English | Telugu
అక్కినేని, చిరంజీవిలతో దాసరి నారాయణరావు విభేదించడానికి అసలు కారణం ఇదే!
Updated : Jan 29, 2024
150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి నిజమైన దర్శకుడికి నిదర్శనంగా చెప్పుకునే దర్శకరత్న డా.దాసరి నారాయణరావు టాలీవుడ్‌లోని టాప్ హీరోలందరితో సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావుకి ఎవర్‌గ్రీన్ హిట్స్ అందించారు దాసరి. ఇక మెగాస్టార్ చిరంజీవితో ‘లంకేశ్వరుడు’ అనే ఒకే ఒక్క సినిమా చేయడం గమనార్హం. తెలుగు తెరకు ఎంతో మంది నటీనటులను, టెక్నీషియన్స్‌ని పరిచయం చేసిన ఘనత కూడా దాసరిదే. అలాంటి దాసరినారాయణరావు కొందరితో విభేదాలు ఉన్నాయంటే అందరికీ ఆశ్చర్యం కలగక మానదు.
డా. అక్కినేనితో విభేదాలు వచ్చిన కారణంగా ఎన్నో సంవత్సరాలు ఇద్దరి మధ్యా మాటలు లేవు. ఇద్దరూ చనిపోయేంత వరకు ఒకరినొకరు పలకరించుకోలేదు. అంతగా వారి మధ్య అగాధం ఏర్పడడానికి కారణం ఏమిటి అనేది మొదట్లో తెలియదు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో దాసరి నారాయణరావు వారి మధ్య వివాదానికి కారణమైన అంశాన్ని ప్రస్తావించారు. తమ మధ్య ఎలాంటి ఛాలెంజెస్ లేవని, ఒక చిన్న మాట పట్టింపు వల్ల ఆ పరిస్థితి వచ్చిందని వివరించారు. ఒక విషయంలో తనకు సహకరించని కారణంగా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తన వరకు తనకు ఎంతో చేశాననే ఫీలింగ్ ఉంటుందని, దాన్ని దెబ్బ తీసేవిధంగా అక్కినేని ప్రవర్తించడం బాధ కలిగించిందని అన్నారు. వద్దు అనుకున్నానని, అందుకే తమ మధ్య మాటలు లేవని తెలిపారు. అంతే తప్ప మరో కారణం అంటూ ఏమీ లేదని, నిజానికి తన అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావేనని దాసరి పలు మార్లు చెప్పారు.
ఇక చిరంజీవితో చేసింది ఒకటే సినిమా. కానీ, ఆయనతోనూ అప్పట్లో విభేదాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై వివరణ ఇచ్చిన దాసరి.. ‘చిరంజీవి ఇంత ఉన్నతమైన స్థాయికి రావడానికి పరోక్షంగా నా సహకారం ఎంత ఉందో అతనికి కూడా తెలుసు. ప్రతి విషయంలోనూ నేను అతనికి సపోర్ట్‌గానే ఉన్నాను. ఒకసారి ఒక సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్‌లో 1 నుంచి 10 వరకు చిరంజీవే అని ప్రకటించాను. నిజానికి అది ఎంత తప్పు. ఒకటి నుంచి పది వరకు చిరంజీవే అంటే మిగతా వారు ఏమైపోవాలండీ. అలాంటి చిరంజీవికి, నాకు మధ్య విభేదాలు రావడానికి కారణం నేను ముఖ్య పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన ‘మేస్త్రి’ చిత్రం. ఆ సినిమాను చిరంజీవిని దృష్టిలో పెట్టుకునే నేను తీసానని అందరూ విమర్శించారు. కానీ, అది నిజం కాదు.
‘నేను ఆ సమయంలో కాంగ్రెస్‌లో ఉన్నాను. ఎలక్షన్స్‌కి సంబంధించిన మీటింగ్స్ జరిగినపుడు ఇతర పార్టీలను విమర్శించడం సర్వసాధారణం. నేనూ అలాగే చేశాను. అంతకు మించి మరే ఉద్దేశమూ లేదు. టిడిపి పార్టీని విమర్శిస్తే.. చంద్రబాబును విమర్శించాలి, పిఆర్‌పిని విమర్శిస్తే చిరంజీవిని విమర్శించాలి. అందువల్ల అతని ప్రస్తావన వచ్చింది. అంతే తప్ప మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు’ అన్నారు.