Read more!

English | Telugu

‘ఛత్రపతి’ అనే టైటిల్‌ పెట్టింది.. ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అని మీకు తెలుసా?

సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్లు ఒక పట్టాన సెట్‌ అవ్వవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక అవాంతరం వల్ల అనుకున్న ప్రాజెక్ట్‌ వెనక్కి వెళ్లిపోతుంటుంది. ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమాకి కూడా అలాగే జరిగింది. వీరిద్దరి కాంబినేషన్‌లో 2005లో ‘ఛత్రపతి’ వంటి బ్లాక్‌బస్టర్‌ వచ్చింది. అయితే ఆ కాంబినేషన్‌ వెనుక కొన్ని సంవత్సరాల నిరీక్షణ ఉంది. రాజమౌళి మొదటి సినిమా ‘స్టూడెంట్‌ నెం.1’ 2001లో విడుదలైంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు. అప్పటికే ప్రభాస్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిసి అతనితో సినిమా చెయ్యాలని ప్రయత్నించాడు. కానీ, అది జరగలేదు. జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘ఈశ్వర్‌’ ప్రారంభమైంది. ఆ తర్వాత 2003లో రాజమౌళి ‘సింహాద్రి’ చేశాడు. దాని తర్వాతైనా ప్రభాస్‌తో సినిమా చేద్దామనుకున్నాడు. అప్పుడూ కుదరలేదు. ప్రభాస్‌ 5 సినిమాలు హీరోగా చేసిన తర్వాతగానీ రాజమౌళి వంతు రాలేదు. 

నిర్మాత భోగవల్లి ప్రసాద్‌.. రాజమౌళి కుటుంబానికి చాలా సన్నిహితుడు. డైరెక్టర్‌గా మెల్లగా ఎదుగుతున్న రాజమౌళితో సినిమా చెయ్యాలనుకున్నాడు. ఒక పక్క ప్రభాస్‌తో రాజమౌళి సినిమా ప్లాన్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో భోగవల్లి ప్రసాద్‌కి ఈ సినిమా నిర్మించే అవకాశం వచ్చింది. ఆమధ్యకాలంలో తల్లీ కొడుకుల మధ్య సెంటిమెంట్‌తో సినిమా రాలేదు. అలాంటి కథ ఒకటి రెడీ చెయ్యమని తండ్రి విజయేంద్రప్రసాద్‌తో చెప్పాడు రాజమౌళి. ఆ సెంటిమెంట్‌తో ఎలాంటి కథ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు విజయేంద్రప్రసాద్‌. ఒకరోజు రాత్రి నిద్రపట్టక అలా ఆలోచిస్తున్నాడు. 1988లో అతను ఒక వీడియో క్యాసెట్‌ ద్వారా చూసిన ‘స్కార్‌ఫేస్‌’ సినిమా గుర్తొచ్చింది. అందులోని సెంటిమెంట్‌ అతనికి బాగా నచ్చింది. ప్రభాస్‌, రాజమౌళి సినిమాకి ఓ స్టోరీ ఐడియా వచ్చింది. వెంటనే నిద్రపోతున్న భార్యను లేపి తను అనుకున్న కథని వినిపించి పడుకున్నాడు. అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. అతని భార్య మాత్రం ఆ స్టోరీ గురించే ఆలోచిస్తోంది. అందులోని సెంటిమెంట్‌ ఆమెకు కన్నీళ్ళు తెప్పించింది. మరుసటి రోజు ఆఫీస్‌లోని వారికి ఈ కథను వినిపించాడు విజయేంద్రప్రసాద్‌. పద్మాలయా స్టూడియోలో డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న గోపి అక్కడే ఉన్నాడు. ఆ స్టోరీ విన్నాడు. ‘భలే స్టోరీ సార్‌.. చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి ‘ఛత్రపతి’ అనే టైటిల్‌ పెట్టండి బాగుంటుంది’ అని సలహా ఇచ్చాడు. 

ఛత్రపతి శివాజీకి అతని తల్లి ధైర్యాన్ని నూరిపోసి వీరుడిగా నిలబెట్టింది. విజయేంద్రప్రసాద్‌ చెప్పిన కథలో కూడా తల్లే కొడుకుకి ఛత్రపతి గురించి, అతని సాహసాల గురించి చెబుతుంది. అది కొడుకు మనసులో ఓన్‌స్పిరేషన్‌గా నిలిచింది. రాజమౌళికి కూడా కథ నచ్చింది. సినిమా ప్రారంభించారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ సెట్‌ అయ్యారు. ఓ పక్క మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాలోని ‘ఎ వచ్చి ’బి‘పై వాలే..’ పాటను బాలీవుడ్‌ సింగర్‌ అద్నన్‌ సామితో పాడిరచాలనుకున్నారు. దానికి తగ్గట్టు ట్యూన్‌ కూడా చేశారు. కానీ, ఆ టైమ్‌లో అద్నన్‌ అమెరికాలో ఉండడంతో కీరవాణి పాడిన ట్రాక్‌నే ఉంచేశారు. సినిమా ఔట్‌పుట్‌ బాగా వచ్చింది. దానికి తగ్గట్టుగానే బడ్జెట్‌ రూ. 12.5 కోట్లకు చేరుకుంది. సినిమా రిలీజ్‌ అయింది. మొదట డివైడ్‌ టాక్‌ వచ్చినా మెల్లగా పుంజుకొని సిల్వర్‌ జూబ్లీ మూవీగా రికార్డు క్రియేట్‌ చేసి 54 కేంద్రాల్లో ‘ఛత్రపతి’ 100 రోజులు ప్రదర్శితమైంది. 

ఈ కథ విని ఒక్కమాటలో ‘ఛత్రపతి’ అనే టైటిల్‌ పెట్టండి బాగుంటుంది అని చెప్పిన గోపి ‘ఛత్రపతి’ రిలీజ్‌ కావడానికి ముందే చనిపోయాడు. ఒక మంచి కథకు అద్భుతమైన టైటిల్‌ చెప్పిన గోపికి కొంత ఆర్థిక సాయం చెయ్యాలనుకుంది ‘ఛత్రపతి’ యూనిట్‌. కానీ, అతను చనిపోయాడని తెలుసుకొని షాక్‌ అయ్యారు విజయేంద్రప్రసాద్‌. అతని కుటుంబానికైనా సాయం చెయ్యాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ, అతని కుటుంబం ఎక్కడ ఉంది అనే విషయం ఇప్పటివరకు తెలియలేదట.