Read more!

English | Telugu

తథాస్తు దేవతలు ఆయన మాట విన్నారు.. ఒక మంచి నటుడికి అన్యాయం చేశారు!

ఎంతో మంది నటీనటులు తమ నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. అయితే ఒక్కొక్కరిది ఒక్కో శైలి. తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న వారే సినిమాల్లో బాగా రాణిస్తారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి వారిలో నూతన్‌ప్రసాద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎవ్వరినీ అనుకరించకుండా తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్‌ చేసుకున్న నూతన్‌ప్రసాద్‌ జీవితం ఎంతో విభిన్నమైనది. ఆయన సినీ ప్రస్థానం ఎన్నో విశేషాలతో కూడుకున్నది. పైన ‘తథాస్తు దేవతలు ఉంటారు.. మన నోటి నుంచి వచ్చే మాటలు కొన్నిసార్లు నిజం అవుతాయి’ అని పెద్దలు అంటుంటారు. అది నూతన్‌ ప్రసాద్‌ విషయంలో అక్షరాల నిజమైంది. 

నూతన్‌ ప్రసాద్‌ అసలు పేరు తాడినాడ సత్యదుర్గా వరప్రసాద్‌. 1945 డిసెంబర్‌ 12న కైకలూరులో జన్మించారు. ఆయన తండ్రి సుబ్బారావు కైకలూరు సమితి కార్యాలయంలో గుమస్తాగా పనిచేసేవారు. ఆర్థికంగా అంత ఉన్నతమైన కుటుంబం కాకపోవడంతో ప్రసాద్‌ తల్లి శ్యామలాదేవి బట్టలు కుడుతూ కుటుంబాన్ని నడిపించేది. 1965లో వరప్రసాద్‌  ఐటిఐ పూర్తి చేసి ఇరిగేషన్‌ డిపార్డ్‌మెంట్‌లో చిన్న ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చి హెచ్‌ఎఎల్‌ సంస్థలో చేరారు. అక్కడే రంగస్థల నటుడు, దర్శకుడు భాను ప్రకాష్‌ పరిచయమయ్యారు. ఆయన ద్వారానే నాటకరంగంలో ప్రవేశించారు. సాధారణంగా చిన్నతనం నుంచి సినిమాల్లోకి వెళ్ళాలనే కుతూహలం తమకు ఉందని నటీనటులు చెబుతుంటారు. కానీ, వరప్రసాద్‌ మాత్రం 20 సంవత్సరాలు దాటిన తర్వాతే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. నాటకాల్లో వరప్రసాద్‌ నటన చూసి అతని తల్లి ఎంతో పొంగిపోయేది. నటుడుగా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని అతన్ని ప్రోత్సహించేది. దాదాపు పదేళ్లు రంగస్థలాన్నే అంటిపెట్టుకొని ఉన్నారు వరప్రసాద్‌. అతని నాటకం చూసిన పినిశెట్టి శ్రీరామ్మూర్తి.. అతని ఫోటోలు తీసుకొని ‘నీడలేని ఆడది’ చిత్రంలో అవకాశం ఇప్పించారు. అయితే మొదట విడుదలైన సినిమా మాత్రం ‘అందాల రాముడు’. వరప్రసాద్‌ నటించిన మూడో సినిమా ‘ముత్యాలముగ్గు’. ఈ సినిమాలో అతను చేసిన నిత్య పెళ్లికొడుకు పాత్ర అందర్నీ మెప్పించింది. అయితే అవకాశాలు అనుకున్న స్థాయిలో రాలేదు. ఆరోజుల్లో ప్రసాద్‌ చాలా సన్నగా ఉండేవాడు. బీరు తాగితే బుగ్గలు వస్తాయని మిత్రులు సలహా ఇవ్వడంతో  తాగడం అలవాటైంది. తనకు సినిమా అవకాశాలు ఎక్కువగా రావడం లేదన్న బాధతో కాస్త ఎక్కువ తాగడం మొదలెట్టాడు. మందు తాగకపోతే చేతులు వణికే స్థితి వరకూ వెళ్లిపోయాడు. అప్పుడు ఒక్కసారిగా అతను ఇహలోకంలోకి వచ్చాడు వరప్రసాద్‌. తన ఆరోగ్యం ఎలా ఉందో టెస్టు చేయించుకోవాలనుకున్నాడు. ఆరోగ్యం బాగుందని డాక్టరు చెబితే మందు మానేద్దాం.. ఏదైనా జబ్బు ఉంది అంటే ఇంకా తాగి చచ్చిపోదాం అని డిసైడ్‌ అయ్యాడు. అన్ని టెస్టులు చేసిన డాక్టరు అతనికి ఏ జబ్బూ లేదని చెప్పాడు. అంతే. వరప్రసాద్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇక అప్పటి నుంచి మందు మానేశాడు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు కాబట్టి తన పేరును నూతన్‌ప్రసాద్‌గా మార్చుకున్నాడు. 

‘చలిచీమలు’ చిత్రంలో నూటొక్క జిల్లాల అందగాడుగా, ‘రాజాధిరాజు’ చిత్రంలో సైతానుగా, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రంలో ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు’ అంటూ డైలాగులు చెప్పే పోలీస్‌ పాత్రలో జీవించాడు నూతన్‌ప్రసాద్‌. చలిచీమలు, కలియుగ మహాభారతం, పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రాల్లోని డైలాగులు అప్పట్లో గ్రామఫోన్‌ రికార్డులలో వచ్చి ఎంతో పాపులర్‌ అయ్యాయి. డైలాగ్‌ మాడ్యులేషన్‌, డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌, నటనలో కొత్తదనం ఆయన్ని నటుడిగా ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. 

1989 ఫిబ్రవరి 1 నూతన్‌ప్రసాద్‌కి దుర్దినం. తథాస్తు దేవతలు ఉంటారు అని అతనికి తెలిసొచ్చిన రోజు అది. రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించిన ‘బామ్మమాట బంగారు బాట’ చిత్రంలో భానుమతికి భర్తగా నటించాడు నూతన్‌ప్రసాద్‌. ఒకరోజు ‘అబ్బా చచ్చానురా.. నా వెన్నుపూస విరిగింది’ అనే డైలాగుతో షూటింగ్‌ మొదలైంది. ఆ డైలాగు చెప్పిన వేళా విశేషం ఏమిటోగానీ, నిజంగా ఆరోజు అలాగే జరిగింది. గాలిలో ఉన్న కారులో రాజేంద్రప్రసాద్‌, నూతన్‌ ప్రసాద్‌ ఉన్నారు. ప్రమాదవశాత్తూ కొన్ని అడుగుల ఎత్తు నుంచి కారు కింద పడిపోయింది. నూతన్‌ప్రసాద్‌ వెన్నుపూస విరిగిపోయి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఆయన ఆ ప్రమాదంతో వీల్‌చైర్‌కే పరిమితమైపోయారు. అయినా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. ‘కర్తవ్యం’ చిత్రం నుంచి కూర్చొని నటించడం మొదలుపెట్టారు. ఈ ప్రమాదానికి ముందు 365 సినిమాల్లో నటించిన నూతన్‌ప్రసాద్‌ యాక్సిడెంట్‌ తర్వాత 110 సినిమాల్లో నటించారంటే నటనను ఆయన ఎంత దైవంగా భావించారో, ఎంతగా ఆరాధించారో అర్థం చేసుకోవచ్చు. 

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూతన్‌ప్రసాద్‌ను రవీంద్రభారతికి సెక్రటరీగా నియమించారు. 1964లో నూతన్‌ప్రసాద్‌ నటనకు శ్రీకారం చుట్టింది రవీంద్రభారతిలోనే. తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 2011 మార్చి 30న నూతన్‌ప్రసాద్‌ తుదిశ్వాస విడిచారు.