English | Telugu

‘ప్రేమించుకుందాం రా’లో ఐశ్వర్యారాయ్‌ నటించాల్సింది.. ఆ అవకాశం అంజలా జవేరికి దక్కింది!

వెంకటేష్‌ హీరోగా జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమించుకుందాం..రా’ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే.1997లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి శతదినోత్సవ చిత్రమైంది. ఈ సినిమా ప్రారంభం కావడానికి ముందు ఇందులో హీరోయిన్‌ ఎవరైతే బాగుంటుంది అనే విషయంలో ఎన్నో చర్చలు జరిగాయి. చివరికి బాలీవుడ్‌ హీరోయిన్‌ అయితే బాగుంటుందని అందరూ భావించారు. జయంత్‌కి తన ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ ద్వారా ఐశ్వర్యారాయ్‌తో పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఆమెను హీరోయిన్‌గా తీసుకుంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని చెప్పారు. ఈ విషయాన్ని నిర్మాతతోపాటు చిత్ర యూనిట్‌ కూడా వ్యతిరేకించారట. ఎందుకంటే అప్పటికే మణిరత్నం దర్శకత్వంలో ఆమె చేసిన ‘ఇరువర్‌’ చిత్రం ఫ్లాప్‌ అయింది. దాన్ని సెంటిమెంట్‌గా భావించి ఐశ్వర్యను హీరోయిన్‌గా తీసుకోలేదు. అప్పుడా అవకాశం అంజలా జవేరికి దక్కింది. అయితే ఆ తర్వాత ఐశ్వర్యారాయ్‌ చేసిన సినిమాలు వరసగా సూపర్‌హిట్‌ అవ్వడంతో ఆమె బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ అయిపోయింది. దాంతో ఆమెను తెలుగులో హీరోయిన్‌గా బుక్‌ చేసుకునే సాహసం ఎవ్వరూ చెయ్యలేదు.

జయంత్‌ దర్శకత్వంలోనే వచ్చిన మరో సినిమా ‘రావోయి చందమామ’ చిత్రంలోని ఓ స్పెషల్‌ సాంగ్‌లో ఎవరైనా బాలీవుడ్‌ హీరోయిన్‌ చేస్తే బాగుంటుందని ప్రీతి జింటాను సంప్రదించేందుకు ముంబై వెళ్ళారు జయంత్‌. ఆ సమయంలో అతనికి ఐశ్వర్యారాయ్‌ తారసపడిరది. జయంత్‌ ముంబయి ఎందుకు వచ్చాడో తెలుసుకున్న ఐశ్వర్య ‘మీ సినిమాలో హీరోయిన్‌గా నటించమని ఎంతో మందిని అడుగుతారు. మరి నన్నెప్పుడూ అడగరు ఎందుకని’ ప్రశ్నించింది. చెప్పాలా వద్దా అనే మీమాంసతోనే ‘ప్రేమించుకుందాం..రా’ సినిమా విషయాన్ని ఆమెకు చెప్పాడు జయంత్‌. అర్థం చేసుకున్న ఐశ్వర్య ‘రావోయి చందమామ’ చిత్రంలో ఒక పాట చేయడానికి ఒప్పుకుంది. అలా తెలుగులో ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా ‘రావోయి చందమామ’. ఆ తర్వాత తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయలేదు. ఐశ్వర్యారాయ్‌ హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఇరువర్‌’. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే ‘రావణన్‌’, ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రాల్లో నటించింది. ఇక శంకర్‌ దర్శకత్వంలో ‘జీన్స్‌’, ‘రోబో’ చిత్రాల్లో నటించింది. తెలుగులో మాత్రం హీరోయిన్‌గా ఒక్క సినిమా కూడా చేయలేదు ఐశ్వర్య.