English | Telugu

బి.విఠలాచార్య ఇచ్చిన సలహాతో నవరస నటనాసార్వభౌమగా ఎదిగిన కైకాల!

(జూలై 25 కైకాల సత్యనారాయణ జయంతి సందర్భంగా..)

నవరసాలు పోషించగల సమర్థత ఉన్న నటులు చిత్ర పరిశ్రమలో కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. వారిలో ఎస్‌.వి.రంగారావు తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న నటుడు కైకాల సత్యనారాయణ. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరించారు కైకాల. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గానే కాకుండా కరుణరసాన్ని అద్భుతంగా పండిరచి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు. నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు కైకాల సత్యనారాయణకు మాత్రమే లభించింది. ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేసేందుకు అన్నివిధాలా కృషి చేసే కైకాల చిత్రరంగానికి ఎలా వచ్చారు, ఆయనను నటుడిగా నిలబెట్టి సినిమాలేంటి, ఆయన కెరీర్‌ ఎలా కొనసాగింది అనే విషయాలు తెలుసుకుందాం.

1935 జూలై 25న కృష్ణాజిల్లాలోని కౌతరం గ్రామంలో లక్ష్మీనారాయణ, సీతారావమ్మ దంపతులకు జన్మించారు కైకాల సత్యనారాయణ. ఆయన పాఠశాల విద్య గుడ్లవల్లేరులో, ఇంటర్మీడియట్‌ విజయవాడలో, డిగ్రీ గుడివాడలో పూర్తి చేశారు. చిన్నతనం నుంచి నటన పట్ల ఎంతో ఆసక్తిని పెంచుకున్న కైకాల.. చదువుకుంటూనే నాటకాల్లో నటించేవారు. ఆయన డిగ్రీ చదువుతుండగా ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే తాను డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే సినిమా రంగానికి వస్తానని ఆ నిర్మాతకు చెప్పారు. డిగ్రీ పూర్తయిన తర్వాత మద్రాస్‌ వెళ్లి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ, ఎవరూ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అలా సంవత్సరంపాటు ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగారు. చివరికి సిపాయి కూతురు చిత్రంలో ప్రధాన పాత్ర ఇచ్చారు నిర్మాత డి.ఎల్‌.నారాయణ. ఈ సినిమా తర్వాత కైకాలకు మరో సినిమా రాలేదు.

చిత్ర పరిశ్రమలో హీరోలు చాలా మంది ఉన్నారు. విలన్లు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి విలన్‌గా నటిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని కైకాలకు సలహా ఇచ్చారు దర్శకుడు బి.విఠలాచార్య. 1960లో తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కనకదుర్గ పూజా మహిమ చిత్రంలో కైకాలకు తొలిసారి విలన్‌ పాత్ర ఇచ్చారు బి.విఠలాచార్య. అది ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చింది. అదే సంవత్సరం కోటేశ్వరమ్మతో కైకాల సత్యనారాయణ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కనకదుర్గ పూజా మహిమ చిత్రం తర్వాత కైకాల విలన్‌గా స్థిరపడిపోయారు. హీరో ఎవరైనా విలన్‌గా కైకాలనే తీసుకునేవారు. అలా విలన్‌గా చేస్తూనే కొన్ని సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించారు. ఆయన కెరీర్‌లో మొత్తం 13 సినిమాల్లో హీరోగా కనిపించారు.

1964లో వచ్చిన రాముడు భీముడు చిత్రంలో ఎన్‌.టి.రామారావు తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు డూప్‌గా కైకాల నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ డూయల్‌ రోల్‌ చేసిన సినిమాలన్నింటిలోనూ కైకాల డూప్‌గా నటించేవారు. తన కెరీర్‌ ప్రారంభంలోనే ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలరు అనే పేరు కైకాలకు వచ్చింది. అంతకుముందు ఎస్‌.వి.రంగారావు పోషించిన భీమ, రావణ, దుర్యోధన, ఘటోత్కచ పాత్రల్ని ఎంతో గొప్పగా పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. యమగోల, యమలీల వంటి సినిమాల్లో యముడిగా నటించి ఆ పాత్ర పోషించడంలో తనకు తనే సాటి అని నిరూపించుకున్నారు కైకాల.

ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు..ఇలా అందరు హీరోల సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అద్భుతమైన పాత్రలు పోషించారు కైకాల. ఆ తర్వాతి తరం అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, మోహన్‌బాబు సినిమాల్లో కూడా ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించారు. ఆ తర్వాతి తరం హీరోల సినిమాల్లోనూ వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఏ పాత్ర చేసినా దానికి పూర్తి న్యాయం చేసేవారు కైకాల.

నటుడిగానే కాకుండా తన సోదరుడు కైకాల నాగేశ్వరరావుతో కలిసి రమా ఫిలింస్‌ పతాకంపై ఇద్దరు దొంగలు, కొదమసింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలు నిర్మించారు. బంగారు కుటుంబం.. ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుచుకుంది. 55 ఏళ్ళ సినీ కెరీర్‌లో దాదాపు 800 సినిమాల్లో అన్నిరకాల పాత్రలు పోషించి పరిపూర్ణ నటుడు అనిపించుకున్నారు కైకాల సత్యనారాయణ. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. అలాగే ఫిలింఫేర్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కూడా ఆయన్ని వరించింది. ఇవి కాక వివిధ సంస్థలు కైకాలకు పలు పురస్కారాలు అందించాయి. ఆరోగ్య కారణాల రీత్యా 2013 తర్వాత నటనకు దూరంగా ఉన్నారు. చాలా గ్యాప్‌ తర్వాత 2019లో వచ్చిన ఎన్‌.టి.ఆర్‌.కథానాయకుడు చిత్రంలో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం అదే సంవత్సరం వచ్చిన మహర్షి. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 2022 డిసెంబర్‌ 23న తుది శ్వాస విడిచారు కైకాల సత్యనారాయణ.