Read more!

English | Telugu

ఎగతాళి చేసిన ఫ్రెండ్‌తో ఛాలెంజ్‌ చేసి హీరో అయ్యాడు.. 400 సినిమాల్లో నటించాడు!

సినిమాలు చేయాలని, నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అవకాశాల కోసం పడరాని పాట్లు పడతారు. ఏదో ఒకరోజు వారిని అదృష్టం వరిస్తుంది. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ నటుడిగా రాణిస్తారు. ఆ తర్వాత లెక్కకు మించిన సినిమాలు చేస్తారు. నటుడిగా లేదా నటిగా టాప్‌ పొజిషన్‌కి వచ్చిన తర్వాత ‘నేను యాక్టర్‌ కావాలని అనుకోలేదు.. యాక్సిడెంటల్‌గా జరిగింది’ అని చెప్పడం మనం చూస్తుంటాం. అయితే ఆ మాటల్లో నిజమెంత ఉంది అనే విషయంలో మనకు సందేహం కలుగుతుంది. కానీ, కొందరి విషయంలో అది నిజమేననిపిస్తుంది. అలాంటి వారిలో నటుడు చరణ్‌రాజ్‌ ఒకరు. 

కర్ణాటకలోని బెల్గాంకు చెందిన చరణ్‌రాజ్‌ అసలు పేరు బ్రహ్మానంద. స్కూల్‌ డేస్‌ నుంచి కల్చరల్‌ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనేవాడు. పాటలు పాడేవాడు, డాన్సులు చేసేవాడు. కానీ, అతనికి సినిమాల్లో నటించాలన్న కోరిక అసలు ఉండేది కాదట. ఒకసారి కాలేజీలో జరిగిన కల్చరల్‌ కాంపిటీషన్‌లో నాలుగు బహమతులు గెలుచుకున్నాడు చరణ్‌ రాజ్‌. ఫ్రెండ్స్‌తో కలిసి ఆ హ్యాపీ మూమెంట్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటూ ఉండగా, అతని స్నేహితుల్లో ఒకరు ‘నువ్వు అందంగానే ఉన్నావు, డాన్సులు కూడా బాగా చేస్తున్నావు. సినిమాల్లో హీరోగా ట్రై చెయ్యొచ్చు కదా’ అన్నాడు. దానికి చరణ్‌ ‘మనకి సినిమాలెందుకు రా. మా కుటుంబం పరిస్థితి తెలుసు కదా’ అన్నాడు. ఆ మాటలు విన్న గురురాజ్‌భట్‌ అనే స్నేహితుడు చరణ్‌రాజ్‌ని ఉద్దేశించి ‘ఒరేయ్‌.. నువ్వు హీరో అవుతావా? మొహాన్ని అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా?’ అంటూ ఎగతాళి చేశాడు. ఎందుకంటే గురురాజ్‌ అనే కుర్రాడు చాలా అందంగా ఉంటాడు. ఆ ఉద్దేశంతో చరణ్‌రాజ్‌ని అలా అన్నాడు. ఆ మాటలు విన్న చరణ్‌కి విపరీతమైన కోపం వచ్చింది. ‘ఒరేయ్‌.. తప్పుగా మాట్లాడొద్దు. మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు. నేను హీరోని కాలేను అనుకున్నావా?’ అన్నాడు. ‘అది నీవల్ల కాదు..’ అని కొట్టిపారేశాడు గురురాజ్‌. దాన్ని ప్రెస్టీజియస్‌గా తీసుకున్న చరణ్‌ ‘నువ్వు చూస్తూ ఉండు. తప్పకుండా హీరో అవుతాను.. ఇట్సే ఛాలెంజ్‌’ అంటూ శపథం చేశాడు. 

ఆలోచన రావడమే ఆలస్యం.. ఇంట్లో కూడా చెప్పకుండా తండ్రి వ్యాపారం కోసం పెట్టుకున్న కొంత డబ్బు తీసకొని బెంగళూరు ట్రైన్‌ ఎక్కేశాడు. పగలంతా సినిమా అవకాశాల కోసం తిరగడం.. రాత్రయ్యేసరికి హోటల్స్‌లో పాటలు పాడడం.. ఇదీ అతని దినచర్య. అలా ఎనిమిది సంవత్సరాలపాటు విసుగు లేకుండా ప్రయత్నించి ‘పరాజిత’ అనే కన్నడ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్‌ అయాడు. ఆ సినిమా సూపర్‌హిట్‌ అయి 100 రోజులు ఆడింది. ఆ సినిమా తర్వాత పది సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వరసగా సూపర్‌హిట్‌ సినిమాలు చేస్తూ హీరోగా మంచి పొజిషన్‌కి వచ్చాడు. చరణ్‌రాజ్‌ హీరోగా నటించిన ఏడు సినిమాలు వరసగా హిట్‌ అయ్యాయి. అప్పుడు చరణ్‌రాజ్‌ బెల్గాంకు చెందినవాడని అందరికీ తెలిసిపోయింది. అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. ఆ టైమ్‌లో చరణ్‌రాజ్‌కి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాని కోసం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కారులో వస్తున్న చరణ్‌రాజ్‌ని చూసి అతని స్నేహితుడు గురురాజ్‌భట్‌ హార్ట్‌ఫుల్‌గా కంగ్రాట్యులేట్‌ చేశాడు. అది తన జీవితంలో మర్చిపోలేని రోజు అని చెబుతాడు చరణ్‌రాజ్‌. ‘నువ్వు గొప్పవాడివా.. నీ ఫ్రెండ్‌ గురురాజ్‌భట్‌ గొప్పవాడా?’ అని ఎవరైనా అడిగితే.. తను అంత పెద్ద నటుడు అవ్వడానికి, అంత పేరు తెచ్చుకోవడానికి కారణం అతనే కాబట్టి తనకంటే గురురాజ్‌ గొప్పవాడని చెప్తాడు చరణ్‌రాజ్‌. అలా ఒక ఫ్రెండ్‌తో ఛాలెంజ్‌ చేసి హీరో అయి, ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 400 సినిమాల్లో నటించాడు చరణ్‌రాజ్‌.