English | Telugu
కృష్ణవంశీ తన 30 ఏళ్ళ కెరీర్‌లో 20 సినిమాలే చేయడం వెనుక రీజన్ ఇదే!
Updated : Jul 27, 2025
డైరెక్టర్‌గా 30 సంవత్సరాల కెరీర్.. చేసిన సినిమాలు 20 మాత్రమే. ఒకే తరహా సినిమాలు చేసే డైరెక్టర్ అనే ముద్ర పడకుండా ప్రతి సినిమా విభిన్నంగా ఉండేలా చూసుకునే డైరెక్టర్. సినిమా అంటే ప్రజలను ఎంతో కొంత చైతన్య పరిచేదిగా ఉండాలని నమ్మే డైరెక్టర్. అతనే కృష్ణవంశీ. తన కెరీర్‌లో చేసిన సినిమాలు ఒకదాన్ని పోలి మరొకటి ఉండదు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి డైరెక్టర్లు చాలా అరుదుగా ఉంటారు. స్టార్స్‌తో సినిమాలు చెయ్యాలని, కమర్షియల్ హిట్స్ సాధించాలని కృష్ణవంశీ ఏరోజూ అనుకోలేదు. అంతేకాదు, లెక్కకు మించిన సినిమాలు చెయ్యాలన్న ఆలోచన కూడా అతనికి లేదు. ఇంతటి వైవిధ్యమైన ఆలోచనలు ఉన్న కృష్ణవంశీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, డైరెక్టర్‌గా మారేందుకు ఎలాంటి కృషి చేశారు అనేది తెలుసుకుందాం.
1962 జూలై 28న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు కృష్ణవంశీ. అతని అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. చిన్నతనం నుంచి సినిమాలంటే ఎక్కువ ఆసక్తి చూపించేవారు. ప్రతిరోజూ సినిమాలు చూసేవారు. ఇంటర్మీడియట్‌కి వచ్చిన తర్వాత తను సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తండ్రితో చెప్పారు. కానీ, డిగ్రీ పూర్తి చేసిన తర్వాత చూద్దాం అని తండ్రి చెప్పడంతో కష్టపడి చదివారు. ఆ తర్వాత తండ్రి బలవంతం మీదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు. అయినా సినిమాల్లోకి వెళ్లడానికి తండ్రి ఒప్పుకోకపోవడంతో ఒకరోజు ఇంటిలో చెప్పకుండా మద్రాస్ రైలెక్కేశారు వంశీ. ఆ తర్వాత అతని ఆచూకీ తెలుసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేశారు తండ్రి. సినిమా ఫీల్డ్‌కే వెళతానని వంశీ పట్టు పట్టడంతో ఆయన కూడా ఒప్పుకున్నారు.
తనకు తెలిసిన వారి ద్వారా వంశీని పి.ఎస్.ప్రకాష్ దగ్గరికి పంపారు తండ్రి. ఇండస్ట్రీకి వెళ్లాలనే ఆలోచనే తప్ప అక్కడ ఏం చెయ్యాలి అనే విషయంలో వంశీకి క్లారిటీ లేదు. కెమెరా డిపార్ట్‌మెంట్‌లో చేస్తానని చెప్పడంతో అతన్ని లైట్‌బోయ్‌గా తీసుకున్నారు. అలా రెండు సంవత్సరాలు పనిచేశారు. అక్కడే బ్రహ్మాజీ పరిచయమయ్యారు. ఆ సమయంలోనే రామ్‌గోపాల్‌వర్మ శివ సినిమా చేస్తున్నారని తెలుసుకొని ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో చేరారు వంశీ. చాలా తక్కువ సమయంలోనే వర్మకు బాగా దగ్గరయ్యారు. శివ తర్వాత వర్మ చేసిన చాలా సినిమాలకు కృష్ణవంశీ అసోసియేట్‌గా పనిచేశారు. అంతకుముందు వంశీకృష్ణ అని వున్న అతని పేరును కృష్ణవంశీగా మార్చారు వర్మ. అతనిలోని టాలెంట్ గుర్తించిన వర్మ.. అనగనగా ఒకరోజు సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. రెండు షెడ్యూల్స్ పూర్తయిన తర్వాత బడ్జెట్ బాగా పెరిగిపోతోందని గ్రహించిన వర్మ.. అతన్ని తప్పించి తనే దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. అయినా బాధపడని వంశీ ఆ సినిమాకే అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
అనగనగా ఒకరోజు విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత గులాబి కథ రెడీ చేసుకొని చాలా మంది నిర్మాతలకు వినిపించారు వంశీ. ఈ విషయం తెలుసుకున్న వర్మ.. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో కలిసి వర్మ క్రియేషన్స్ బేనర్‌లో సినిమా చెయ్యమని ఆఫర్ ఇచ్చారు. అలా గులాబి చిత్రంతో కృష్ణవంశీ డైరెక్టర్ అయ్యారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. వంశీ టేకింగ్ చూసిన నాగార్జున.. కథ రెడీచేస్తే సినిమా చేద్దాం అన్నారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక కథ వినిపించారు వంశీ. నాగార్జున కూడా ఒకే చెప్పారు. గులాబీ చిత్రానికి డైరెక్టర్‌గా మంచి పేరు వచ్చినప్పటికీ.. అందరూ వర్మలా అద్భుతంగా తీశావు అని అప్రిషియేట్ చెయ్యడంతో తన పంథా మార్చుకోవాలని డిసైడ్ అయి నాగార్జునకు నిన్నే పెళ్లాడతా సబ్జెక్ట్ చెప్పారు. అలా నాగార్జున, కృష్ణవంశీ కాంబినేషన్‌లో నిన్నే పెళ్లాడతా ప్రారంభమైంది. అప్పటి వరకు నాగార్జున చేసిన సినిమాలకు భిన్నంగా ఉండడంతో నిన్నే పెళ్లాడతా సినిమాకి ఘనవిజయాన్ని అందించారు ప్రేక్షకులు.
మొదటి రెండు సినిమాలు సూపర్‌హిట్ కావడంతో కృష్ణవంశీకి డైరెక్టర్‌గా చాలా మంచి పేరు వచ్చింది. తను అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ఎంతో సహాయం చేసిన బ్రహ్మాజీతో ఒక సినిమా చెయ్యాలనుకున్నారు వంశీ. పేపర్‌లో వచ్చిన ఒక వార్తను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని సిందూరం కథను సిద్ధం చేశారు. బ్రహ్మాజీ, రవితేజ హీరోలుగా ఆంధ్రా టాకీస్ అనే బేనర్‌ను స్థాపించి సొంతంగా ఆ సినిమా చేశారు. మంచి సినిమా అనే ప్రశంసలు, అవార్డులు అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. ఈ సినిమా తర్వాత మళ్ళీ నాగార్జునతోనే చంద్రలేఖ చేశారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత చేసిన అంత:పురం కృష్ణవంశీకి చాలా గొప్ప పేరు తెచ్చింది. ఆ తర్వాత చేసిన సముద్రం కూడా విజయం సాధించింది.
ఆ సమయంలోనే మహేష్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. అప్పటివరకు రాజకుమారుడు, యువరాజు, వంశీ చిత్రాలు చేసిన మహేష్‌కు మురారి చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చారు కృష్ణవంశీ. 2002లో అంత:పురం చిత్రాన్ని శక్తి.. ది పవర్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. కానీ, బాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించలేదు. కృష్ణవంశీ హిందీలో చేసిన సినిమా ఇదొక్కటే. అదే సంవత్సరం శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రల్లో వంశీ తెరకెక్కించిన ఖడ్గం సంచలన విజయం సాధించింది. దేశభక్తిని ప్రబోధించే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆగస్ట్ 15, జనవరి 26కి ఈ సినిమాను టీవీలో ప్రసారం చేస్తుంటారు. ఈ సినిమా తర్వాత డేంజర్, రాఖీ, చందమామ, శశిరేఖా పరిణయం, మహాత్మ, మొగుడు, పైసా, గోవిందుడు అందరివాడేలే, నక్షత్రం వంటి సినిమాలు చేశారు. అందులో రాఖీ, చందమామ మాత్రమే విజయం సాధించాయి.
2017లో చేసిన నక్షత్రం చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూడడంతో కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు కృష్ణవంశీ. ఆరేళ్ళ గ్యాప్ తర్వాత 2023లో మరాఠీలో విష్ణు వామన్ రచించిన నటసామ్రాట్ అనే నాటకం ఆధారంగా రంగమార్తాండ చిత్రాన్ని రూపొందించారు. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. గులాబి చిత్రంతో కృష్ణవంశీకి అభిమానిగా మారిపోయారు రమ్యకృష్ణ. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అలా ఏడు సంవత్సరాలపాటు ప్రేమలో మునిగి తేలిన వీరిద్దరూ 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. పెళ్లి తర్వాత కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు రమ్యకృష్ణ. వాటిలో బాహుబలిలో పోషించిన శివగామి పాత్ర ఆమెకు గొప్ప పేరు తీసుకొచ్చింది. కృష్ణవంశీకి రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే ఎంతో అభిమానం. అతను డైరెక్ట్ చేసిన చాలా సినిమాలకు సీతారామశాస్త్రి పాటలు రాశారు. ఆయన్ని తన తండ్రిగా భావించేవారు వంశీ. ఆయన కూడా వంశీని కొడుకులాగే చూసేవారు. అంతేకాదు, చట్టపరంగా కాకుండా హిందూ సాంప్రదాయ పద్ధతిలో కృష్ణవంశీని దత్తత చేసుకున్నారు సీతారామశాస్త్రి.
(జూలై 28 దర్శకుడు కృష్ణవంశీ పుట్టినరోజు సందర్భంగా..)