English | Telugu

డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌ ఏం చదువుకున్నారో తెలిస్తే షాక్‌ అవుతారు!

(జూలై 27 సాయికుమార్‌ పుట్టినరోజు సందర్భంగా..)

సాయికుమార్‌.. ఈ పేరు వింటే మనకు గుర్తొచ్చేది.. ఆవేశపూరితంగా డైలాగులు చెప్పే ఓ కంచుకంఠం. తన గాత్రంతో తెలుగు వారినే కాదు, కన్నడ ప్రేక్షకుల్ని సైతం మెస్మరైజ్‌ చేశారు సాయికుమార్‌. అచ్చమైన తెలుగు, స్పష్టమైన ఉచ్ఛారణ సాయికుమార్‌ ప్రత్యేకత. సుమన్‌, రాజశేఖర్‌ వంటి హీరోలు సాయికుమార్‌ గాత్రంతోనే స్టార్స్‌గా ఎదిగారు. డైలాగ్‌ కింగ్‌గా పేరు తెచ్చుకున్న సాయి.. మొదట డబ్బింగ్‌ ఆర్టిస్టుగా రాణించారు. ఆ తర్వాత నటుడిగా కూడా ఎన్నో విభిన్నమైన పాత్రలు, పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌ చేశారు. ఇండస్ట్రీలోని అందరు హీరోలూ అతన్ని ‘సాయి..’ అని ప్రేమగా పిలుస్తారు. దాదాపు 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సాయికుమార్‌.. అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు.

1960 జూలై 27న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో పూడిపెద్ది జోగేశ్వరశర్మ, కృష్ణజ్యోతి దంపతులకు జన్మించారు సాయికుమార్‌. ఈయనకు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మహాకవి శ్రీశ్రీ, ఆరుద్ర వీరికి బంధువులు. సినిమా ఇండస్ట్రీలో పి.జె.శర్మగా పాపులర్‌ అయిన పూడిపెద్ది జోగేశ్వరశర్మ.. 500కి పైగా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఎన్నో సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు. తల్లి కృష్ణజ్యోతి కూడా చాలా కన్నడ సినిమాల్లో రాజ్‌కుమార్‌ వంటి హీరోల సరసన నటించారు. అయితే పి.జె.శర్మను వివాహం చేసుకున్న తర్వాత నటనకు స్వస్తి చెప్పారు. తల్లి ప్రోత్సాహంతో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన తన కంఠాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సాయికుమార్‌ పూర్తిగా సక్సెస్‌ అయ్యారు.

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ అవ్వాలని కాకుండా తను ఐఎఎస్‌ అవ్వాలని చిన్నతనం నుంచీ అనుకునేవారు సాయికుమార్‌. పబ్లిక్‌ రిలేషన్స్‌లో డిగ్రీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ చేశారు. అలాగే పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఎం.ఫిల్‌ చేశారు. మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో ఆరు నెలలపాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అలాగే ఎన్‌.సి.సి. చేరి ఢల్లీిలో, విదేశాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఒక ఎరువుల కంపెనీకి వాయిస్‌ ఓవర్‌ కావాలని చెప్పడం, తల్లి ప్రోత్సాహంతో ఆ యాడ్‌కి వాయిస్‌ ఇవ్వడం ద్వారా తన డబ్బింగ్‌ కెరీర్‌ని ప్రారంభించారు సాయికుమార్‌. ఆ తర్వాత సినిమాలకు డబ్బింగ్‌ చెప్పడం మొదలుపెట్టి డబ్బింగ్‌ ఆర్టిస్టుగా బిజీ అయిపోయారు. దాదాపు 1000కి పైగా సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు సాయికుమార్‌. రజినీకాంత్‌, సుమన్‌, రాజశేఖర్‌, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌కాంత్‌, మమ్ముట్టి, మోహన్‌లాల్‌, శరత్‌కుమార్‌, అర్జున్‌.. వంటి హీరోలకు డబ్బింగ్‌ చెప్పి వారు నటించిన సినిమాలు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

నటన విషయానికి వస్తే పదహారేళ్ళ వయసులోనే బాపు దర్శకత్వంలో వచ్చిన ‘స్నేహం’ చిత్రంలో రాజాకృష్ణతో కలిసి నటించారు సాయికుమార్‌. ఆ తర్వాత చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. అయితే నటుడిగా తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో 1990 ప్రాంతంలో తమిళ, కన్నడ రంగాల్లో ప్రయత్నాలు ప్రారంభించారు. కన్నడతోపాటు తమిళ్‌లోనూ సాయికుమార్‌కి మంచి అవకాశాలు వచ్చాయి. కన్నడలో హీరోగా, సెకండ్‌ హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా దాదాపు 15 సినిమాల్లో నటించిన తర్వాత థ్రిల్లర్‌ మంజు దర్శకత్వంలో రూపొందిన ‘పోలీస్‌ స్టోరీ’ చిత్రం చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో సాయికుమార్‌ పోషించిన అగ్ని క్యారెక్టర్‌కి విపరీతమైన పేరు వచ్చింది. కన్నడలోనే కాదు, తెలుగులోనూ ఈ సినిమా భారీ విజయం సాధించి ఒక్కసారిగా సాయికుమార్‌కు స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చింది. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటిచారు. తెలుగులో స్వర్ణముఖి, కొడుకులు, అతను, ఏ.కె.47 సినిమాల్లో హీరోగా నటించారు. తల్లి కృష్ణజ్యోతి పేరుమీద బ్యానర్‌ నెలకొల్పి, సొంతగా ‘ఈశ్వర్‌ అల్లా’ చిత్రం నిర్మించారు. అయితే ఇవేవీ సాయికుమార్‌కు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ని ఇవ్వలేకపోయాయి. ఆ తర్వాత కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. దక్షిణాది భాషల్లో ఎక్కడ అవకాశం వచ్చినా వదులుకోకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. బుల్లితెరపై కూడా తనదైన శైలిలో కొన్ని షోలు నిర్వహిస్తున్నారు.

ఇక సాయికుమార్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే.. అతని సోదరుడు రవిశంకర్‌ కూడా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. మరో సోదరుడు అయ్యప్ప శర్మ నటుడిగా రాణిస్తున్నారు. సాయికుమార్‌ వివాహం సురేఖతో జరిగింది. వీరి కుమారుడు ఆది 2011లో వచ్చిన ‘ప్రేమ కావాలి’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలతో ఆది హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. కర్ణాటకలో తనకు వున్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని రెండుసార్లు బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు సాయికుమార్‌. తెలుగులో సామాన్యుడు, ప్రస్థానం చిత్రాల్లో కనబరిచిన నటనకుగాను ఉత్తమ విలన్‌గా, సహాయ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. అలాగే ఫిలింఫేర్‌, ఐఫా, సినీమా అవార్డులు, సైమా అవార్డులు కూడా సాయికుమార్‌ను వరించాయి.