Read more!

English | Telugu

హీరోయిన్‌ మృతదేహాన్ని ఎత్తుకుపోయిన దొంగలు.. ఇప్పటికీ అది మిస్టరీనే!

పాతతరం నటీమణులకు నటనతోపాటు సంగీతంలోనూ ప్రవేశం ఉండేది. కొందరు హీరోయిన్లు సినిమాల్లోని తమ క్యారెక్టర్లకు సంబంధించిన పాటలను కూడా తామే పాడుకునే వారు. అలాంటి వారిలో ఎస్‌.వరలక్ష్మీ, భానుమతి, కన్నాంబ ముఖ్యులు. వీరంతా నటనలో, సంగీతంలో మేటి అనే పేరు తెచ్చుకున్నారు. వారిలో కన్నాంబ జీవితం ఎంతో వైవిధ్యంగా ఉండేది. ఆమె చనిపోయిన తర్వాత మరెంతో విషాదంగా మారింది. 

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1912లో జన్మించిన కన్నాంబ 13 సంవత్సరాల వయసులో బాలనటిగా రంగస్థలం మీద తన ప్రతిభను చాటుకున్నారు. ఆ అనుభవంతోనే 1935లో ‘హరిశ్చంద్ర’ చిత్రంలో చంద్రమతిగా, ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ చిత్రంలో ద్రౌపదిగా అధ్బుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత పాదుక, చంద్రిక, కనకతార, పల్నాటి యుద్ధం, గృహలక్ష్మి, అనార్కలి, దక్షయజ్ఞం, తోడికోడళ్ళు, కృష్ణ కుచేల ఆమె కెరీర్‌లో చేసిన ముఖ్యమైన సినిమాలు. ఎం.జి.రామచంద్రన్‌, ఎన్‌.ఎస్‌.రాజేంద్రన్‌, శివాజీగణేశన్‌, నాగయ్య, పి.యు.చిన్నప్ప, నందమూరి తారక రామారావు వంటి ప్రముఖ హీరోలతో కలిసి 150కి పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారు కన్నాంబ. 

కడారు నాగభూషణంని వివాహం చేసుకుని శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ స్థాపించి తెలుగు తమిళ భాషల్లో 22 చిత్రాలు నిర్మించారు. సుమతి, పాదుకాపట్టాభిషేకం, సౌదామిని, పేదరైతు, లక్ష్మి, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణతులాభారం, నాగపంచమి మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది. జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాకముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేది ఆ కంపెనీ. ఆరోజుల్లో కన్నాంబ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించినా ఆమెకు గ్లామర్‌లో ఎవరూ సాటి వచ్చేవారు కాదు. హీరోయిన్‌లాగే వుండేవారు. సినిమాల్లో హీరోయిన్లు ధరించే చీరలను, ఇతర వస్తువులను ప్రస్తుతం వారి పేర్లతో, వారు నటించిన సినిమాల పేర్లతో సేల్‌ చేస్తున్నారు. ఈ తరహాలో 60 సంవత్సరాల క్రితమే ’కాంచనమాల గాజులు’, కన్నాంబ లోలాకులు‘ అంటూ అమ్మేవారు. నటిగా, నిర్మాతగా కన్నాంబ ఎన్నో ఆస్తులు సంపాదించారు. అయితే ఆమె మరణం తర్వాత ఆమె స్థాపించిన కంపెనీ, ఆస్తులు అన్నీ కరిగిపోయాయి. అవి ఎలా పోయాయో ఎవ్వరికీ అర్థం కాలేదు. కన్నాంబ మరణం తర్వాత ఆమె భర్త నాగభూషణం చివరిరోజుల్లో ఒక చిన్న గదిలో కాలక్షేపం చేసేవారట. 

అన్నింటినీ మించి కన్నాంబకు సంబంధించిన ఒక విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. వారి కులాచారం ప్రకారం భార్య చనిపోతే మృతదేహానికి నగలు ధరింపజేసి యధాతథంగా పూడ్చి పెట్టాలి. ఆ ప్రకారమే కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇది జరిగిన రెండు రోజులకే పూడ్చి పెట్టిన మృతదేహాన్ని బయటికి తీసి ఆ నగలన్నీ కాజేశారు దొంగలు. అంతేకాదు, ఆమె మృతదేహాన్ని కూడా మాయం చేశారు. ఆ తర్వాత పోలీసులు దీని గురించి విచారణ చేపట్టారు. కానీ, కన్నాంబ మృతదేహం ఏమైపోయింది అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.