబిడ్డ‌'పై బ్రిటీష్ వాళ్లు విధించిన నిషేధం స్వాతంత్ర్యానంత‌రం కూడా కొన‌సాగింది!

 

1939లో మొదటిసారి విడుదలైన గూడవల్లి రామబ్రహ్మం చిత్రం 'రైతుబిడ్డ' నిషేధానికి గురయ్యింది. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఈ చిత్రాన్ని అప్పుడు నిషేధించారు. అయితే స్వతంత్రం వచ్చాక కూడా కృష్ణాజిల్లాలో ఈ సినిమాపై నిషేధం కొనసాగడం శోచనీయం. 1947 నవంబర్‌లో ఉయ్యూరులోని శ్రీ ఏకాంబరేశ్వర పిక్చర్ ప్యాలెస్ యజమాని అప్పటి కృష్ణా జిల్లా కెలెక్టర్ వద్దకు వెళ్లి 'రైతుబిడ్డ' సినిమాని ప్రదర్శించడానికి అనుమతి కోరాడు. 'రైతుబిడ్డ'పై ఇంకా నిషేధం ఉంది కాబట్టి దాన్ని ప్రదర్శించేందుకు వీలు లేదని కలెక్టర్ ఖరాఖండీగా చెప్పారు. 

జమీందారుల పాలన కింద రైతుబిడ్డలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు  చూపించారు డైరెక్ట‌ర్ రామబ్రహ్మం. దేశానికి స్వతంత్రం వచ్చినా, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడినా, అప్పటికే జమీందారీ వ్యవస్థ రద్దవడానికి ఏర్పాట్లు జరుగుతున్నా, 'రైతుబిడ్డ'లాంటి అభ్యుదయ సినిమాపై బ్రిటీష్ కాలంలో పెట్టిన నిషేధాన్ని వెంటనే తొలగించకపోవడం మన బానిస మనస్తత్వానికి నిదర్శనమూ, సిగ్గుచేటు విషయంగా అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఎప్పటికో ఆ నిషేధాన్ని తొలగించారు. ఏదేమైనా నిషేధానికి గురైన మొట్టమొదటి తెలుగు సినిమాగా 'రైతుబిడ్డ' చరిత్రపుటల్లో చోటు దక్కించుకుంది.

బ‌ళ్లారి రాఘ‌వాచార్య‌, ప‌ద్మావ‌తీదేవి, చెరుకుప‌ల్లి ఎల్లాప్ర‌గ‌డ నెహ్రూ, సుంద‌ర‌మ్మ‌, గిడుగు వెంక‌ట సీతాప‌తిరావు, టంగుటూరి సూర్య‌కుమారి, కొస‌రాజు రాఘ‌వ‌య్య చౌద‌రి, గంగార‌త్నం, నెల్లూరు నాగ‌రాజారావు, భీమ‌వ‌ర‌పు న‌ర‌సింహారావు, ఎం.సి. రాఘ‌వ‌న్‌, పి. సూరిబాబు లాంటి అప్ప‌టి ప్ర‌ముఖ రంగ‌స్థ‌ల న‌టులు న‌టించిన ఈ మూవీకి తాపీ ధ‌ర్మారావు, త్రిపుర‌నేని గోపీచంద్‌, మ‌ల్లాది విశ్వ‌నాథ క‌విరాజు సంభాష‌ణ‌లు రాశారు. బ‌స‌వ‌రాజు అప్పారావు, స‌ముద్రాల రాఘ‌వాచార్య‌, కొస‌రాజు, తుమ్మ‌ల సీతారామ‌మూర్తి, నెల్లూరు వెంక‌ట‌రామానాయుడు, గూడ‌వ‌ల్లి రామ‌బ్ర‌హ్మం, తాపీ ధ‌ర్మారావు రాసిన పాట‌ల‌కు భీమ‌వ‌ర‌పు న‌ర‌సింహారావు స్వ‌రాలు కూర్చారు. సార‌థీ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నిర్మాణ‌మైన 'రైతుబిడ్డ' సినిమా 1939 ఆగ‌స్ట్ 27న విడుద‌లైంది.